Telugu News Power

మాస శివరాత్రికి, మహాశివరాత్రిలా పోటెత్తిన భక్తులు.

సప్త ప్రదక్షిణలో ఉత్సవమూర్తులను ఊరేగిస్తున్న దృశ్యం
భక్తులతో కిటకిటలాడిన పంచారామ క్షేత్రం

పాలకొల్లు: జులై,13 (తెలుగు న్యూస్ పవర్. కామ్) మాస శివరాత్రి సందర్భంగా, స్థానిక శ్రీ క్షీరా రామలింగేశ్వర స్వామి వారి దర్శనం కోసం సోమవారం భక్తులు పోటెత్తారు. అధికారుల అంచనాలకు అందనంతగా, వేల సంఖ్యలో పంచారామ క్షేత్ర దర్శనం కోసం ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు తరలివచ్చారు. రాత్రి 8:30 గంటల వరకు కూడా ప్రత్యేక దర్శనం టికెట్లు కోసం భక్తులు బారులు తీరారు. నిత్య అన్నదాన పథకంలో భాగంగా సుమారు 1500 మంది భక్తులు మహా ప్రసాదం స్వీకరించినట్టు అధికారులు అంచనా వేస్తున్నారు. తెల్లవారుజాము నుంచే అభిషేకాలు ప్రారంభించారు. ఈ మాస శివరాత్రి పర్వదినం చతుర్దశి, సోమవారం, ఆరుద్ర నక్షత్రం రోజు రావడం వల్ల భక్తులకు కోటి రెట్ల విశేష ఫలితం లభిస్తుందని సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయిన సందర్భంగా భక్తులు శైవక్షేత్రాలకు దర్శనం కోసం పరుగులు తీశారు. పంచారామ క్షేత్రాలు ఈ తాకిడి మరింత ఎక్కువైంది. సప్త సోమవారములు, సప్త మారేడు దళములతో సప్త ప్రదక్షిణల కార్యక్రమంలో సుమారు 650 మంది భక్తులు మాడవీధులలో ప్రదక్షిణలు చేశారు. ప్రదక్షిణలో స్వామివారి ఉత్సవ విగ్ర హాల ధర్మకర్తల మండలి అధ్యక్షులు మీసాల రామచంద్రరావు తదితరులు పల్లకిలో ఊరేగించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణాధికారి ముచ్చర్ల శ్రీనివాసరావు, ప్రధాన అర్చకులు సన్నిధి రాజు రామకృష్ణమూర్తి ( క్రిష్టప్ప), వీరబాబు, పర్యవేక్షకులు పసుపులేటి వాసు, ధర్మకర్తలు శ్రీనివాసరావు,చిన్ని, ఉప్పలపు పెద్దిరాజు, చుండూరి రంగయ్య నాయుడు, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు. పలువురు కార్యకర్తలు స్వచ్ఛందంగా భక్తులకు సేవలు అందించారు.