పాలకొల్లు: ఫిబ్రవరి,5(తెలుగు న్యూస్ పవర్) రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ప్రతిష్టాత్మకంగా జరుప తలపెట్టిన సమీకృత కుటుంబ సర్వేకు అందరూ సహకరించాలని పాలకొల్లు మున్సిపల్ కమిషనర్ బి విజయ సారధి, గురువారం తన ఛాంబర్ లో జరిగిన విలేకరుల సమావేశంలో ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ సర్వే లో నమోదైన వారికి మాత్రమే ప్రభుత్వ పథకాలు అందుతాయన్నారు. సర్వే జాబితాలో ఉన్న ప్రతి ఒక్కరికి ప్రభుత్వ ప్రయోజనాలు అందజేయాలనే ఉద్దేశంతో ఈ సర్వే ప్రారంభించినట్టు వెల్లడించారు. పట్టణంలో ఉన్న 14 వార్డు సచివాలయాల సిబ్బంది ఈ సర్వేలో పాల్గొంటున్నారని తెలిపారు. సర్వే సిబ్బంది ఇంటికి వచ్చినప్పుడు కుటుంబానికి సంబంధించిన సమగ్ర వివరాలు వారికి అందజేయాలని సూచించారు. సమగ్ర సర్వేలో వివరాలు నమోదు చేయడానికి ఓటీపీ చెప్పవలసి ఉంటుందన్నారు. పురపాలక సంఘ పరిధిలో ఉన్న ఇరవై వేల కుటుంబాలకు గాను, 6,600 కుటుంబాల సర్వే వివరాలు యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే పథకం లో నమోదు పూర్తయిందని పేర్కొన్నారు. సర్వే పూర్తి అయిన తరువాత రేషన్ కార్డు, ఆధార్ కార్డు వలే సమీకృత కుటుంబ సర్వే కార్డు ఆ కుటుంబానికి అందజేస్తారన్నారు. ఈ కార్డు ద్వారా ప్రభుత్వం అనేక ఆర్థిక ప్రయోజనాలు ఆయా కుటుంబాలకు కల్పిస్తుందని వివరించారు. ప్రజలు తప్పనిసరిగా వారి కుటుంబ సమగ్ర సమాచారం మున్సిపల్ సచివాలయ సిబ్బందికి ఏ విధమైన సంకోచం లేకుండా అందించవచ్చని కమిషనర్ భరోసా ఇచ్చారు.
కుటుంబ సర్వేతో ప్రభుత్వ పథకాలకు అర్హులు -కమిషనర్ విజయ సారథి
మున్సిపల్ కమిషనర్ బి విజయసారథి