Skip to main content

Telugu News Power

శ్రీ అద్దేపల్లి ప్రభుత్వ కళాశాలలో ఘనంగా గిడుగు జయంతి ఉత్సవం.

గిడుగుకు నివాళులర్పిస్తున్న రత్న మాణిక్యం

పాలకొల్లు: ఆగస్టు,29( తెలుగు న్యూస్ పవర్. కామ్)
స్థానిక శ్రీ అద్దేపల్లి సత్యనారాయణ మూర్తి ప్రభుత్వ స్వయం ప్రతిపత్తి కళాశాల, తెలుగు విభాగం ఆధ్వర్యంలో ఘనంగా తెలుగు భాషా దినోత్సవం జరిగింది. వ్యావహారిక భాషోద్యమ పితామహుడు గిడుగు వెంకట రామమూర్తి పంతులు జయంతి సందర్భంగా ఈ కార్యక్రమాన్ని శనివారం ఏర్పాటు చేశారు. తెలుగు విభాగాధిపతి, డా బూసి వెంకటస్వామి అధ్యక్షత వహించగా, కళాశాల ప్రిన్సిపాల్ డా కె రత్నమాణిక్యం ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తొలుత గిడుగు వెంకట రామమూర్తి పంతులు చిత్రపటానికి అతిథులందరూ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్భంగా ముఖ్య అతిథి, ప్రిన్సిపాల్ డా కె రత్నమాణిక్యం మాట్లాడుతూ, మాతృభాష తెలుగును పరిరక్షించుకోవాల్సిన
బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. ఆధునిక కాలంలో ఆంగ్ల భాషా ప్రభావం పెరుగుతున్నప్పటికీ, మన సంస్కృతి, సంప్రదాయలకు అలంబనగా నిలిచిన తెలుగు భాషా ప్రాధాన్యతను యువత మరువకూడదని పేర్కొన్నారు. విద్యార్థులు తమ భావవ్యక్తీకరణను మాతృభాషలోనే మరింత సృజనాత్మకంగా చేయగలరని స్పష్టం చేశారు. ఒక వ్యక్తి శక్తిగా మారితే ఎటువంటి అద్భుత ఫలితాలు సాధించవచ్చో వెంకట రామమూర్తి పంతులు నిరూపించారన్నారు.గ్రాంథిక భాషా వాదుల పాండితీ ప్రకర్షను, ప్రతిభా గరిమను గిడుగు వారు భాషా మధనం చేసి వ్యవహారిక భాషామృతాన్ని ప్రజలు చెంతకు చేర్చిన మహనీయుడని కొనియాడారు. తెలుగు భాషకు వెలుగులు అద్దిన అక్షర తపస్వి గిడుగని ప్రస్తుతించారు. ఒకవైపు తెలుగు భాషకు, మరొకవైపు సవర భాషకు వెలుగులు నింపి భాషా చరిత్రలో సుస్థిర స్థానం సంపాదించారన్నారు.
సభాధ్యక్షులు, తెలుగు విభాగాధిపతి డా బూసి వెంకటస్వామి మాట్లాడుతూ, గిడుగు వెంకట రామమూర్తి గ్రంథస్థ భాషకే పరిమితమైన తెలుగును, సామాన్యుడి చెంతకు చేర్చి,వ్యావహారిక భాషను పల్లకీలో ఊరేగించిన భాషా పరిరక్షణోద్యమ పితామహుడన్నారు.విద్యార్థులు తెలుగు సాహిత్యంపై పట్టు సాధించి, నిరంతరం భాషా వికాసానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు .ఆత్మీయ అతిథులుగా విచ్చేసిన వైస్ ప్రిన్సిపాల్ టి. కృష్ణ, అకడమిక్ కోఆర్డినేటర్ జి సుమలత, జె కె సి కోఆర్డినేటర్ కె శామ్యూల్, జంతు శాస్త్ర విభాగాధిపతి డా ఎం రామకృష్ణ,అర్థశాస్త్ర విభాగాధిపతి డా వి డి వి విజయలక్ష్మి లు మాట్లాడుతూ తెలుగు భాషా గొప్పదనాన్ని, నిత్య జీవితంలో మాతృభాష ప్రాముఖ్యతను విద్యార్థులకు వివరించి, తమ సందేశాలతో స్ఫూర్తినింపారు.ఈ కార్యక్రమంలో జంతు రసాయన శాస్త్ర విభాగాధిపతి, వంశీ సుబ్బరాయన్, వృక్షశాస్త్ర విభాగాధిపతి, పితాని శ్రీనివాసరావు, శారీరక విద్యా సంచాలకులు దుర్గారావు, లైబ్రేరియన్ రమేష్, అధ్యాపకులు జి డి శ్రీనివాసరావు,శిరీష, జ్యోత్స్న,హెప్సిబా రాణి, మన్మథరావు, స్వర్ణలత, ఆశా జ్యోతి, రోహిత్ కుమార్,మాధురి,యం శిరీష అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.