పాలకొల్లు: మే 30(తెలుగు మూవీస్ పవర్. కామ్) నియోజకవర్గ పరిధిలో జరుగుతున్న అభివృద్ధి పనుల వేగం పెంచి గడువులోగా పూర్తి చేయాలని స్థానిక శాసనసభ్యులు, రాష్ట్ర జలవనరుల శాఖ మాత్యులు, నిమ్మల రామానాయుడు అధికారులను, కాంట్రాక్టర్లను ఆదేశించారు. మంత్రి తన క్యాంపు కార్యాలయం నుంచి విద్యుత్ ద్విచక్ర వాహనంపై శనివారం పర్యటించారు. కోట్లాది రూపాయల అభివృద్ధి పనులను మంత్రి ప్రత్యక్షంగా పరిశీలించారు. నర్సాపురం ప్రధాన కాలువపై లారీ స్టాండ్ సమీపంలో పాలకొల్లు- మార్టేరు ఆర్ అండ్ బి రోడ్డును కలుపుతూ, దాదాపు రూ.13 కోట్లతో నిర్మిస్తున్న డబుల్ రోడ్డు బ్రిడ్జ్ పనులు మంత్రి పరిశీలించారు. పలు గ్రామాలకు అనుసంధానంగా ఉండే ఈ వంతెన ప్రాధాన్యతను బట్టి పనుల వేగం పెంచాలని కోరారు. నర్సాపురం కాలువకు శనివారం నీటిని విడుదల చేసిన సందర్భంగా నీటి సరఫరాకు ఏ విధమైన ఆటంకం లేకుండా పనులు జరగాలని సూచించారు.
మరో వారంలో రెండు పూటలా మంచినీరు.
స్థానిక పట్టణ ప్రజలు, పరిసర గ్రామస్తులు ఈ ఏడాది మంచినీటికి తీవ్రకటకట పడ్డారు. మంచినీటి నాణ్యత సరిగా లేకపోవడం వల్ల గొంతు నుస, కొందరికి కడుపునొప్పి వంటి సమస్యలు ఎదురయ్యాయని తెలిపారు. మంచినీటి చెరువు నీటిమట్టం డెడ్ స్టోరేజ్ కి పడిపోవటంతో భూగర్భ జలాలతో కలిపి కథ కానిచ్చారు. రంగు మారిన నీటితో జనం గుగ్గులు పెట్టారు. ప్రతిపక్షం వారు ప్రెస్ మీట్ పెట్టి విమర్శించారు. ఈ పరిస్థితుల దృష్ట్యా జలవనరుల శాఖామాత్యుల నిమ్మల రామానాయుడు గడువుకు ముందే నీటిని విడుదల చేయించారు. దీంతో ప్రజలు నీటి కష్టాల నుంచి గట్టెక్కనున్నారు. దాదాపు 40 రోజులపాటు నీటిని నిలిపివేయటం వల్ల ఉత్పన్నమయ్యే ముందస్తు కార్యాచరణ ప్రణాళిక లోపించి, ఇల్లంటుకున్నాక నువ్వు తవ్విన చందంగా ఉందని విమర్శలు వెళ్ళువెత్తాయి. కాలువల్లో నిండుగా నీళ్ళు కనపడటంతో దాహం తీరినట్టు ప్రజలు భావిస్తున్నారు.