జనరల్ డెస్క్: మే, 13(తెలుగు న్యూస్ పవర్. కామ్) ప్రపంచంలో అత్యధికంగా బంగారం వినియోగించే దేశాల్లో భారత్ ఒకటి. ప్రతి సంవత్సరం భారతీయులు సుమారుగా 700 నుంచి 900 మెట్రిక్ టన్నుల బంగారాన్ని కొనుగోలు చేస్తారని అంచనా. బంగారం ధరలు, వివాహాల సీజన్, పండుగలు, పెట్టుబడుల ధోరణి ఆధారంగా ఈ సంఖ్య మారుతూ ఉంటుంది.
భారత్‌లో బంగారం ఎక్కువగా
ఆభరణాలు (జ్యువెలరీ) తయారీ లో వాడతారు. మొత్తం డిమాండ్‌లో సుమారు 70–80 శాతం పెట్టుబడులు – గోల్డ్ బార్లు, నాణేలు, ఈ టి ఎఫ్ లు, డిజిటల్ గోల్డ్,మతపరమైన, సాంస్కృతిక అవసరాలు, పెళ్లిళ్లు, పండుగలు, దేవాలయ విరాళాలు
పరిశ్రమలు, సాంకేతిక రంగంలో చాలా తక్కువ శాతం వినియోగిస్తారు. ప్రపంచ స్వర్ణ కౌన్సిల్ వివరాల ప్రకారం, 2025లో భారత్‌లో జ్యువెలరీ కోసం మాత్రమే సుమారు 430.5 టన్నుల బంగారం వినియోగించారు.
భారత్‌లో స్వదేశీ బంగారం ఉత్పత్తి చాలా తక్కువ. సంవత్సరానికి కేవలం 1 నుంచి 2 టన్నుల వరకు మాత్రమే బంగారం ఉత్పత్తి అవుతుంది. అందువల్ల దేశ అవసరాల్లో 90 శాతానికి పైగా బంగారాన్ని విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సి వస్తోంది.
బంగారం దిగుమతులపై ప్రభుత్వాలు ఎందుకు ఆందోళన చెందుతాయంటే భారీ స్థాయిలో బంగారం దిగుమతి చేసుకోవాలంటే విదేశీ మారక ద్రవ్యమైన అమెరికన్ డాలర్లలో చెల్లింపులు చేయాలి. దీంతో:
విదేశీ మారక నిల్వలపై ఒత్తిడి పెరుగుతుంది
కరెంట్ అకౌంట్ డెఫిసిట్ అధికమవుతుంది.
రూపాయి విలువ తగ్గే ప్రమాదం ఉంటుంది
అందుకే కొన్ని సందర్భాల్లో దేశ ఆర్థిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వాలు ప్రజలను అవసరం లేని బంగారం కొనుగోళ్లు తగ్గించాలని కోరుతుంటాయి.
భారతీయుల వద్ద ఇప్పటికే ఎంత బంగారం ఉందనే అంచనాల ప్రకారం భారతీయ కుటుంబాలు, దేవాలయాల వద్ద కలిపి సుమారు 25,000 నుంచి 35,000 టన్నుల బంగారం నిల్వగా ఉందని భావిస్తున్నారు. ప్రపంచంలోనే అత్యధిక ప్రైవేట్ గోల్డ్ నిల్వలు కలిగిన దేశాల్లో భారత్ ముందంజలో ఉంది.బంగారం కొనొద్దన్న ప్రభుత్వాల విజ్ఞప్తి 2013 నుంచి 2026 వరకు మారింది ఏమిటని ఆలోచన చేస్తే,భారత ఆర్థిక వ్యవస్థలో బంగారానికి ఎప్పుడూ ప్రత్యేక స్థానం ఉంది. అయితే దేశ ఆర్థిక పరిస్థితులు క్లిష్టంగా మారినప్పుడు, ప్రభుత్వాలు ప్రజలను బంగారం కొనుగోళ్లు తగ్గించాలని కోరడం కొత్త విషయం కాదు. ప్రస్తుతం ప్రధాని నరేంద్ర మోడీ చేసిన విజ్ఞప్తిపై సోషల్ మీడియాలో తీవ్ర చర్చ జరుగుతున్న వేళ, 2013లో జరిగిన ఒక కీలక ఘటన మళ్లీ గుర్తుకు వస్తోంది.
