పాలకొల్లు: ఫిబ్రవరి,20(తెలుగు న్యూస్ పవర్) ప్రతి ఏట ఫిబ్రవరి 21న అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం జరుపుకుంటాం.
జగతిలో అమ్మ తర్వాత అమ్మ అంత విలువ గలిగినది అమ్మ నుడియే(మాతృభాష) అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.
అంతర్జాతీయ మాతృభాష దినోత్సవ సందర్భంగా అందరికీ ఒక మనవి . మనలో ఎంతమందికి మాతృభాష పై అభిమానం ఉన్నది. అసలు నేడు ఎంత మంది మాతృభాష గురించి ఆలోచిస్తున్నారు అనే అంశాన్ని చర్చించవలసిన అవసరం ఎంతైనా ఉన్నది .మనలో చాలామందికి తెలియని విషయం ఏమంటే ఏదైనా ఒక మాతృభాష మరుగునపడి నశించినట్లయితే, ఆ భాషను మాట్లాడే జాతి ,వారి సంస్కృతి, వారి సాంప్రదాయాలు కూడా మరుగున పడిపోతాయి అనే విషయం చాలామందికి తెలియదు. అందుకే ఐక్యరాజ్యసమితి వారు ఎవరి మాతృభాషను వారే ,కాపాడుకోవాలనే ఉద్దేశంతో ,ఈ అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం అని ప్రకటించారు ఈ ఒక్క రోజైనా మాతృభాష గురించి మనలో కొందరైనా ఆలోచిస్తారని ,ఆవేశిస్తారని ఇలాంటి రోజులు జరుపుకోవాలని భాషావేత్తల అభిప్రాయం.
ఈ అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవo జరుపుకోవడానికి ముఖ్య కారణం తెలుసుకోవలసి ఉన్నది.అన్ని భాషలను పరిరక్షించుకోవాలని, బహుభాషా వైవిధ్యాన్ని కాపాడుకోవాలని, మరియు సాంస్కృతిక వైవిధ్యాన్ని,దానిపై అవగాహన పెంచుకోవాలని ,బహుభాషా వాదాన్ని ప్రోత్సహించడానికి 1999 నవంబర్ 17న యునెస్కోలో ప్రకటించినారు.దీనికి ముఖ్య కారణం 1952లో అప్పటి బంగ్లాదేశ్ లో,తమ మాతృభాష బెంగాలీ బదులుగా ఉర్దూను తమపై బలవంతంగా రుద్దారని, విద్యార్థులు, బెంగాలీ భాష అభిమానులు పెద్ద ఎత్తున ఉద్యమాన్ని లేవనెత్తారు. ఆ ఉద్యమంలో ఐదుగురు విద్యార్థులు వీరమరణం పొందినారు .వారికి నివాళిగా ఈ మాతృ అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవాన్ని 2000 సంవత్సరము నుండి జరుపుకుంటున్నామని అందరికీ తెలిసినదే.
ఎవరి అమ్మవారికి గొప్ప అన్నట్లుగా, ఎవరి మాతృభాష వారికి గొప్పే కదా! కనుక ఎవరు అమ్మనుడిని వారు తప్పక రక్షించుకోవాలి. ఇంగ్లీష్ వారి వలసవాదం వలన, వారు కాలిడిన ,ఏలిన సీమలలో అనేక భాషలు ,అనేక సంస్కృతులు ,ఇంగ్లీషు ప్రభావం వలన, వారి మత ప్రభావం వలన కనుమరుగైనవి. ఒక భాష నశిస్తే, ఆ భాషకు చెందిన జాతి ,జాతి భావన ,సంస్కృతి ,సాంప్రదాయాలు కూడా నశిస్తాయి. ఇది చరిత్ర చెప్పిన, నిరూపించిన సత్యం .అంటే మన అమ్మనుడిని మనమే కాపాడుకోవాలి .ఎవరి భాషను వారే రక్షించుకోవాలి. రాబోయే తరాల కోసం భాషను పదిలపరుచుకోవాలి .పరిరక్షించుకోవాలి.
అందుకే ఇతర భాషల ప్రభావం మాతృభాషపై పడకుండా చూసుకొని, అమ్మనుడిని పరీక్షించుకోవాలనే తలంపుతోనే,ఆ భాష జాతి నైతిక బాధ్యతగా ,ప్రతి మనిషి కర్తవ్యం గా ,అమ్మనుడిని రక్షించుకోవాలoటూ గుర్తు చేయడానికే , ఈ అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం ఏర్పాటు చేయడమైనది.
