పాలకొల్లు:డిసెంబర్,27(తెలుగు న్యూస్ పవర్)
ధనుర్మాసం ఈనెల 16న ప్రారంభమై వచ్చేనెల 14 వరకు కొనసాగుతూంది. ఆడపడుచు గొబ్బెమ్మలతో సంక్రాంతి లక్ష్మికి స్వాగతాలు పలుకుతున్నారు. హరిదాసుల అప్డేటెడ్ వెర్షన్తతో ఖరీదైన ద్విచక్ర వాహనాల నెత్తిన అక్షయపాత్ర పెడుతున్నారు. ఒకప్పుడు హరిదాసులు సాంప్రదాయబద్ధంగా, తమకంఠ స్వరంతో పౌరాణిక గాధలు, తత్వాలు పాడేవారు, ఇప్పుడవి బ్లూటూత్ స్పీకర్లలో వినిపిస్తున్నారు. బుడబుక్కల వారు తెల్లవారుజామున మూడింటికి పల్లెల్లో ప్రవేశించేవారు. ఇప్పుడు డిగ్రీలు చదివిన బుడబుక్కల వారు అందరిలాగే ఉదయాన్నే బయలుదేరుతున్నారు. ఇప్పటికే వారి నోటి వెంట కాస్త ఘాటు వాసన వస్తున్నది. వీరంతా పల్లె, పట్టణాల్లోకి ప్రవేశించారు. గంగిరెద్దులవారు ఇంటింటికి వెళ్లి దీవెనలు అందిస్తున్నారు. ఇదంతా పండగ వాతావరణానికి ప్రతీకలుగా కనిపించే దృశ్యాలు. అయితే ఇందుకు భిన్నమైన, కనపడని అసలు విషయం మరొకటి, తెర వెనక జరిగిపోయింది. సంక్రాంతి పండుగకు ఆలంబనమైన, చారిత్రిక సరదా, నేడు ఆన్లైన్లో పిడకలు అమ్మడం దగ్గరనుంచి, కోట్ల రూపాయల వ్యాపారంగా మారిపోయింది. ఒక్కో గ్రామంలో కనీసం పాతిక లక్షల నుంచి, దాదాపుగా కోటి రూపాయల వరకు ఎస్ పి ఎల్ (సంక్రాంతి పండగ లీగ్) బరులుకు వెలకట్టి వేలంలో పడుకున్నారు. ఐపీఎల్ లో ఆటగాళ్ల సామర్థ్యాన్ని బట్టి ఈ వేలం జరిగితే, ఎస్ పి ఎల్ బరి కురిపించే కాసుల సామర్థ్యం ఆధారంగా జరిగిపోయింది. ఈ వేలం పాటల్లో, కొందరు బినామీ పేర్లు మీద పాడుకుంటే, పాట పెంచడం కోసం డమ్మీలను రంగంలోకి దింపిన సందర్భాలు ఉన్నాయి. మూడు రోజులు పాటు జరిగే సంబరాలు అంబరాన్ని అంటబోతున్నాయి. కోడిపందాలు, పేకాట, గుండాట వంటి జూద క్రీడలు వల్ల వచ్చే ఆదాయమే మిగతా, ఈవెంట్లకు, లంచాలకు సర్దుతారు. సంక్రాంతికి ముఖ్యమైన పిండి వంటలు కొన్నిచోట్ల వచ్చే అతిధులకు ఉచితంగా అందించే సాంప్రదాయం ఉంది. ఈ సందర్భంగా గృహ తయారీదారుల వ్యాపారం ఊపు అందుకుంది. ఇది కొందరి జీవితాల్లో నిజమైన పండగ వెలుగు తీసుకురానునుంది. బరులు తీర్చిదిద్దే క్రమంలో ఎందరికో ఉపాధి లభించింది. పందెం కోళ్ళు గిరాకీ బాగా పెరిగింది. కనీస ధర 50 వేలు పలుకుతుంది. ఇప్పటికే పందెం కోళ్ళు దొంగల పాలవుతున్నాయి. ఆయా పార్టీల నేపథ్యంతో నాయకులు, పెద్ద పండగ సందర్భంగా కొత్తగా బరిలోకి దిగుతున్నారు. వారు తమ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. ఈ సందర్భంగా పండగ సరదాలో రైతులు పాలుపంచుకునేది ఈ ఏడాది తక్కువగానే ఉంటుందన్నారు. పెట్టుబడి కూడా రాని, దిగుబడులతో, దిగాలు పడ్డ రైతు దగ్గర కాసులు గలగలు వినిపించడం లేదు. ఇక బయట ప్రాంతాల నుంచి వచ్చేవారు, సాఫ్ట్వేర్ ఉద్యోగులు, సంపన్నులు మాత్రమే ఈ క్రీడల్లో పందాలు కాసే అవకాశం ఉంది. అధికార మార్పిడి తర్వాత కొన్నిచోట్ల కొన్ని రాజకీయ పార్టీలు వారు బంద్ చేసుకున్నారు. అదే చోట ప్రేక్షకులుగా ఉన్నవారు బరిలోకి దిగుతున్నారు. ఏది ఏమైనా మూడు రోజులపాటు జరిగే ఈ సంక్రాంతి సంబరాలు అంచనాలకు చిక్కని కొన్ని వేల కోట్ల సొమ్ము చేతులు మారనుంది. ఎవరు రాజు అవుతారు, ఎవరు పకీరవుతారరో ఈ మూడునాళ్ళ ముచ్చట తర్వాత తెరపైకి రానుంది. మరిన్ని నెలల పాటు ఈ విశేషాల పై రచ్చబండల చర్చ సాగానుంది. మీ యధావిధిగా సంక్రాంతికి టిక్కెట్లు దొరక్క ఇక్కడ పర్వం కొనసాగుతుంది. కారులో వచ్చేవారు ఖాళీగా వస్తే అవకాశం కోసం ఫోన్లో తెలుసుకుంటున్నారు
ఈ భూమి మీద ఎక్కడ ఉన్నా, అమెరికా అయినా,ఆస్ట్రేలియ అయినా తెలుగు వారందరూ రెక్కలు కట్టుకు వాలిపోయి తెలుగువారి పెద్ద పండగ ప్రపంచానికే వేడుక కానుంది. అందరూ సంక్రాంతి వస్తున్నాం అంటున్నారు.

