
యలమంచిలి: మార్చి, 29 (తెలుగు న్యూస్ పవర్. కామ్) లంక ప్రజల జీవితం ప్రతినిత్యం సాహసంతో కూడుకున్నదని మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. స్థానిక కానకాయలంక, పెదలంక లంక గ్రామాల్లో రూ.23.64 కోట్లతో నిర్మించనున్న ఫ్లై ఓవర్ బ్రిడ్జిల నిర్మాణం పనులకు శంకుస్థాపన చేసిన సందర్భంగా,ఆదివారం జరిగిన సభలో మంత్రి మాట్లాడారు. లంక గ్రామాల్లో ఇప్పుడు ఏ ప్రమాదం ముంచుకొస్తుందో తెలియని పరిస్థితిలో లంక ప్రజల జీవనం ఒక సాహసం అన్నారు. విద్య, వైద్యం వారికి ఇప్పటికీ అందుబాటులో లేవన్నారు. పాముల సంచారంతో ప్రాణభయం ఉందన్నారు. ప్రకృతి విపత్తుల సందర్భంగా, వరదల్లో వారు ఎదుర్కొనే సమస్యలు వర్ణనతీతం అన్నారు. లంక గ్రామాల్లో గతంలో ప్రజాప్రతినిధులు 5 ఏళ్లకు ఒకసారి రావటమే గగనం అన్నారు. తను ఎమ్మెల్యేగా ప్రజలకు అందుబాటులో ఉండటం లంక గ్రామాల ప్రజలు భరోసాగా భావిస్తున్నారని తెలిపారు. నిత్యం రాకపోకలు జరపటం భూ సహజమైన పరిస్థితుల్లో, వారికి కొంతవరకు సమస్య తీవ్రతను తగ్గించటానికి లంక గ్రామాల అభివృద్ధికి తాను ప్రత్యేక శ్రద్ధ పెట్టామన్నారు. ఫ్లైఓవర్ బ్రిడ్జ్ లు నిర్మించడం వల్ల కాన కాయలంక, పెదలంక గ్రామస్తులు వరదల సమయాల్లో కూడా నేరుగా తమ గ్రామాల్లోకి సురక్షితంగా ప్రవేశించటానికి వీలు కలుగుతుందన్నారు. పెదలంక గ్రామంలో నిర్మించే లయో వరకు 88 లక్షల రూపాయల నిధులు కేటాయించినట్లు వెల్లడించారు. తను ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు, వరద బాధితులు తరఫున పోరాడితేనే గాని అప్పటి ప్రభుత్వం ప్రజలకు నిత్యవసరాలు కూడా అందజేయలేదు అన్నారు. పశువుల కోసం తాను ఎక్కడెక్కడినుంచో గ్రాసం తెప్పించి ప్రతి ఇంటికి చేరేలా కృషి చేశానన్నారు. లంక ప్రజలకు ఏ కష్టం వచ్చినా తాను అందుబాటులో ఉంటున్నామని వెల్లడించారు. కూటమి ప్రభుత్వ హయాంలో సుదూర ప్రాంతంలో ఉన్న మారుమూల లంక గ్రామాలకు కూడా అభివృద్ధి సంక్షేమ పథకాలు అందేందుకు కృషి చేస్తున్నామన్నారు. లంక గ్రామాల అభివృద్ధికి కోట్లాది రూపాయల నిధులు కేటాయించినట్లు వివరించారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మాట్లాడుతూ, తెలుగు జ్యోతి ఆత్మగౌరవానికి ప్రతీకగా అన్న ఎన్టీఆర్ నిలిచారన్నారు. నాటి నుంచి నేటి చంద్రబాబు నాయుడు వరకు పార్టీ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు కొనసాగిస్తున్నదన్నారు. పార్టీ నాయకులు కార్యకర్తలు నాలుగు దశాబ్దాలకు పైగా పార్టీ బాధ్యతలు మోస్తున్నారన్నారు. తమ పార్టీకి ఇది గర్వకారణమని కీర్తించారు. రాష్ట్రానికి రాజధాని పేరు లేకుండా చేసిన మాజీ ముఖ్యమంత్రి జగన్ ను మంత్రి తీవ్రంగా విమర్శించారు. అత్యంత ప్రతిష్టాత్మకమైన రాజధాని పై ప్రజా దేవాలయం శాసనసభలో చర్చిస్తున్న సందర్భంగా జగన్ గైర్హాజరవటం శోచనీయమన్నారు. ఈ రాష్ట్ర రాజకీయాల్లో జగన్ స్థానం లేదన్నారు. ఇతర రాష్ట్రాలు హైదరాబాద్, చెన్నై, బెంగుళూరు రాజధాని నగరాల నుంచి సుమారు 50 శాతం నిధులు రాష్ట్రంలోని వివిధ గ్రామాలకు పంచుతున్నారన్నారు. అమరావతి కూడా ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన రాజధాని నగరంగా అభివృద్ధి చెంది భవిష్యత్తరాలు వారికి విద్య ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించే కామధేరుగా మారుతుందని ఆకాంక్షించారు. టిడిపి ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పార్టీ ప్రముఖ నాయకులు, కార్యకర్తలు పరువురిని ఈ వేదికపై మంత్రి ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో సర్పంచులు, మద్ద శ్రీనివాస్, తాళ్ల నాగరాజు, ఎంపీటీసీ గొల్లపల్లి శ్రీనివాస్, టిడిపి, జనసేన మండల అధ్యక్షులు మామిడిశెట్టి పెద్దిరాజు, కొడవటి వరబాబు, నీటి సంఘం అధ్యక్షులు మాతారత్నం రాజు, కొడవటి వరబాబు, సొసైటీ అధ్యక్షులు బొప్పన హరి కిషోర్, మాజీ జెడ్పిటిసి బోనం నాని, కడలి గోపాలరావు, డాక్టర్ వాసు గ్రామ ప్రజలు పాల్గొన్నారు. లంక గ్రామాల్లో రామానాయుడుకు తనివిని ఎరుగని రీతిలో కానీ స్వాగతం లభించింది. గజమాలవేసి, భుజాలకు ఎత్తుకొని తమ అభిమానం ప్రదర్శించారు. దశాబ్దాల కాలంగా పడుతున్న తమ కష్టాలు తీర్చే మార్గం కోసం ఎదురుచూస్తున్న వేళ, వారి కల నిజం కావడంతో అపూర్వ స్పందన, స్వచ్ఛమైన అభిమానం లంక గ్రామ ప్రజలలో కనబడింది.