అప్పుడు కేంద్ర ఆర్థిక మంత్రిగా ఉన్న పి చిదంబరం ప్రధానమంత్రిగా ఉన్న మన్మోహన్ సింగ్ దేశ ప్రజలను ఒక సంవత్సరం పాటు బంగారం కొనుగోళ్లు తగ్గించాలని కోరారు. ఆ సమయంలో ప్రపంచ యుద్ధం లేదు… చమురు సంక్షోభం లేదు… కానీ భారత ఆర్థిక వ్యవస్థకు భారీ “కరెంట్ అకౌంట్ డెఫిసిట్ (సి ఎ డి)” సమస్య ఎదురైంది.
2013లో భారతదేశం భారీగా బంగారం దిగుమతులు చేసుకుంటుండటంతో విదేశీ మారక నిల్వలపై ఒత్తిడి పెరిగింది. దీనిని నియంత్రించేందుకు ప్రభుత్వం బంగారంపై దిగుమతి సుంకాన్ని 4 శాతం నుంచి 10 శాతానికి పెంచింది. ఫలితంగా బంగారం దిగుమతులు దాదాపు సగానికి తగ్గాయి.
దీంతో దేశ కరెంట్ అకౌంట్ డెఫిసిట్ భారత స్థూల ఉత్పత్తిలో 4.8 శాతం నుంచి 1.7 శాతానికి పడిపోయింది. అంటే ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఆర్థికంగా ఫలితాన్నిచ్చిందని ఆర్థిక నిపుణులు అప్పట్లో పేర్కొన్నారు.
అప్పట్లో సోషల్ మీడియా లేదు. కానీ విమర్శలు మాత్రం ఉన్నాయి.
2013లో ఇన్‌స్టాగ్రామ్ రీల్స్, వైరల్ వీడియోలు లేవు. కానీ విమర్శలు మాత్రం అప్పట్లో కూడా ఉండేవే. వాట్సాప్ ఫార్వర్డ్స్, పత్రికల అభిప్రాయాలు, టీ దుకాణాల చర్చల రూపంలో ప్రజలు ప్రభుత్వ నిర్ణయాలను ప్రశ్నించేవారు.
ఇప్పుడు 2026లో పరిస్థితి మారింది. సోషల్ మీడియా అల్గారిథమ్స్ కారణంగా ఆగ్రహం, సంచలన వ్యాఖ్యలు ఎక్కువగా వైరల్ అవుతున్నాయి. “ప్రభుత్వం తప్పు చేస్తోంది” అనే వీడియోలకు, “దేశ ఆర్థిక పరిస్థితి ఎందుకు ఇలా ఉంది?” అనే విశ్లేషణల కంటే ఎక్కువ స్పందన వస్తోంది.
పెరుగుతున్న దిగుమతి బిల్లు… ఆందోళనలో ఆర్థిక వర్గాలు
ప్రస్తుతం దేశానికి భారీ దిగుమతి బిల్లు ఒక సవాల్‌గా మారింది. ముఖ్యంగా చమురు, బంగారం దిగుమతులు పెరగడం వల్ల రూపాయి విలువపై ఒత్తిడి పెరుగుతోందని ఆర్థిక విశ్లేషకులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రజలు అవసరం లేని బంగారం కొనుగోళ్లు తగ్గిస్తే విదేశీ మారక నిల్వలకు కొంత ఉపశమనం లభిస్తుందని భావిస్తున్నారు.
పెట్టుబడుల్లో ఎఫ్ ఓ ఎం ఓ ప్రభావం కూడా ఉంది.
