జనరల్ డెస్క్: ఆగస్టు, 25( తెలుగు న్యూస్ పవర్. కామ్)
సినిమా సమాజాన్ని ప్రభావితం చేసే శక్తివంతమైన మాధ్యమం. తెరపై ఒక పాత్రను, ఒక వృత్తిని, ఒక వ్యవస్థను ఏ విధంగా చూపిస్తామో, అది ప్రేక్షకుల మనసులో చాలా కాలం ముద్రగా నిలిచిపోతుంది. అందుకే ప్రభుత్వ పాఠశాల, ప్రభుత్వ ఉపాధ్యాయుడు, ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు వంటి అంశాలను తెరపై చూపించేటప్పుడు మరింత సామాజిక బాధ్యత అవసరమని ఉపాధ్యాయ సంఘాలు విజ్ఞప్తి చేస్తున్నాయి.
‘ఇరుముడి’ సినిమాలో ఒక ఉపాధ్యాయురాలి పాత్రను అత్యంత ప్రతికూలంగా, దారుణంగా చిత్రీ కరించడం పట్ల వారు ఖేదం వ్యక్తం చేస్తున్నారు.
ఈ అభ్యంతరం కేవలం ఒక కల్పిత పాత్రను చెడుగా చూపించడంపై కాదు. ఆ పాత్ర వెనుక ప్రభుత్వ పాఠశాల, ఆమె చుట్టూ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు, వారి ఒంటిపై ప్రభుత్వ పాఠశాల యూనిఫాం కనిపించడం అసలు సమస్య అని వారు పేర్కొన్నారు.
ఒక వ్యక్తి పాత్రలోని ప్రతికూలతను చూపించడానికి మొత్తం ప్రభుత్వ పాఠశాల వ్యవస్థను ఒక చీకటి వాతావరణానికి నేపథ్యంగా మార్చాల్సిన అవసరం ఏమిటని ఉపాధ్యాయ లోకం ప్రశ్నిస్తుంది.
ప్రభుత్వ పాఠశాల అంటే కేవలం ఒక భవనం కాదు,
ప్రభుత్వ పాఠశాలలో చదివే ప్రతి విద్యార్థి వెనుక ఒక కుటుంబం ఆశ ఉంటుంది.
పేద తండ్రి ఆశయం
తల్లి కల విద్యార్థి భవిష్యత్తు
ఉపాధ్యాయుడి బాధ్యత
ప్రభుత్వ పాఠశాలపై సమాజం నమ్మకం ఉంటాయి.
అలాంటి పాఠశాల పిల్లలను ఒక ప్రతికూల కథనానికి కేవలం నేపథ్యంగా ఉపయోగించినప్పుడు, వారి యూనిఫాం కూడా ఆ ప్రతికూలతకు ఒక గుర్తుగా ప్రేక్షకుల మనసులో నిలిచిపోయే ప్రమాదం ఉంది.
వేలాది ఉపాధ్యాయుల సేవలను మరచిపోవద్దని,
ప్రభుత్వ ఉపాధ్యాయుడు కేవలం తరగతి గదిలో పాఠాలు చెప్పే వ్యక్తి కాదని,
విద్యార్థి చదువులో వెనుకబడితే అదనపు శ్రద్ధ తీసుకుంటాడు.
విద్యార్థి పాఠశాలకు రాకపోతే తల్లిదండ్రులను సంప్రదిస్తాడు.
కుటుంబ సమస్యల్లో ఉన్న పిల్లలకు అండగా నిలుస్తాడు.
గ్రామీణ ప్రాంతాల్లో విద్యా వ్యవస్థకు బలమైన వారధిగా పనిచేస్తాడు.
వేలాది పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దడంలో కీలక పాత్ర పోషిస్తాడని వారు వివరించారు.
అలాంటి మొత్తం ఉపాధ్యాయ సమాజాన్ని ఒక ప్రతికూల పాత్ర నీడలో చూడటం బాధాకరమని వాపోయారు.
సినిమాటిక్ లిబర్టీకి కూడా సామాజిక బాధ్యత ఉంటుందని గుర్తు చేశారు.
