
విజయవాడ: ఆగస్టు,18( తెలుగు న్యూస్ పవర్. కామ్) స్థానిక
ఏ ప్లస్ కన్వెన్షన్ సెంటర్లో ‘విబి ఎంటర్టైన్మెంట్స్’ ఆధ్వర్యంలో ‘సేవ్ ఆర్టిస్ట్ – సేవ్ టాలెంట్’ థీమ్‌తో మంగళవారం నిర్వహించిన “వెండితెర – ఓటీటీ అవార్డ్స్ 2025-26” కార్యక్రమంలో రాష్ట్ర సినిమా ఆటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అవార్డు విజేతలకు పురస్కారాలు అందజేశారు.
కళలను, కళాకారులను ప్రోత్సహించడంతో పాటు, తెలుగు చిత్ర పరిశ్రమ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని మంత్రి వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్‌లో సినిమా షూటింగ్‌లకు ఉచితంగా, సింగిల్ విండో విధానంలో వేగంగా అనుమతులు అందించేలా చర్యలు తీసుకుంటున్నారు. రాష్ట్రంలోని సహజ సౌందర్యంతో, అద్భుతమైన లొకేషన్లను చిత్ర పరిశ్రమ మరింతగా వినియోగించుకునేలా ప్రోత్సహిస్తున్నామని పేర్కొన్నారు.ఆంధ్రప్రదేశ్‌లో డబ్బింగ్, రికార్డింగ్, రీ-రికార్డింగ్ థియేటర్లు వంటి సినీ మౌలిక వసతులు అభివృద్ధి చేసేందుకు ముందుకు వచ్చే నిర్మాతలు, సంస్థలకు అవసరమైన సహకారం అందించేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉంటుందని హామీ ఇచ్చారు . ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ల నాయకత్వంలో రాష్ట్రంలో సినీ పరిశ్రమను మరింత విస్తరించే దిశగా ముందుకు సాగుతున్నామని తెలిపారు.
హైదరాబాద్ తరహాలో విజయవాడను కూడా సినీ కార్యక్రమాలు, అవార్డు వేడుకలు, సాంస్కృతిక కార్యక్రమాలకు ప్రధాన వేదికగా తీర్చిదిద్దాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఇలాంటి కార్యక్రమాలు ప్రతి ఏడాది మరింత ఘనంగా నిర్వహిస్తూ కళాకారులకు ప్రోత్సాహాన్ని అందించాలన్నారు.
ఈ సందర్భంగా ‘ఉత్తరం’ చిత్రంలోని పాటను ఆవిష్కరించడం సంతోషంగా ఉందన్నారు. పల్లెటూరి ప్రేమకథగా తెరకెక్కుతున్న ఈ చిత్రం మంచి విజయం సాధించాలని, చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు.
‘వెండితెర – ఓటీటీ అవార్డ్స్’ ద్వారా ప్రతిభావంతులైన కళాకారులు, సాంకేతిక నిపుణులను గుర్తించి సత్కరించడం అభినందనీయమని. కళాకారుల సంక్షేమం, తెలుగు చిత్ర పరిశ్రమ అభివృద్ధి, ఆంధ్రప్రదేశ్‌ను సినిమా నిర్మాణాలకు అనుకూలమైన గమ్యస్థానంగా తీర్చిదిద్దే దిశగా కూటమి ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని వివరించారు. ఈ కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది. పలువురు సినీ, బుల్లితెర నటీనటులు, సాంకేతిక నిపుణులు హాజరయ్యారు.