Telugu News Power

ప్రముఖ న్యాయవాది రావూరి చాచా ఇక లేరు.

ప్రముఖ న్యాయవాది రావూరి చాచా

పాలకొల్లు: జనవరి,11(తెలుగు న్యూస్ పవర్) స్థానిక ప్రముఖ న్యాయవాది, రావూరి జవహర్లాల్ నెహ్రూ, చాచా ఆదివారం సాయంత్రం కన్నుమూశారు. వీరి భార్య శ్రీదేవి, ఉపాధ్యాయురాలు, పెద్ద కుమారుడు లాయర్ కాగా, చిన్న కుమారుడు ఇటీవల డిఎస్పీగా బాధ్యతలు స్వీకరించారు. పాలకొల్లు పట్టణంలో అనేక మంది ప్రముఖులతో, సంస్థలతో వీరికి ఆత్మీయ అనుబంధం ఉంది. ప్రజారాజ్యం పార్టీలో చురుకుగా పాల్గొన్నారు. ఓ దశలో వీరికి ఎమ్మెల్యే టికెట్ ఇస్తున్నారని కూడా ప్రచారం జరిగింది. వీరు స్వతహాగా బాల్యం నుంచి కళాకారులు. అనేక నాటకాలలో చిన్నతనం నుంచి పాల్గొని, తనవంతు సహకారం అందించేవారు. నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. గతంలో వీరు అనారోగ్యం ఇబ్బంది పడ్డారు. ఆ తర్వాత, బాగా కోలుకున్నారు. వారి శ్రీమతి, శ్రీదేవి రచించిన”ఆరవ భూతం” పుస్తకావిష్కరణ సభలో, మిత్రులు, గజల్ శ్రీనివాస్, మేడికొండ శ్రీనివాస్ చౌదరి, తదితర మిత్రులతో కలిసి ఉల్లాసంగా పాల్గొన్నారు. కుమారుడు డి.ఎస్.పి కి ఎంపిక కావడంతో, ఆ సందర్భాన్ని పట్టణంలో పలువురిని పిలిచి, ఆనందోత్సాహాల మధ్య పండగలా జరుపుకున్నారు. వీరి బందుమిత్రులు ఈ విషాద వార్తతో దిగ్భ్రాంతికి గురయ్యారు. వీరి బాల్యమిత్రులు, కత్తుల రామ్మోహన్ రావు, తెలుగుదేశం పట్టణ అధ్యక్షులు,గండేటి వెంకటేశ్వరరావు, కోరాడ శ్రీనివాస్ (ఓ ఎస్ డి), గజల్ శ్రీనివాస్, ప్రముఖ నాటక ప్రయోక్త తాళాబత్తుల వెంకటేశ్వర రావు, కంచర్ల నాని, చోడిశెట్టి వెంకటేశ్వర రావు, పాలకొల్లు బారో అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు తలుపుల శ్రీనివాస్, పిల్ల బాలాజీ, తదితరులు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.