Telugu News Power

పడిపోయిన కొబ్బరి ధరలు రాలిపోయిన రైతు ఆశలు

ఆఖరి ఆర్డర్లతో కొబ్బరి ఎగుమతి కి సిద్ధం చేస్తున్న దృశ్యం.

పాలకొల్లు, యలమంచిలి, నవంబర్, 24 ( తెలుగు న్యూస్ పవర్)కొబ్బరి రైతులను ఊహల పల్లకిలో ఊరేగించిన కొబ్బరి ధరలు ఒక్కసారిగా పతనమయ్యాయి. రైతులు, వ్యాపారులు ఇందువల్ల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొబ్బరి ధర చిల్లర వ్యాపారస్తుల దగ్గర 35 నుంచి 40 రూపాయలు వరకు నడిచింది. రైతుకు 25 రూపాయలు వరకు ధర ముట్టింది. గత రెండు సంవత్సరాలుగా, నెమ్మదిగా పెరుగుతూ వచ్చి, గరిష్ట స్థాయికి చేరింది. అయితే ధర పతనం ఒక్క రోజులోనే కుప్పకూలిపోయినట్టు వ్యాపారులు చెబుతున్నారు. ఇందువల్ల వారు ముందస్తు జాగ్రత్తలు తీసుకోలేకపోయామంటున్నారు. ప్రస్తుతానికి వ్యాపారుల దగ్గర లక్ష నుంచి రెండు లక్షల పైబడి కొబ్బరి నిల్వ ఉన్నట్టు చెబుతున్నారు. గతంలో రోజుకు మూడు లారీలు ఎగుమతి అయ్యేవని కొబ్బరి ఎగుమతిదారు కాసా సత్యా తెలిపారు. ప్రస్తుతానికి ఒక్క లారీ కూడా ఎగుమతి చేయడానికి ఆర్డర్లు రావడం లేదన్నారు. యూపీలో చలి వాతావరణం, దీపావళి,కార్తీక మాసం వంటి పండగల సీజన్ ముగియడం వల్ల ఎగుమతులు మందగించాయని వెల్లడించారు. దొడ్డిపట్ల కు చెందిన రైతు చేగుండి సూరిబాబు కొబ్బరి రైతుల పరిస్థితి వివరించారు. నాలుగు దింపిపుల వరకు కొనసాగినసాగిన కొబ్బరి రైతులు ఆశలు, ప్రస్తుతం కనిష్ట స్థాయికి ఒక్కసారిగా పడిపోవడం ఆందోళన కలిగిస్తుందన్నారు. తనకొచ్చే దిగుబడి పై ఆదాయం లక్షన్నర రూపాయలు వరకు తగ్గిపోతుందన్నారు. కొబ్బరి కాయ ఒక్కటి దించడానికి, దాదాపు మూడున్నర నుంచి నాలుగు రూపాయల వరకు ఖర్చు అవుతుందన్నారు. కనీస ధర 16 రూపాయల వరకు ఉంటే రైతుకు కొంతవరకు పరవాలేదు అన్నారు. ప్రస్తుతం ఉన్న10 నుంచి12 రూపాయలు ధర వల్ల రైతుకు తీవ్ర నష్టం జరుగుతుందన్నారు. రెండు సంవత్సరాలుగా దిగుబడి లేని తమిళనాడు రాష్ట్రం నుంచి కొబ్బరి దిగుబడి ఈ ఏడాది ఎక్కువగా రావడం వల్ల ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్లే కొబ్బరి డిమాండ్ తగ్గిందని,ఎగుమతిదారు, చివటపు నాగేశ్వరరావు తెలిపారు. ఈ ధర వల్ల వ్యాపారులు 10 నుంచి11 లక్షల రూపాయలు నష్టపోయే పరిస్థితి వస్తుందని కొబ్బరి వ్యాపారి సుబ్బరాజు ఆందోళన వ్యక్తం చేశారు. కొబ్బరి ఎగుమతి నాలుగు రకాలుగా ఉంటుందన్నారు వల్లభు దుర్గాప్రసాద్. ప్రధాన ఎగుమతి రకం ధర పడిపోవడం వల్ల, మిగతా రకాల పై కూడా ఈ ప్రభావం ఉంటుందని తెలిపారు. కురిడి కొబ్బరి ధర కూడా కొంతమేర తగ్గవచ్చునని అంచనా వేశారు.

