Telugu News Power

కన్యకా పరమేశ్వరి మహోన్నత త్యాగమూర్తి – మంత్రి నిమ్మల.

వాసవి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తున్న మంత్రి నిమ్మల, ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ

పెనుగొండ: జనవరి,20(తెలుగు న్యూస్ పవర్)

పవిత్ర పెనుగొండ క్షేత్రంలో,ధర్మం కోసం ప్రాణత్యాగం చేసిన మహోన్నత వ్యక్తి కన్యకా పరమేశ్వరి అని వాసవి మాతను రాష్ట్ర జలవనరుల శాఖామాత్యులు నిమ్మల రామానాయుడు ప్రస్తుతించారు. వాసవి మాత ఆత్మార్పణ పర్వదినం సందర్భంగా, రాష్ట్ర ప్రభుత్వం తరఫున, అధికార లాంఛనాలతో మంత్రి అమ్మవారికి పట్టు వస్త్రాలు కుటుంబ సమేతంగా సమర్పించారు. మాజీ మంత్రి, స్థానిక శాసనసభ్యులు, పితాని సత్యనారాయణ, వాసవి మాతకు పట్టు వస్త్రాలు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ, అధర్మం, అరాచకం, అధికారం, అహంకారం,అన్యాయం రాజ్యమేలుతున్న రోజుల్లో, వాసవి మాత ఒక కన్యగా, సామాన్య పౌరురాలిగా, మహిళగా కనబడినా, ధర్మానికి ప్రతీకగా నిలిచారన్నారు. వ్యక్తి శ్రేయస్సు కంటే, ఆత్మాభిమానం,సమాజ శ్రేయస్సు ముఖ్యమని, కన్యకా పరమేశ్వరి మాత జీవితం స్ఫూర్తినిస్తుందన్నారు. ఆర్యవైశ్య సమాజం, శాంతికాముకులని, వితరణ శీలురని మంత్రి నిమ్మల పేర్కొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు, కూటమి ప్రభుత్వానికి, ఆర్యవైశ్యుల పట్ల ఉన్న చిత్తశుద్ధితో, వాసవి మాత, ఆత్మార్పణ పర్వదినం రాష్ట్ర పండుగగా ప్రకటించారన్నారు. పెనుగొండ పుణ్యక్షేత్రాన్ని, ఇకనుంచి వాసవి పెనుగొండ గా నామాంతరం చేసి, ప్రభుత్వం జీవోలు విడుదల చేసిందన్నారు. వాసవి మాతకు పట్టు వస్త్రాలు సమర్పించడం తమ పూర్వజన్మ సుకృతం అని మంత్రి భక్తి భావం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మంత్రి ఆలయంలో కుటుంబ సమేతంగా విశేష పూజలు చేశారు. అంతర్జాతీయ ఆర్యవైశ్య ప్రముఖులు, మంత్రిని, పట్టు తలపాగా ధరింపచేసి, పట్టు వస్త్రాలతో దంపతులను ఘనంగా సత్కరించారు. రాష్ట్ర ప్రభుత్వం, వాసవి మాత ఆత్మార్పణ దినాన్ని రాష్ట్ర పండుగ ప్రకటించిన మొదటి సారి పట్టు వస్త్రాలు సమర్పించే అదృష్టం మంత్రి నిమ్మల దంపతులకు దక్కింది. వాసవి మాత ఆలయ చరిత్రలో, మొట్టమొదటిసారి పట్టు వస్త్రాల సమర్పించిన మంత్రిగా నిమ్మల పేరు చిరస్థాయిగా నిలిచిపోతుంది.ఈ కార్యక్రమానికి విశేషంగా భక్తులు, సుదూరప్రాంతాల నుంచి విశేషంగా తరలివచ్చారు. ఇప్పటికే ఈ ప్రాంతం అనేక ప్రత్యేకతలతో ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన వాసవి మాత పవిత్ర క్షేత్రంగా విరాజిల్లుతున్నది.