Telugu News Power

అంతర్వేదికి చించినాడ వంతెన సిద్ధం చేయాలి -కలెక్టర్ ఆదేశాలు

అమలాపురం: జనవరి, 24(తెలుగు న్యూస్ పవర్) అంతర్వేది శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి కళ్యాణోత్సవాలు ప్రారంభమవుతున్న సందర్భంగా, చించినాడ వంతెన పై రాకపోకలు పునరుద్ధరించాలని, కలెక్టర్ ఆర్. మహేష్ కుమార్ ఆదేశించారు. అంతర్వేది ఉత్సవ ఏర్పాట్లు గురించి, స్థానిక కలెక్టరేట్ కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో శనివారం కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. అంతర్వేది ఉత్సవాలకు వచ్చే వారికి వీలుగా, ఈనెల 27 నుంచి వచ్చే నెల రెండో తేదీ వరకు చించినాడ బ్రిడ్జి పై బస్సుల రాకపోకలు పునరుద్ధరించనున్నారు. బ్రిడ్జి కింద సాంకేతిక పనులు జరుగుతున్న దృష్ట్యా , భారీ వాహనాల రాకపోకలు రద్దు చేశారు. ప్రస్తుత, రద్దీ పరిస్థితుల్లో తాత్కాలికంగా వంతెన పై 16 టన్నుల లోపు బరువున్న వాహనాలను మాత్రమే అనుమతిస్తారు. భద్రతా కారణాలు దృష్ట్యా, గోదావరి నదిపై ఫంట్ల రాకపోకల మీద పూర్తి నిషేధ ఆజ్ఞలు అమలు చేస్తారు. వంతెనపై నిర్దేశిత మార్గంలో మాత్రమే బస్సులు నడిచేలా, ఆర్టీసీ, పోలీసు శాఖలు నిరంతరం కనిపెట్టి ఉండాలని కలెక్టర్ ఆదేశించారు. రాష్ట్ర వ్యాప్తంగా తరలివచ్చే భక్తులకు ఏ విధమైన అసౌకర్యం కలగకుండా, రవాణా శాఖ,రోడ్లు భవనాల శాఖ, పోలీస్ శాఖలు సమన్వయంతో పనిచేయాలని కోరారు. ఈ సమావేశంలో, జిల్లా ఏఎస్పీ, ప్రసాద్, ఆర్టీవో శ్రీనివాస రావు, ఆర్టీసీ డిపోల మేనేజర్లు పాల్గొన్నారు.