ఇటీవలి కాలంలో అమెరికా మార్కెట్లలో పెట్టుబడులపై భారతీయుల ఆసక్తి పెరిగింది. ముఖ్యంగా టెక్నాలజీ కంపెనీల షేర్లు, నాస్‌డాక్ ఇటిఎఫ్ లపై భారీ డిమాండ్ కనిపిస్తోంది. మార్కెట్ గరిష్ఠ స్థాయిలో ఉన్నప్పటికీ చాలామంది “మిస్ అవుతామేమో” అనే భయంతో పెట్టుబడులు పెడుతున్నారని మార్కెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
ఇదే విధంగా వెండి ధరలు అత్యధిక స్థాయికి చేరిన తర్వాత కొనుగోళ్లు పెరిగాయని, ధరలు తక్కువగా ఉన్నప్పుడు మాత్రం పెద్దగా ఆసక్తి చూపలేదని ఆర్థిక వర్గాలు గుర్తుచేస్తున్నాయి.
భావోద్వేగాల కంటే డేటా ముఖ్యం.
ఆర్థిక నిర్ణయాలను రాజకీయ కోణంలో కాకుండా, దేశ పరిస్థితుల ఆధారంగా చూడాలని నిపుణులు సూచిస్తున్నారు. చరిత్రను పరిశీలిస్తే, కొన్ని కఠిన నిర్ణయాలు తాత్కాలిక అసౌకర్యం కలిగించినా, దీర్ఘకాలంలో దేశ ఆర్థిక వ్యవస్థకు మేలు చేసిన ఉదాహరణలు ఉన్నాయని చెబుతున్నారు.
సోషల్ మీడియా హడావుడి కంటే వాస్తవాలు, గణాంకాలు, ఆర్థిక పరిస్థితులను అర్థం చేసుకోవడం అవసరమని విశ్లేషకులు సూచిస్తున్నారు. గతంలో ఆర్థికమాన్యం ఏర్పడినప్పుడు అగ్రరాజ్యం అమెరికా పౌరులు రోడ్లమీద టెంట్లు వేసుకుని, రొట్టె ముక్కు కూడా దొరకని దుర్భర పరిస్థితులు ఎదుర్కొన్నారు. ఆనాడు కమ్యూనిస్టులు తమ మద్దతు కాంగ్రెస్ పార్టీకి ఇచ్చిన సందర్భంగా, ఇతర దేశాల బ్యాంకులో భారత్ పై వచ్చి పడకుండా అడ్డుకున్నారు. ఈ కారణంతో భారత్ పై ప్రభావం కొంతమేర తగ్గింది. భారతదేశానికి బలమైన ఆర్థిక పునాదులు, పద్ధతులు ఉన్నాయి. అది కుటుంబం దగ్గర నుంచి మొదలై దేశ ఆర్థిక వ్యవస్థ వరకు విస్తరించి ఉంది. ప్రధానిగా పీవీ నరసింహారావు, భారతదేశ ఆర్థిక సంస్కర్తగా పేరు తెచ్చుకున్నారు. హయాంలో లండన్లో తాకట్టు పెట్టిన భారత బంగారాన్ని విడిపించి, దేశ ప్రతిష్టను కాపాడారు. ఇంటి పెద్ద చెప్పినట్టే, రాబోయే ఆర్థిక ఉత్పాతాలను ముందుగానే అంచనా వేసి అందుకు అనుగుణంగా దేశ ప్రజలను సన్నద్ధం చేయడానికి ప్రధాన నరేంద్ర మోడీ పలు జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ఇవన్నీ దేశ ఆర్థిక క్రమశిక్షణకు సంబంధించిన కఠినమైన వాస్తవాలు. అయితే, ఢిల్లీ నుంచి గల్లీ వరకు ప్రతిపక్షాలు ప్రధానమంత్రి సూచనలను పెద్దేవా చేస్తున్నారు. ఇది గురువింద గింజ .సామెతలా ఉంది. ఇప్పుడు గతాన్ని తవ్వి తీసి, చురకలాంటించే పని చురుగ్గా సాగుతుంది. ప్రతిపక్షాలు ప్రజలను తప్పుదారి పట్టించకుండా ఉండటం కూడా వారి బాధ్యతగా భావించవలసి ఉంటుంది.
ప్రధానిని విమర్శించే ప్రతిపక్షాలు గతాన్ని గుర్తు చేసుకోవాలి.