పాలకొల్లు:మార్చి,14(తెలుగున్యూస్ పవర్.కామ్)ప్రపంచంలోనే ఒక గొప్ప సామాజిక సాంస్కృతిక సాంప్ర దాయం ఇఫ్తార్ విందు అని స్థానిక శాసనసభ్యులు, రాష్ట్ర జలవనరుల శాఖ మాత్యులు నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. స్థానిక పెద్ద మసీదు లో పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా శనివారం ముస్లిం సోదరులకు, ధర్మారావు ఫౌండేషన్ వారు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేసారు. ఈ సందర్భంగా జరిగిన సభలో మంత్రి మాట్లాడుతూ,అత్యంత పవిత్రమైన రంజాన్ మాసం ఎంతో చైతన్యవంతమైన స్ఫూర్తిని కలిగిస్తుందన్నారు. ధనిక, పేద అనే భేదం లేకుండా అందరూ ఒకే చోట ఐకమత్యంతో ఈ రంజాన్ మాసం జరుపుకోవడం, కటిక ఉపవాసం చేయడం క్రమశిక్షణకు, ఆధ్యాత్మిక చింతనకు, దాతృత్వానికి ప్రతీక గా నిలుస్తుందన్నారు. పవిత్ర ఖురాన్ ఈ మాసంలోనే వెలువడటం గొప్ప ఆధ్యాత్మిక సందేశం సందేశంగా నిలుస్తుంది అన్నారు. కోట్లాదిమంది పేదల పట్ల ఈ మాసంలో దాతృత్వం చూపించి వారిని ఆదుకొనే దైవ కార్యం ముస్లిం సోదరుల మానవతకు నిదర్శనం అన్నారు. అంబేద్కర్, మదర్ థెరిసా వంటి మహనీయుల ఆశయాలు నెరవేర్చడం కోసం, వారి స్ఫూర్తితో రాజకీయాల్లోకి వచ్చినట్టు వెల్లడించారు. అపారమైన కరుణామయుడు అల్లా ఆశీస్సులతో, ముస్లిం సోదరుల అభిమానంతో మూడోసారి అధికారంలోకి రాగలిగానని వెల్లడించారు. వారు చూపుతున్న అభిమానానికి రుణపడి వారి అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. త్వరలో రెండు కోట్లతో షాదీఖానా నిర్మాణం పనులు ప్రారంభిస్తామని వెల్లడించారు. ముస్లింలలో చాలామంది రెక్కాడితే గాని డొక్కాడని పరిస్థితుల్లో ఉన్నారన్నారు. వారికి అవకాశాలు కల్పించి, ఆదుకోవలసిన అవసరం ఉందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో, ముస్లింల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. నిధుల కొరత ఉన్నప్పటికీ,ప్రాధాన్యత క్రమంలో, వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ప్రతి ఏట ఇఫ్తార్ విందు ఇవ్వటానికి వాసం కల్పిపిస్తున్న ముస్లిం సోదరులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం జిల్లా మైనార్టీ సెల్ నాయకులు మహమ్మద్ జానీ, ఎన్టీఆర్ అభిమాన సంఘ నాయకులు షేక్ సిలార్, ముస్లిం పెద్దలు, మాజీ ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్ రావు, వ్యవసాయ మార్కెట్ కమిటీ అధ్యక్షులు కోడి విజయభాస్కర్, కూటమి నాయకులు కపర్ది, పాముల రజిని కుమార్, గండేటి వెంకటేశ్వరరావు, పెచ్చెట్టి బాబు, చిట్టూరి ఆంజనేయులు, తదితరులు పాల్గొన్నారు.
ప్రపంచంలోనే గొప్ప సాంస్కృతిక సాంప్రదాయం ఇఫ్తార్ విందు. -మంత్రి నిమ్మల
పవిత్ర రంజాన్ మాసంలో అల్లా ఆశీస్సులు కోరుతున్న మంత్రి నిమ్మల