Skip to main content

Telugu News Power

డేటింగ్ యాప్ వలలో చిక్కి సొమ్ములు పోగొట్టుకున్న బాధితుడు.

నిందితులను రూరల్ పోలీస్ స్టేషన్లో హాజరు పరిచిన పోలీసులు

స్థానిక రూరల్ పోలీసుల అదుపులో 5గురు నిందితులు.

పాలకొల్లు:సెప్టెంబర్,23( తెలుగు న్యూస్ పవర్.కామ్) స్థానిక రూరల్ పోలీస్ స్టేషన్లో దోపిడీ,
బలవంతంగా డబ్బులు దోచుకున్న నేరాలకు సంబంధించి ఈనెల 21న కేసు నమోదయింది. ఈ కేసుకు సంబంధించి పోలీసులు ఇచ్చిన వివరాలు:ఐదుగురు సభ్యుల ముఠా “గ్రైండర్”(జి ఆర్ ఐ ఎన్ డి ఆర్) డేటింగ్ యాప్ ద్వారా ఒక వ్యక్తిని ప్రలోభపెట్టారు, స్థానిక ఆరట్లకట్ట గ్రామ సమీపంలోని నిర్మానుష్య ప్రదేశానికి బాధితుడిని రప్పించారు. నిందితులు కత్తితో ఫిర్యాదుదారుడిని బెదిరించి అతని వద్ద నుంచి డబ్బులు దోచుకున్నట్లు ఫిర్యాదు అందింది.ఫిర్యాదు పై రూరల్ పోలీస్ స్టేషన్ లో వివిధ బి ఎన్ ఎస్ సెక్షన్ల కింద కేసు నమోదు చేసారు. ఈ కేసులో నిందితుల్లో ఒకరు ఈ నెల 14 రాత్రి 07.30 గంటలకు గ్రైండర్ డేటింగ్ యాప్ ద్వారా ఫిర్యాదుదారుడిని సంప్రదించాడు. బాధితుని ప్రలోభపెట్టి, సంఘటనా స్థలానికి రప్పించాడు. అక్కడ అప్పటికే మరో నలుగురు నిందితులు మాటువేసి ఉన్నారు. ఐదుగురు నిందితులు బాధితుడిని కత్తితో బెదిరించి, అతని పర్సులో ఉన్న రూ.3వేల నగదు బలవంతంగా లాక్కున్నారు. అతని మొబైల్ ఫోన్, రెండు ఎటిఎం కార్డులను లాక్కొని, మొబైల్ ఫోన్ పాస్వర్డ్, ఎటిఎం పిన్ లను తెలుసుకున్నారు. తదుపరి, నిందితుల్లో ఇద్దరు ఫిర్యాదుదారుడి మొబైల్ ఫోన్ ఎటిఎం కార్డులను తీసుకుని అక్కడి నుంచి వెళ్లిపోయారు. మిగిలిన ముగ్గురు నిందితులు అతనిని సంఘటనా స్థలంలో నిర్బంధించారు. బాధితుడిని సుమారు గం.3ల పాటు నిర్బంధంచారు, రాత్రి సుమారు 11.00 గంటలకు ఇద్దరు నిందితులు తిరిగి వచ్చారు. మొబైల్ ఫోన్, ఎటిఎం కార్డులను బాధితుడికి అప్పగించారు. నిందితులు 5గురు అక్కడి నుండి వెళ్లిపోయారు. ఆ తరువాత తన ఫోన్ పే, ఎటిఎం కార్డుల ద్వారా తన ఖాతాల నుంచి రూ.22,495ల నగదు దోచుకున్నట్లు గుర్తించారు. బాధితుడుని చంపుతామని కత్తితోభయపెట్టి, నిందితులు రూ.25,495లు దోచుకున్నారు.
పశ్చిమ గోదావరి జిల్లా పోలీసు సూపరింటెండెంట్ అద్నాన్ నయీమ్ అస్మీ ఆదేశాల మేరకు, నరసాపురం సబ్-డివిజన్ ఎం. సుధాకర్ రావు పర్యవేక్షణలో, నిందితులను గుర్తించి,అరెస్టు చేయడానికి పాలకొల్లు రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ నాయకత్వంలో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. నిందితులు చేసిన ఫోన్ పే వివరాలు, నిఘా సమాచారాన్ని సేకరించడం,సీసీటీవీ ఫుటేజీని విశ్లేషించడం ద్వారా ప్రత్యేక బృందం బుధవారం పెనుమంట్ర మండలం నేలమూరు గ్రామంలో నిందితులను గుర్తించి అరెస్టు చేసారు. నిందితులు
మంగం అఖిల్,(19),ఒరుగంటి మోహన్ తేజ వర్మ(20), పీతల భీమ కార్తిక్,(22). పితాని సతీష్, (19), కోటలపర్రు, పెనుగొండ మండలం.గుత్తుల సురేంద్ర,(19) కోటాలపర్రుకు చెందిన వారు. వీరి నుంచి
రూ.20,000లు నగదు, ఒక కత్తి, రెండు మోటార్ సైకిళ్లు (ఏపీ 07 డీ వై 7811 నంబరు గల డ్యూక్ బైక్, ఏపీ 39 ఎస్ జడ్ 3204 నంబరు గల యమహా ఆర్ 15 బైక్ స్వాధీనం చేసుకున్నారు.నిందితులను మేజిస్ట్రేట్ ఎదుట హాజరుపరచి, న్యాయ రిమాండ్ కు పంపించాల్సి ఉంది. ఈ కేసును ఛేదించడంలో వేగవంతమైన చర్యలు తీసుకుని, అంకితభావంతో పనిచేసిన దర్యాప్తు బృందాన్ని పోలీసు సూపరింటెండెంట్ అభినందించారు.
ఈ సందర్బం గా నరసాపురం సబ్-డివిజన ఎం. సుధాకర్ రావు, ప్రజల డేటింగ్ అప్స్ పట్ల అప్రమత్తం గా ఉండాలని, ఎవరైనా ఇటువంటి నేరాలు బారిన పడితే వెంటనే సంబందిత పోలిస్ అదికారులకు సమాచారం ఇవ్వాలని కోరారు..