పాలకొల్లు: మే,1(తెలుగు న్యూస్ పవర్. కామ్) సమాజ అభివృద్ధికి శ్రామికులే సారుధులని స్థానిక ఎమ్మెల్యే, మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. ప్రపంచ కార్మిక దినోత్సవ సందర్భంగా శుక్రవారం ధర్మారావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో మేడే ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. స్థానిక వ్యవసాయ మార్కెట్ కమిటీ ప్రాంగణంలో జరిగిన సభలో మంత్రి మాట్లాడుతూ, మేడే అన్ని పండగల కంటే పెద్ద పండగన్నారు. ఈ ప్రపంచంలో నిస్వార్ధంగా పని చేసే శ్రామిక లోకం శ్రమ, సేవలు మనం పొందే ప్రతి వస్తువు వెనుక, ప్రతి సౌకర్యం వెనుక ఉన్నాయని గుర్తు చేశారు. శ్రామికులతో కలిసి పనిచేస్తే వచ్చే ఆనందంతో శ్రమ అనిపించదన్నారు. గత 15 ఏళ్లుగా ధర్మారావు ఫౌండేషన్ ద్వారా వివిధ కార్మిక సంఘాలతో కలిసి మేడే ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
మేడే సందర్భంగా, గాంధీ బొమ్మ సెంటర్, పూలపల్లి సెంటర్ లలో నాయకుల విగ్రహాలకు పూలమాలలు వేశారు. మేడే సందర్భంగా, మంత్రి నిమ్మల రామానాయుడు, రిక్షా రాముడు అయ్యారు. స్థానిక స్థానిక ఫ్లాట్ రిక్షా కార్మికులతో కలిసి, రక్తంతో నడుపుతాను రిక్షాను, నా రిక్షకు, నా రక్తమె పెట్రోలు అంటూ, గాంధీ బొమ్మల దగ్గర నుంచి ఇటు మార్కెట్ యార్డ్ వరకు, మహాత్మా గాంధీ రోడ్డు, బస్ స్టేషన్, డీలక్స్ రోడ్డు పురవీధుల గుండా సుమారు 5 కిలోమీటర్లు, నిప్పులు చెరుగుతున్న ఎండలో రిమ్ జిమ్ రిక్షావాలా జిందాబాద్ అన్నట్టుగా రిక్షాల ర్యాలి సాగింది.
నే విజిలేస్తే ఆంధ్ర అంతా వినబడుద్ధన్నట్టు మంత్రి ఈల వేస్తే, కార్మికులు కూడా ఈలవేసి ఉత్సా హంగా గోల గోల చేశారు. ఈ సందర్భంగా, జీవితకాలం శ్రామికులుగా పనిచేసిన కార్మికులను మంత్రి సత్కరించారు. కార్మికులకు టీషర్టులు పంపిణీ చేశారు. ర్యాలీ లో మంత్రి ప్రజలకు అభివాదం చేస్తూ, వారు ఇచ్చిన కొబ్బరినీళ్ళు తాగుతూ, చెమటలు చిందిస్తూ, ర్యాలీలో పాల్గొని, తన కష్టంతో,అందర్నీ ఆశ్చర్య ఆనందాలల్లో ముంచెత్తారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ కోడి విజయభాస్కర్, పెద్ద గోపురం చైర్మన్ మీసాల రామచంద్రరావు, తెలుగుదేశం రాష్ట్ర, పట్టణ నాయకులు పెచ్ఛెట్టి బాబు, గండేటి వెంకటేశ్వరరావు, పెనుమత్స రాంభద్ర రాజు, గొట్టుముక్కల సూర్యనారాయణ రాజు, చిట్టూరి ఆంజనేయులు, బిజెపి నాయకులు ఉన్నమట్ల కపర్తి, ఎర్రంశెట్టి పద్మారావు, శిడగం సురేంద్ర ,తులా రామలింగేశ్వర రావు, చినబాబు, బిట్ట లక్ష్మీ నారాయణ, మండెల రాంప్రసాద్, ధనాన్ని సూర్య ప్రకాష్, కార్మిక నాయకులు పుచ్చకాయల రామబ్రహ్మం, వీరవల్లి సత్యనారాయణ, మంతెన రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

స్నేహ ఆటో రిక్షా యూనియన్ మేడే ఉత్సవంలో పాల్గొన్న మంత్రి నిమ్మల

మేడే సభలో మాట్లాడుతున్న మంత్రి నిమ్మల