పాలకొల్లు: ఏప్రిల్, 8(తెలుగు న్యూస్ పవర్. కామ్)
అఖండ జ్ఞాన నిధి, సాహితీ స్రష్ట మాడభూషి కృష్ణ ప్రసాద్ (72) బుధవారం ఉదయం కన్నుమూశారు. గత కొంతకాలంగా వారు ఊపిరితిత్తుల సమస్యకు చికిత్స పొందుతున్నారు. వీరి భార్య జయంతి, యలమంచిలి మండలం, అడవిపాలెం లో ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నారు. వీరికి ఇద్దరు కుమారులు. వీరి మరణ వార్త పాలకొల్లులో విషాదం నింపింది. కృష్ణ ప్రసాద్ సుదీర్ఘకాలం ప్రభుత్వ ఉపాధ్యాయునిగా పని చేశారు. పోడూరు మండలం, గుమ్ములూరులో, పాఠశాల సహాయకులు, ఆంగ్లముగా పనిచేసి, పదవీ విరమణ చేశారు.
ఆంగ్ల బోధకులుగా వీరికి అపార అనుభవం ఉంది. వీరి దగ్గర పాఠశాల విద్యార్థులే కాక, ఉద్యోగులు, ఉపాధ్యాయులు, న్యాయమూర్తులు, వైద్యులు, పరిశోధక విద్యార్థులు, మంత్రులు ఆంగ్ల భాషా నైపుణ్యాలకు మెరుగులు దిద్దుకున్నారు.
అసాధారణ ధారణ శక్తి కృష్ణప్రసాద్ కు సొంతం. తెలుగు, ఇంగ్లీషు, హిందీ సాహితీ లోకంతో వీరికి మంచి పరిచయం ఉంది. వీరు ఎన్నో పుస్తకాలు వ్రాశారు. అనువాదాలు చేశారు. వారి శైలి సరళంగా, విషయం లోతైన అధ్యయనం కలిగి ఉంటుంది. బహుముఖమైన, వీరి విషయ పరిజ్ఞానం అబ్బుర పరుస్తుంది అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. వీరు వ్రాసిన “హిస్టరీ ఆఫ్ ఇండియన్ జర్నలిజం” దేశవ్యాప్త ఖ్యాతిని పొందింది. పశ్చిమ బెంగాల్, బీహార్ రాష్ట్రల్లో జరిగిన పాత్రికేయుల సమావేశంలో వీరిని ఘనంగా సత్కరించారు. చాలా యూనివర్సిటీలు ఈ గ్రంధాన్ని పాఠ్యపుస్తకంగా స్వీకరించాయి. తెలుగులో వెలువరించిన భారతీయ పత్రికారంగ చరిత్ర, ఆదికవి నన్నయ యూనివర్సిటీ జర్నలిజం విద్యార్థులకు పాఠ్యపుస్తకంగా గుర్తింపునిచ్చింది. వివిధ ప్రచురణ సంస్థలు వీరి రచనలు వెలువరించడానికి ఆసక్తి చూపించేవి. వీరు పిహెచ్ డి
చేయకపోయినా, ఎందరో ఆ డిగ్రీ పొందటానికి తన వంతు సహాయం అందించేవారు. వివిధ రంగాలలో ఎందరో లబ్ద ప్రతిష్టలైన ప్రముఖులతో వీరికి అత్యంత సాన్నిహిత్యం ఉంది. వారి కలయిక లోతైన చర్చలకు దారి తీసేది. కృష్ణ ప్రసాద్ కదిలే గ్రంథాలయం (మొబైల్ ఎన్సైక్లోపీడియా) గా కీర్తిని సొంతం చేసుకున్నారు. అర్ధరాత్రి లేపి అడిగినా, విషయం ఏదైనా సమాధానం చెప్పగల, సమర్థవంతమైన జ్ఞానపిపాసి మాడభూషి. వీరు ఎన్నో సాహితీ, స్వచ్ఛంద సంస్థలలో
విశిష్ట స్థానం సంపాదించారు. వీరి గ్రంథాలయంలో, అమూల్యమైన, అరుదైన పుస్తకాల సంగ్రహణ ఉంది. విజయవాడలో జరిగే పుస్తక ప్రదర్శన లో ప్రతి ఏటా వేల రూపాయల విలువైన పుస్తకాలు కొనుగోలు చేసేవారు. అక్కడ ప్రదర్శనలో పాల్గొనే ఎన్నో స్టాల్స్ వారికి, ఎన్ బి టి వంటి ప్రముఖ ప్రచురణ సంస్థలు, కృష్ణ ప్రసాద్ కు చిరపరిచితులు. ఈ సందర్భంగా వారు, తాగుబోతు భర్తనైనా భరించవచ్చు కానీ, చదువుబోతు భర్తను భరించటం చాలా కష్టమని చమత్కరించేవారు. వీరి రచనా వ్యాసాంగం అప్రతిహతంగా సాగింది. ఆంగ్ల వ్యాకరణం పై వీరు తీసుకురావాలనుకున్న కలల పుస్తకం ఇక కలగానే మిగిలిపోయింది. అనన్య సామాన్యమైన మేధోసంపత్తితో అలరారిన, ఆ జ్ఞానజ్యోతి అనూహ్యంగా, ఆ భగవంతునిలో ఐక్యం కావడం అందరినీ దిగ్భ్రాంతికి గురిచేసింది. ఎందరి జ్ఞాన తృష్ణనో తీర్చే, వాగ్దేవి వరపుత్రుల సాహితీ క్షేత్ర ఋషి కృషి దిద్గిగంతాలకు శాశ్వతంగా తరలి వెళ్ళిపోయింది. వారి యశస్సు భూలోకంలో స్థిరమై నిలిచింది. ఎందరో శిష్య, ప్రశిష్య పరంపర తో వీరి ఆశయసాధన అజరామరమై నిలిచింది.
ఈ సందర్భంగా కృష్ణ ప్రసాద్ కు, ప్రముఖ కవి, విశ్రాంత తెలుగు శాఖ అధ్యక్షులు డాక్టర్ రెంటాల వెంకటేశ్వరరావు, డాక్టర్ కె ఎస్ పి ఎన్ వర్మ, డాక్టర్ ప్రతాప్ రాజు, మాజీ ప్రిన్సిపల్ చేగొండి వీర వెంకట సత్యనారాయణ మూర్తి, అంతర్జాతీయ చిత్రకారుడు మర్లపూడి ఉదయ్ కుమార్, గజల్ కృష్ణ, కదలిక అధ్యక్షులు పోలిశెట్టి గోపాలకృష్ణ గోఖలే, ఏపీ జెఎసి నాయకులు క్రాంతి కుమార్, కవి, అన్నపూర్ణేశ్వరరావు, కె.మధుసూదనరావు, తోలేటి గాంధీ, కనకరాజు, ప్రసాద్, గున్నం విజయకుమార్, రామేశ్వరకు సత్యనారాయణ, బిఆర్ఎంవి బాలికల పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు ప్రభాకర్ శాస్త్రి, ఎల్ఐసి మురళి, జడ్డు సాయి బాబా, పవన్ నివాళులు అర్పించారు. ఐజేయు, అఖిలభారత కార్యదర్శి దూసనపూడి సోమసుందర్ సంతాప ప్రకటనలో నివాళులర్పించారు.
అఖండ జ్ఞానజ్యోతి అస్తమయం, మాడభూషి మరణం పట్ల పలువురి దిగ్భ్రాంతి.
మాడభూషి కృష్ణ ప్రసాద్