Telugu News Power

సంక్రాంతి లోపు వరి నాట్లు వేయాలి

వరి పొలాలు పరిశీలిస్తున్న వ్యవసాయ అధికారులు

పాలకొల్లు: జనవరి,5(తెలుగు న్యూస్ పవర్) రైతులు, పండగ లోపు వరి నాట్లు పూర్తి చేయాలని, పాలకొల్లు వ్యవసాయ శాఖ సహాయ సంచాలకులు మురళీకృష్ణ సూచించారు. మండలంలోని శివదేవుని చిక్కాల, దగ్గులూరు, బల్లిపాడు, లంకలకోడేరు, ఆగర్రు, గ్రామాల్లో సోమవారం వ్యవసాయ అధికారులు పర్యటించారు. మండలంలో దాళ్వా 9750 ఎకరాల్లో సాగుఅవుతుంది. ఇప్పటివరకు 1650 ఎకరాలలో నాట్లు వేశారు. నీటి కొరత లేకుండా దాల్వాపంట పండించడానికి, ఏప్రిల్ లోపు కోతకు వచ్చేలా రైతులు ప్రణాళిక వేసుకోవాలని కోరారు. ప్రస్తుతం మండలంలో వరి నాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. రైతులు దమ్ములో సింగిల్ సూపర్ పాస్పేట్ రెండు నుంచి మూడు బస్తాలు వేసుకోవాలి. పొలంలో కోత కోయగా, వదిలివేసిన గడ్డి పరిమాణాన్ని బట్టి ఈ మోతాదు వేసుకోవాలని వ్యవసాయ అధికారి సూచించారు. మోడు త్వరగా కుళ్ళటానికి ఇది సహాయపడుతుంది. నాట్లు వేయడానికి ముందు, పొలంలో ఎకరానికి ఒక బస్తా కాంప్లెక్స్ ఎరువుకు,25 కేజీల పోటాస్ కలిపి వేయాలని సూచించారు. చేలో ప్రతి రెండు మీటర్లకు, ఒక జానెడు దూరం కాలిబాటలు ఏర్పాటు చేసుకోవాలని తెలియజేశారు. రైతులకు కావలసిన ఎరువులు సిద్ధంగా ఉన్నాయని, యూరియా కొరత లేదని చెప్పారు. మండలంలో రైతులకు 210 మెట్రిక్ టన్నులలో యూరియా సొసైటీల వద్ద 99 మెట్రిక్ టన్నులు, ప్రైవేట్ సంస్థల వద్ద 11 మెట్రిక్ టన్నులు యూరియా సిద్ధంగా ఉందని తెలిపారు. వ్యవసాయ అధికారులు సూచనలు పాటించి రైతులు, వ్యవసాయం లాభసాటిగా పండగలా, చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.