అమరావతి: మార్చి, 16(తెలుగు న్యూస్ పవర్. కాం)ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో అధికారులతో సోమవారం ఎల్బీజీ గ్యాస్ సమస్యలపై సమీక్ష సమావేశం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆహార, పౌరసరఫరాలు మరియు వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ నిర్వహించారు.
రాష్ట్రవ్యాప్తంగా ఎల్బీజీ గ్యాస్ సరఫరా, పంపిణీ వ్యవస్థలో ఉన్న సమస్యలు, వినియోగదారులకు ఎదురవుతున్న ఇబ్బందులు, సిలిండర్ల సమయానికి సరఫరా, బుకింగ్ నుండి డెలివరీ వరకు జరుగుతున్న ప్రక్రియలపై అధికారులతో సమగ్రంగా సమీక్షించారు. ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా గ్యాస్ సరఫరా వ్యవస్థ సజావుగా కొనసాగేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని మంత్రి అధికారులను ఆదేశించారు.
గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల్లో గ్యాస్ సిలిండర్ల సరఫరా ఆలస్యం కాకుండా చర్యలు తీసుకోవాలని, వినియోగదారుల ఫిర్యాదులను వెంటనే పరిష్కరించే విధంగా ప్రత్యేక పర్యవేక్షణ వ్యవస్థను ఏర్పాటు చేయాలని సూచించారు. గ్యాస్ ఏజెన్సీలు ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా పనిచేయాలని, వినియోగదారులకు పారదర్శకంగా సేవలు అందించాల్సిన బాధ్యత ఉందని స్పష్టం చేశారు.
ఈ సమావేశంలో పౌరసరఫరాల శాఖ కార్యదర్శి *సౌరభ్ గౌర్, సివిల్ సప్లై సంచాలకులు నూపుర్ సంబంధిత శాఖల ఉన్నతాధికారులు మరియు గ్యాస్ సరఫరా సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.
వంట గ్యాస్ సరఫరాపై పౌర సరఫరాల మంత్రి మనోహర్ సమీక్ష.
రాష్ట్ర సచివాలయంలో సమీక్ష నిర్వహిస్తున్న మంత్రి మనోహర్