Skip to main content

Telugu News Power

హాస్య నట చక్రవర్తి, పద్మశ్రీ రేలంగి వెంకట్రామయ్య జయంతి వేడుక.

హాస్యనటులు రేలంగి నివాళులర్పిస్తున్న దృశ్యం

రాజమహేంద్రవరం: ఆగస్టు, 13( తెలుగు న్యూస్ పవర్. కామ్)హాస్య నట చక్రవర్తి, పద్మశ్రీ రేలంగి వెంకట్రామయ్య 116వ జయంతి సందర్భంగా, స్థానిక పుష్కర్ ఘాట్ సమీపంలో రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే శ్రీ ఆదిరెడ్డి శ్రీనివాస్, రేలంగి అభిమానులు, గౌడ, శెట్టిబలిజ సంఘ నాయకులతో కలిసి రేలంగి వెంకట్రామయ్య విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు.
తెలుగు సినీ చరిత్రలో రేలంగి వెంకట్రామయ్య స్థానం ప్రత్యేకమైనది. తన సహజమైన హాస్యం, విలక్షణమైన హావభావాలు, ప్రత్యేకమైన గొంతు, నడక, నవ్వులతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన మహానటుడు ఆయన. అగ్ర కథానాయకులతో సమానమైన ప్రజాదరణ, స్టార్‌డమ్‌ను హాస్య నటుడిగా సంపాదించుకున్న అరుదైన కళాకారుడు రేలంగి అని పేర్కొన్నారు.
వారు మన మధ్య భౌతికంగా లేకపోయినా, ఆయన నటించిన అద్భుతమైన చిత్రాలు, పాత్రలు, పండించిన నవ్వులు నేటికీ ప్రేక్షకుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచాయి. పద్మశ్రీ పురస్కారంతో గౌరవించబడిన ఆయన తెలుగు సినిమా హాస్యానికి మకుటం లేని మహారాజు. మన ఉమ్మడి గోదావరి జిల్లాకు చెందిన ఇంతటి మహోన్నత కళాకారుడిని స్మరించుకోవడం మనందరికీ గర్వకారణమన్నారు.
ప్రతి ఏటా రేలంగి జయంతి కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తూ ఆయన కళా వారసత్వాన్ని భావితరాలకు పరిచయం చేస్తున్న గౌడ, శెట్టిబలిజ సంఘ నాయకులు, అభిమానులు, కళాభిమానులు మరియు నిర్వాహకులకు అభినందనలు తెలియజేసారు ఈ కార్యక్రమంలో గౌడశెట్టిబలిజ నాయకులు, రేలంగి అభిమానులు విశేషంగా పాల్గొన్నారు.