ప్రపంచంలో దాదాపు 6000 పైచిలుకు భాషలు ఉన్నాయి .వాటిలో సొంత లిపి ఉన్న భాషలు దాదాపు 400 లోపే. కొన్ని భాషలకు ఇప్పటికీ సొంత లిపిలు లేవు .కనుక అమ్మనుడిని(మాతృభాష) అందరూ కాపాడుకోవాలని, రేపటి జాతికి భాషను పునరoకితం చేయాలనే,ఉద్దేశంతో ఈ అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవాన్ని జరుపుకోవాలని ఆవశ్యకత ఎంతైనా ఉంది.
అయితే మనదేశంలో ఎక్కువగా తెలుగు ప్రాంతాలలో డాలర్లు మోజుతో ,ఇంగ్లీషు డాబుసరితో మాతృభాషను విస్మరించి , ఆంగ్లమాధ్యమం వైపు తల్లిదండ్రులు పరిగెడుతున్నారు, పిల్లలను బలవంతంగా పరిగెత్తిస్తున్నారు.
పరభాష లు నేర్వడం తప్పుకాదు. ముందు కనీసం ప్రాథమిక విద్య అయిన అమ్మనుడిలో ఉండాలి. ఎందుకంటే అమ్మనుడిలో విద్యార్థికి పాఠము సులభంగా అర్థమవుతుంది. తన భాషలో చదివితే నేర్చుకునే విషయంపై ఎక్కువ అవగాహనతో వివరణ సులభతరం అవుతుంది.
మాతృభాష గొప్పతనాన్ని గురించి, చదువు మాతృభాషలో ఉంటే ఎంత ఉపయోగకరమో ,విద్యార్థికి ఎంత వికాసవంతంగా ఉంటుందో, ప్రముఖులు గాంధీజీ ,రవీంద్రనాథ్ ఠాగూర్ ,నేతాజీ ,స్వామి వివేకానంద ఎందరో మహానుభావులు వివరించారు. మన దురదృష్టం అవన్నీ చెవిటి వాడి ముందుఊదిన శంఖములా అయిపోయాయి .ఇప్పుడు చాలామంది ఇంగ్లీష్ మీడియం పిల్లలను పరిశీలిస్తే ,అటు ఇంగ్లీషు రాదు, ఇటు తెలుగు రాదు. ఇప్పటి ప్రభుత్వాలు కూడా తెలుగు భాషను తమ ఓట్ల కోసం, రాజకీయం కోసం వాడుకుంటూ ,అమ్మనుడికి వెన్నుపోటు పొడుస్తున్నారు అనడంలో ఎలాంటి సందేహం లేదు. గత ప్రభుత్వాలు తెలుగు మాధ్యమాన్ని పూర్తిగా తొలగించి మాతృభాషకు చాలా అన్యాయం చేశారు అనడంలో ఎలాంటి సందేహము లేదు.
ఇది ఇలాగే సాగితే ఐక్యరాజ్యసమితి వారు ఈ మధ్య ప్రకటించిన ఒక నివేదిక ప్రకారం రాబోయే 30 సంవత్సరాలలో మరుగయ్యే భాషలలో తెలుగు ఒకటనే మాట నిజం కాబోతుందేమోనని అనుమానంగా ఉంది. అవును నిజమే, ఇప్పటి పిల్లలలో 90% ఇంగ్లీష్ మాద్యములో చదువుతున్నారు ,వారికి తెలుగు రాయడం, చదవడం రాదు. ఇక తెలుగు అక్షరాలతో పనేముంది. ఇలాగే సాగితే ముందు తరాలు వారు తెలుగు అక్షరాలను మ్యూజియంలో
చూడవలసి వస్తుంది .
అందుకే ఆంగ్ల ఉద్యోగి మేకలే గొప్పదైన హిందూ సంస్కృతిని ,జాతిని చూసి, వీరిని జయించడం చాలా కష్టమని భావించి ,ఈ జాతిని నాశనం చేయాలంటే ,మొదటగా వారి మాతృభాషను నాశనం చేస్తే చాలు అని చెప్పాడు. అందుకే ఇంగ్లీషును ,వారి మతాన్ని జనంపై రుద్దారు. ఫలితం చూస్తూనే ఉన్నాము.
