
పాలకొల్లు: మార్చ్, 27 (తెలుగు న్యూస్ పవర్. కామ్) శాసనసభ్యుడిగా, రాష్ట్ర మంత్రిగా కంటే, ధర్మారావు ఫౌండేషన్ చైర్మన్ గానే తనకు సంతృప్తి లలభిస్తుందని, స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర జలవనరుల శాఖామాత్యులు, నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. స్థానిక లంకలకోడేరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శుక్రవారం జరిగిన ఉచిత సైకిల్ పంపిణీ కార్యక్రమంలో మంత్రి ప్రసంగించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ,ధర్మారావు ఫౌండేషన్ 2005 లో ప్రారంభించిన నాటి నుంచి ప్రజలకు అవసరమైన సేవలు అందిస్తున్నామన్నారు. వందమంది వృద్ధులకు, మరో వంద మంది వికలాంగులకు ప్రతినెల రేషన్ సరుకులు, దుస్తులు ఫౌండేషన్ ద్వారా ఉచితంగా అందిస్తున్నామన్నారు. ప్రకృతి వల్ల, మానవ తప్పిదం వల్ల ఏర్పడే విపత్తుల్లో ఉన్న వారిని ఆదుకోవడంలో, ఉపాధి కల్పించడానికి, 100 పైగా రక్తదాన శిబిరాలు, మంచినీటి సరఫరా, పోటీ పరీక్షలు
కు ఉచిత శిక్షణ, ఉచిత వాహన సౌకర్యం, కైలాస రథం, ఫ్రీజర్ బాక్సులు వంటి సేవలు, ప్రజలకు అవసరమైన అన్ని సౌకర్యాలు, తన తండ్రి పేరు మీద స్థాపించిన ధర్మారావు ఫౌండేషన్ ద్వారా ఏర్పాటు చేస్తున్నట్టు వివరించారు. సమస్యలో ఉన్న వారిని ఆదుకోవటం ద్వారా, వారి కళ్ళల్లో కనిపించే కృతజ్ఞతా మెరుపును కోట్లు పెట్టి కూడా కొనలేమని ఎమ్మెల్యే తెలిపారు. దేశంలోనే ప్రసిద్ధి చెందిన విత్తన సంస్థ,నూజివీడు సీడ్స్ వారు తమ మండవ ఫౌండేషన్ సౌజన్యంతో, ముఖ్యమంత్రి విజ్ఞప్తి మేరకు పి-ఫోర్ పథకంలో భాగంగా ఏలూరు, కృష్ణ జిల్లాలో రెండు గ్రామాలు దత్తత తీసుకొని వారి సమస్త బాగోగులు మండవ ఫౌండేషన్ వారు చూస్తున్నారని తెలిపారు. ఇటీవల వారితో ఏర్పడిన సాన్నిహిత్యం వల్ల, ప్రభుత్వ పాఠశాల్లో విద్యాభివృద్ధికి, దూరప్రాంతం నుంచి వచ్చే విద్యార్థులకు ఉచిత సైకిళ్ళ పంపిణీ కోసం విజ్ఞప్తి చేశానన్నారు. నూజివీడు సీడ్స్ సి ఎస్ ఆర్ నిధుల నుంచి వెంటనే పది లక్షల రూపాయలు కేటాయించారన్నారు. తనకున్న ఉన్న వ్యక్తిగత పరిచయాలను కూడా నిస్వార్ధంగా నియోజకవర్గ అభివృద్ధికే నియమిస్తున్నానన్నారు. ఈ సందర్భంగా వారికి మంత్రి కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర అభివృద్ధి,నియోజకవర్గ ప్రగతి పరుగులు పెడుతున్న సమయంలో, ప్రజలు పొరపాటున ఆడిన రాజకీయ వైకుంఠపాళీ లో జగన్ అనే పెద్ద పాము మింగేయటం వల్ల మళ్లీ అట్టడుగుకు వెళ్లి రాష్ట్రం అధోగతిపాలయిందని అభివర్ణించారు. ఫౌండేషన్ ప్రతినిధులు బి సుబ్బారావు, మూర్తి లను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా మంత్రి విద్యార్థులతో ముచ్చటించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్ రావు, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కోడి విజయభాస్కర్, టిడిపి రాష్ట్ర కార్యదర్శి బాబు, పట్టణ కార్యదర్శి గండేటి వెంకటేశ్వరరావు, కొట్టుముక్కల సూరి నారాయణరాజు, రాంబద్ర రాజు, పాముల రజిని కుమార్, మామిడిశెట్టి పెద్దిరాజు, ఎంఈఓ గుమ్మల్ల వీరాస్వామి, హెచ్ఎం కీ రాజశేఖర్, సర్పంచ్ చొప్పల రజిని, ఎంపీటీసీలు సాగ సత్యనారాయణ, ఆకుల ధనలక్ష్మి,, విద్యార్థుల తల్లిదండ్రులు, తదితరులు పాల్గొన్నారు.
