Skip to main content

Telugu News Power

అద్దేపల్లి కాలేజీ కుర్రాళ్ళు ’60 ల్లోoచి,20 ల్లోకి’

పాలకొల్లు: నవంబర్,25(తెలుగు న్యూస్ పవర్) అద్దేపల్లి సత్యనారాయణమూర్తి ప్రభుత్వ కళాశాల 1982 బ్యాచ్ విద్యార్థుల ఆత్మీయ కలయిక ఏర్పాట్లు పూర్తయ్యాయి. వచ్చేనెల 13,14 శని,ఆదివారలలో 20వ పడిలోకి జారుకుని మళ్లీ కుర్రాళ్ళు కాబోతున్నారు. భీమవరం దగ్గర గల జక్కరం గ్రామంలోని రిసార్ట్స్ ఇందుకు వేదిక కానున్నది. గతంలో 2015 లో ఈ పూర్వ విద్యార్థుల కలయిక ఘనంగా జరిగింది. సెప్టెంబర్,5 గురుపూజోత్సవం రోజున జరిగింది. ఈ పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో, వారికి చదువులు నేర్పిన గురువులను, ఎక్కడెక్కడి నుంచు నుంచో రప్పించి ప్రేమాభిమానాలతో సత్కరించారు. దశాబ్ద కాలం తర్వాత మళ్లీ ఇప్పుడు ప్రత్యక్షంగా పలకరింపులతో పులకించి పోనున్నారు. నల్లబల్ల తెల్లశుద్ధ కాలం నుంచి మాయా ఫలకం, స్టయిలస్ పెన్సిల్ వ్రాత వరకు చూసిన ఓ తరానికి ప్రతీకలు వీరు. ప్రవేట్ పదం తెలియని, ఫక్తు ప్రభుత్వ విద్యతో సర్కారీ నౌకరీ లో ఖ్యాతి గడించినవారు,స్వయంకృషితో కోట్లకు పడగలెత్తిన వారు, బ్యాంకు ఉద్యోగాలన్నీ వీరి పరమే చేసుకున్నవారు.ఇలా ఎన్నో ప్రత్యేకతలు ఉన్నవారుఎందరో. ల్యాండ్ ఫోన్ నుంచి సెల్ ఫోన్ వరకు, రేడియో నుంచి డిజిటల్ టీవీ వరకు చూసినవారు
వీరు. దేశ విదేశాల్లో వ్యాపారంగంలో రంగంలో తలపడిన, తల పండిన కీర్తి ప్రతిష్టలు వీరి సొంతం. అవసరానికి వాడుకోవడం తెలియని, ఆదుకోవడం మాత్రమే తెలిసిన ఓతరం. నేటి మాయ లోకంలో మునిగి తేలకుండా, మనుషులు మధ్య బంధాల కోసం తపించే జనరేషన్ ఎక్స్ తరం. తలలు నెరిసిన, తలలుబోడులైన తలపులు బోడులౌనా అంటూ ఉత్సాహం ఉరకలెత్తే యువకులు వీరు.
జీవితంలోని 60 ఏళ్ల అనుభవాల్ని , అనుభూతులను దాచుకున్న జ్ఞాపకాల దొంతరలను ఈ చలికాలంలో, చల్లబడిన వయసులో తెరచి చదవాలని, కేరింతలు కొడుతూ గుర్తుకొస్తున్నాయంటూ, అందరితో పంచుకోవాలని వీరి ఆరాటం. ఈ ఆనందాల హరివిల్లు వెల్లివిరిసేలా ఏర్పాట్లు చేస్తున్న వారందరికీ మిత్రులు కృతజ్ఞతలు తెలుపుతున్నారు.