సినిమా సృజనాత్మక కల్పనను ఎవరూ వ్యతిరేకించరు,
అవినీతిని చూపించకూడదని కాదు. విద్యా వ్యవస్థలోని లోపాలను ప్రశ్నించకూడదని కాదు, తప్పు చేసే ఉపాధ్యాయుడి పాత్రను సృష్టించకూడదని కాదు.
కానీ ఒక వ్యక్తి తప్పును చూపించడానికి మొత్తం వ్యవస్థ ప్రతిష్ఠను దెబ్బతీయకూడదని వారు విజ్ఞప్తి చేశారు.
ఒక ఉపాధ్యాయుడి తప్పును చూపించండి, కానీ వేలాది నిజాయితీగల ఉపాధ్యాయుల వృత్తి గౌరవాన్ని కించపరచకుండా చూపించాలన్నారు.
యూనిఫాం కేవలం సినిమా కాస్ట్యూమ్ కాదు,
ప్రభుత్వ పాఠశాల విద్యార్థి యూనిఫాం వెనుక ఒక సామాజిక గుర్తింపు ఉందన్నారు.
ఆ యూనిఫాం ధరించిన పిల్లలు మన గ్రామాల పిల్లలు, మన కుటుంబాల పిల్లలు, మన సమాజం భవిష్యత్తు.అందుకే ఆ యూనిఫాంను ఒక దుర్మార్గపు కథనంతో పదేపదే అనుసంధానం చేయడం మరింత బాధ్యతతో ఆలోచించాల్సిన అంశమని తెలిపారు.
ఉపాధ్యాయుడి బాధను సమాజం అర్థం చేసుకోవాలి
తన కూతురికి జరిగిన అన్యాయంతో ఒక తండ్రి మనసు దెబ్బతినడం సహజం. అదే సమయంలో, ఆ కథనంలో ప్రభుత్వ ఉపాధ్యాయ సమాజం మొత్తాన్ని ప్రతికూలంగా ప్రతిబింబించేలా పాత్రను మలచడం వేలాది మంది ఉపాధ్యాయుల మనసులను కూడా బాధిస్తుందని గమనించాలన్నారు.
పోలీసు వ్యవస్థలాగా, రాజకీయ వ్యవస్థలాగా విద్యా వ్యవస్థను కేవలం ఒక అధికార వ్యవస్థగా చూడలేమన్నారు.
విద్యా వ్యవస్థకు గ్రామంతో, విద్యార్థులతో, తల్లిదండ్రులతో రోజువారీ మానవ సంబంధం ఉంటుందని తెలుసుకోవాలన్నారు. ఒక ప్రభుత్వ ఉపాధ్యాయుడు తన విద్యార్థిని కేవలం ఒక రోల్ నంబర్‌గా చూడక
ఆ పిల్లవాడి భవిష్యత్తును తన బాధ్యతగా భావిస్తాడని తెలిపారు.ఈ అభ్యంతరం సినిమా స్వేచ్ఛకు వ్యతిరేకం కాదు. ఇది ఉపాధ్యాయ వృత్తి గౌరవం కోసం,ప్రభుత్వ పాఠశాలల ప్రతిష్ఠ కోసం
ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల గౌరవం కోసం
వేలాది నిజాయితీగల ఉపాధ్యాయుల ఆత్మగౌరవం కోసం మాత్రమేనని గుర్తించాలన్నారు.
ఒక పాత్రను ఎంత ప్రతికూలంగా అయినా సృష్టించవచ్చు.
కానీ ఆ పాత్రకు నేపథ్యంగా మొత్తం ఉపాధ్యాయ సమాజం గౌరవాన్ని తాకట్టు పెట్టకూడదని హితవు పలికారు.
తెరపై రెండు గంటలు కనిపించే సినిమా ముగిసిపోతుంది.
కానీ తెరపై ఏర్పడిన సామాజిక ముద్ర మాత్రం చాలా కాలం నిలిచిపోవచ్చు. ఇది ఆయా వర్గాలపై శాశ్వత ప్రతికూల ముద్ర వేస్తుందని ఉపాధ్యాయులు వాపోతున్నరు.