కనుక మనం మొదటగా అమ్మనుడిని కాపాడుకోవాలి ,మాతృభాషను ప్రేమించాలి, పర భాషలను ఆదరించాలి ,అవసరానికి పరభాషను నేర్చుకోవడంలో తప్పేమీ లేదు .మనం ఇతర భాషలకు వ్యతిరేకం కాదు .అలాగే ఏదైనా ఒక కొత్త మాట ఇతర భాషలు నుండి వస్తే దానికి మొదటగా మన అమ్మ నుడి నుండే కొత్త మాటను పుట్టించాలి. ఆ పనిని హిబ్రూ ,చైనా,జపాన్ ,కొరియా , తమిలులు ,కన్నడిగులు చేస్తున్నారు. అయితే మన తెలుగువారు ఇంగ్లీష్ మాటను సంస్కృతీకరణ చేస్తున్నారు. చక్కగా ఆలోచిస్తే అచ్చ తెలుగులో మాటలను పుట్టించవచ్చు.
ఈమధ్య తెలుగు భాషా పరిరక్షణకు, అనేక వేదికలు ,సంస్థలు ముందుకు వచ్చి ఎంతో కొంత కృషి చేస్తున్నారు అయితే నిజానికి ఎవరూ ప్రజలతో మమేకమై ,ప్రజా ఉద్యమాలకు బాసటగా నిలబడి ఉద్యమించడం లేదనీ, కేవలం తీర్మానాలు , ప్రసంగాలు,ప్రణాళికలు కేవలం కాగితాలకే పరిమితం అవుతున్నాయని తెలుగు భాషావేత్తల అభిప్రాయం. ఏది ఏమైనా ఈ అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవ సందర్భంగా ,మనందరం ఒకసారి మాతృభాష గురించి మీకు మాట్లాడుకోవడానికి అవకాశం వస్తుందని పరస్పర భావాలను ఒకరినొకరు పంచుకోవడానికి సహకరిస్తుoదని అనడంలోఎలాంటి అనుమానం లేదు.
అయితే ఇప్పటికీ ,కొన్ని దేశాలలో మొదలిడు చదువు (ఎల్కేజీ) నుండి పెనుపాటి చదువు ( పీజీ) వరకు
సాంకేతిక, వైద్య చదువులుఅన్నీ కూడా వారి మాతృభాషలోనే జరుపుతున్నారు.
కనుక మనమంతా అంతర్జాతీయ మాతృభాష దినోత్సవ సందర్భంగా అమ్మనుడిని కాపాడుకోవాలి. అలాకాకుండా పరభాష వ్యామోహంలో పడితే, పరభాషను నేర్చి ,దాని వెంట ప్రాకులాడితే ,అనుకోకుండా ఆ భాషతో పాటు, ఆ భాష వారి సంస్కృతి ,సాంప్రదాయాలు మెల్లగా మనలోనికి ప్రవేశిస్తాయి. ఒకసారి చూస్తే మనకే అర్థమవుతుంది. ఇంగ్లీషు ప్రభావం వలన ,వారి మతము ,వారి తిండి ,వారి కట్టుబొట్లు ,వారి సంస్కృతి సాంప్రదాయాలు అన్ని వచ్చి మన సంస్కృతినీ పక్కకు నెట్టి ,అవి ప్రముఖ పాత్ర వహిస్తున్నాయి .నిజమా !కాదా!?
కాబట్టి మన జాతి మన సంస్కృతి నిలవాలంటే, మన మాతృభాషలను నిలబెట్టుకోవాలి, మాతృభాష నిలబడాలి, కలబడాలి, కనబడాలి, వినబడాలి అప్పుడే ఆ భాష వలన జాతి, జాతి వలన దేశము ఒక విశిష్టమైన గౌరవాన్ని పొందుతాయానడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. కనుక ఈ అంతర్జాతీయ మాతృభాష దినోత్సవ సందర్భంగా మనందరము విన్నపము ఏమనగా, ఇప్పటి ప్రభుత్వం వారు అయినా తప్పక పరిపాలన భాషగా, ప్రజల పలుకుబడి భాషగా తెలుగును కనబడేటట్లు, వినబడేటట్లు చేయగలరని ఆశిద్దాం. అలాగే తెలుగు ప్రజలు కూడా మాతృభాష మనుగడ కోసం తమిళులు కన్నడిగులు, మరాఠీలు లాగా మాతృభాషపై మమకారాన్ని చూపుతూ, తమ వంతు కృషిని చేయగలరని ఆశిద్దాం. ఇది రాఘవ మాస్టారు వ్యాసం.