Telugu News Power

కష్టపడి పనిచేసే వారికి ఓటెయ్యండి, వైసీపీకి ఒక్క ఓటు వేసిన నష్టమే

శంకుస్థాపన సభలో మాట్లాడుతున్న మంత్రి నిమ్మల

యలమంచిలి: మే, 2(తెలుగు న్యూస్ పవర్. కామ్) రాష్ట్ర అభివృద్ధి, ప్రజల సంక్షేమం కోసం పని చేసే కూటమి ప్రభుత్వానికి ఏకగ్రీవంగా ఓటు వేయాలని, స్థానిక శాసనసభ్యులు, మంత్రి నిమ్మల రామానాయుడు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. మండలంలోని ఆరు గ్రామాలలో, రూ. 7.60 కోట్ల తో ప్రారంభించనున్న, 10 పనులకు శనివారం శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు అయిన సభలో మంత్రి మాట్లాడుతూ, రాష్ట్రాన్ని 14 లక్షల కోట్ల రూపాయల అప్పులతో, 20 ఏళ్ళ వెనక్కు నెట్టేసి, నష్టం కలిగించిన పార్టీకి ఎందుకు ఓటు వేయాలో ప్రజలు ఆలోచించాలని కోరారు. రాజకీయ పార్టీలకు మానవత్వం ఉండాలని, పార్టీ నాయకులకు అది మరింతగా ఉండాలని, కానీ వైసీపీ పార్టీ అధినేత జగన్ కు ఏ కోశానా అది లేదని విమర్శించారు. వైసిపి పార్టీ, ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తుందని ఆరోపించారు. ఏ రాజకీయ పార్టీ అయినా తమ తప్పును సరిదిద్దుకొని, మంచి పాలన అందిస్తామని చెప్పాల్సింది పోయి, రఫ్ఫా,రఫ్ఫా నినాదాల చేయటంతో, వైసీపీ, గొడ్డలి పార్టీగా ప్రజల్లోకి వెళ్లిపోయిందన్నారు. నిరంతర అభివృద్ధి కోసం ప్రధాని నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉఫముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కృషి చేస్తున్నారన్నారు. వారి బాటలోనే తాము కూడా కష్టించి పని చేస్తున్నామన్నారు. ఎక్కడా లేని విధంగా విద్యార్థులకు ఉచితంగా సైకిల్ పంపిణీ చేస్తున్నామన్నారు. పదవ తరగతి ఫలితాల్లో అత్యధిక మార్కులు సాధించిన,ముట్లపాలెం ఉన్నతపాఠశాల విద్యార్థి జయశ్రీని మంత్రి అభినందించారు. ఈ కార్యక్రమంలో, మండల పరిషత్ అధ్యక్షురాలు వినుకొండ ధనలక్ష్మి, కూటమి నాయకులు ఉన్నమట్ల కపర్తి, కొడవటి దొరబాబు, తులా రామలింగేశ్వర రావు, నీటి సంఘం అధ్యక్షులు, మాత రత్నం రాజు, రామ శ్రీనివాస్, సొసైటీ అధ్యక్షులు డేగల సత్తి కొండ, చిలుకూరి
బాలాజీ, చిట్టూరి ఆంజనేయులు, మామిడిశెట్టి పెద్దిరాజు, తాసిల్దార్ గ్రంధి పవన్ కుమార్, ఎంపీడీవో (ఇ) జె డి వి ప్రసాద్ వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.