పాలకొల్లు: మార్చి, 10(తెలుగు న్యూస్ పవర్. కామ్) స్థానిక శ్రీ ఎస్.ఎన్.ఎం. ప్రభుత్వ (అటానమస్) కళాశాలలో విద్యార్థులకు సామాజిక అవగాహన పెంపొందించేందుకు “మానవ అక్రమ రవాణా” అంశంపై అవగాహన సదస్సు మంగళవారం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని కళాశాల ఎన్‌ఎస్ఎస్ యూనిట్–1 & 2, ఎన్‌సిసి యూనిట్ మరియు ప్రజ్వల స్వచ్ఛంద సంస్థ, హైదరాబాద్ వారి సంయుక్త ఆధ్వర్యంలో బాలుర విద్యార్థుల కోసం ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ డా. టి. రాజ రాజేశ్వరి మాట్లాడుతూ, విద్యార్థులు చదువుతో పాటు సామాజిక సమస్యలపై అవగాహన కలిగి ఉండటం ఎంతో ముఖ్యమని తెలిపారు. మానవ అక్రమ రవాణా వంటి సమస్యలను నివారించడానికి యువత ముందుండాలని, అనుమానాస్పద సంఘటనలు గమనించినప్పుడు వెంటనే సంబంధిత అధికారులకు తెలియజేయాలని సూచించారు. ఇటువంటి అవగాహన కార్యక్రమాలు విద్యార్థులను బాధ్యత గల పౌరులుగా తీర్చిదిద్దడానికి తోడ్పడుతుందన్నారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ప్రజ్వల సంస్థ అసిస్టెంట్ కోఆర్డినేటర్ అంబర్ సింగ్ మాట్లాడుతూ, మానవ అక్రమ రవాణా సమాజానికి తీవ్రమైన ముప్పుగా మారుతున్నదని తెలిపారు. ఉద్యోగాలు, విద్య, మెరుగైన జీవితం పేరుతో అమాయక యువతను మోసం చేసి అక్రమ రవాణాకు గురిచేసే సంఘటనలు పెరుగుతున్నాయని చెప్పారు. విద్యార్థులు అపరిచితుల మాటలు నమ్మకూడదని, అనుమానాస్పద పరిస్థితులు ఎదురైనప్పుడు వెంటనే పోలీసులకు లేదా సంబంధిత అధికారులకు సమాచారం ఇవ్వాలని సూచించారు.
పిల్లలు, పెద్దలు యువత ఎవరైన ఏదైనా ప్రమాదం ఉందని గమనిస్తే వెంటనే 1098, 100, 181, 1930 లాంటి టోల్ ఫ్రీ నంబర్స్ ను ఉపయోగించాలి అని సూచించారు. వివిధ చట్టాలపై అవగాహన కల్పించారు.
సైబర్ ట్రాఫికింగ్, మానవ అక్రమ రవాణా అనేది చాలా వేగంగా వ్యాప్తి చెందుతున్న ఒక నేరపూరిత చర్య అన్నారు. మొబైల్ అనేది నిత్య జీవితం లో భాగం అయింది. దీన్ని వాడడం ద్వారా వచ్చే నష్టాలను వివరించాలి. సోషల్ మీడియా ద్వారా జరుగుతున్న నిజమైన వార్తలను వారికి వివరించి దానినుండి బయటపడేలాగా మోటివేషన్ చేయాలి అన్నారు . అనంతరం వారిచే
మానవ అక్రమ రవాణా వ్యతిరేకంగా ప్రతిజ్ఞ చేయించారు.
భూపాల్, ప్రజ్వల సంస్థ అసిస్టెంట్ కోఆర్డినేటర్ మాట్లాడుతూ, మానవ అక్రమ రవాణా నుంచి రక్షణ కోసం యువతలో అవగాహన ఎంతో అవసరమని పేర్కొన్నారు. సోషల్ మీడియా, ఆన్‌లైన్ పరిచయాల ద్వారా జరిగే మోసాల పట్ల జాగ్రత్తగా ఉండాలని, ప్రతి ఒక్కరూ సమాజంలో బాధ్యతతో వ్యవహరిస్తే ఈ సమస్యను తగ్గించవచ్చని తెలిపారు. విద్యార్థులు తమ హక్కులు మరియు చట్టాల తెలుసుకోవడం ద్వారా స్వీయ రక్షణ సాధ్యమవుతుందని చెప్పారు.
ఈ కార్యక్రమంలో కళాశాల
ఐ క్యు ఏసి కోఆర్డినేటర్ శ్రీ కె. భద్రాచలం, తెలుగు విభాగాధిపతి డా బూసి వెంకటస్వామి, ఎన్ఎస్ఎస్ యూనిట్-2 ప్రోగ్రాం ఆఫీసర్ డా.ఎం.రామకృష్ణ ఇతర అధ్యాపక సిబ్బంది మరియు విద్యార్థిని విద్యార్థులు పాల్గొని ఈ కార్యక్రమంలో విజయవంతం చేశారు.
ఏ ఎస్ ఎన్ ఎం కళాశాలలో సామాజిక అవగాహన సదస్సు.
సామాజిక అవగాహన సదస్సుకు హాజరైన విద్యార్థులు, అధ్యాపకులు.