       ఉపయోగ గోదావరి జిల్లాలలో కొబ్బరి చెట్టు ఓ కల్ప వృక్షం. తూర్పుగోదావరి జిల్లాలో సుమారు లక్షా పాతిక ఎకరాలు, పశ్చిమగోదావరి జిల్లాలో 65 వేల ఎకరాల్లో సాగుతున్నట్టు 2013 నాటి కొబ్బరి సర్వే ప్రకారం తెలుస్తుంది. ప్రస్తుతం ఈ పంట విస్తీర్ణం తగ్గుముఖం పట్టినట్టు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఉభయగోదావరి జిల్లాలోనే నుంచే కాకుండా, కృష్ణాజిల్లా నుంచి కూడా రోజు వేల సంఖ్యలో కొబ్బరికాయలు ఉభయగోదావరి జిల్లాలకు దిగుమతి అవుతాయి. ప్రత్యక్షంగా పరోక్షంగా లక్షలమంది కొబ్బరి పంటపై ఆధారపడి ఇక్కడ ప్రజలు జీవనం సాగిస్తున్నారు.కొబ్బరి మొక్క తయారు చేయడం దగ్గర నుంచి కొబ్బరి పీచు ఉత్పత్తి వరకు అనేక దశల్లో ఎందరో ఉపాధి పొందుతున్నారు. పరిసర పట్టణాల నుంచి వచ్చే మహిళలకు కూడా పల్లెటూర్లోని కొబ్బరి వర్తకులు, ప్రతిరోజు తమ వద్ద పని కల్పిస్తారు. ఇక్కడ ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారు కూడా కొబ్బరి పీచు పరిశ్రమలు స్థాపిస్తున్నారు. ఇతర దేశాలకు ఎగుమతి చేయడం ద్వారా దేశానికి విదేశీ మారకద్రవ్యం ఆర్జించి పెడుతున్నారు. ఇక్కడ దొరికే కొబ్బరి ఫైబర్ పొడవు తక్కువగా ఉండటం, కొంచెం ముతకగా ఉండటం వల్ల క్వాలిటీ పరంగా విదేశీ మార్కెట్లో కొంత ధర తక్కువ పలుకుతుందని తెలిసింది. ఇతర రాష్ట్రాల నుంచి లారీల్లో కార్లు, మోటార్ సైకిళ్ళు ఉభయగోదావరి జిల్లాలో దిగుమతి అవుతాయి. వారికి నమ్మకంగా తిరుగు కిరాయి కొబ్బరి ఎగుమతి ద్వారా గిట్టుబాటు అవుతుంది. ఇంతకుమించి ఈ ప్రాంతాల్లో కొబ్బరి దిగుమతికి తగిన విధంగా ప్రాసెసింగ్ యూనిట్లు లేవు. అందువల్ల రైతులు, వ్యాపారాలు ఇతర రాష్ట్రాల్లోని ప్రాసెసింగ్ యూనిట్లకు, స్థానిక అవసరాలకు ఎగుమతి చేస్తారు. దీంతో కొబ్బరి ధర స్థిరంగా లేక ఆటుపోట్లకు గురవుతుంది. గాలివాటు లాభాలు రైతులను కొద్దిగా కాలం ఆనందపెట్టి అంతర్దానం అవుతున్నాయి. భారత కొబ్బరి అభివృద్ధి బోర్డు తన కార్యకలాపాలను ఉభయ గోదావరి జిల్లాలకు ఇంకా ఎక్కువ విస్తరించి, రైతుల ఉత్పత్తులకు విలువ జోడించే అవకాశాలు అవకాశాలు కల్పించాలని రైతులకు కోరుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎమ్మెస్ఎంఈల ద్వారా కొబ్బరి ఉత్పత్తుల ప్రాసెసింగ్ యూనిట్లు నెలకొల్పటానికి కొబ్బరి రైతులకు సబ్సిడీతో కూడిన పథకాలు ప్రవేశపెట్టి ప్రోత్సహించాలని రైతులు ఉద్దేశపడున్నారు. ధరలు లేకపోవడం వల్ల కొబ్బరి రైతులు కోకో, పామాయిల్ వంటి ఇతర పంటల వైపు మళ్ళుతున్నారు.పెట్టుబడి ఎక్కువగా, రాబడి తక్కువ కావడం వల్ల కొందరు రైతులు కొబ్బరి తోటల్లో యాజమాన్యం పద్ధతులు కూడా పాటించక వదిలి వేసిన సందర్భాలు కూడా ఉంటున్నాయి. అయితే ఇటీవల ధర పెరగటం వల్ల రైతులు మళ్లీ కొబ్బరి తోటల సంరక్షణ వైపు వెళ్లారు. అతికొద్ది కాలంలోనే ధరలు మళ్ళీ మొదటికి రావడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దేశానికి విదేశీ మారక ద్రవ్యం, స్థానికంగా కోట్ల మందికి ప్రత్యక్షంగా,పరోక్షంగా ఉపాధి కల్పిస్తున్న కొబ్బరి పంట అభివృద్ధికి ప్రభుత్వం ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు, వంటి ఇతర సౌకర్యాలు కల్పించాలని రైతులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు.