పాలకొల్లు: మే, 29 (తెలుగు న్యూస్ పవర్. కామ్) తెలుగుదేశం పార్టీ మహానాడు కార్యక్రమం విజయవంతం చేసినందుకు పోలిట్ బ్యూరో సభ్యులు, స్థానిక శాసనసభ్యులు, రాష్ట్ర జలవనరుల శాఖామాత్యులు నిమ్మల రామానాయుడు పార్టీ శ్రేణులకు కృతజ్ఞతలు తెలిపారు. నూతన వరవడికి శ్రీకారం చుట్టిన క్లస్టర్ పద్ధతిలో తొలిసారి నిర్వహించిన మహానాడు అపూర్వ విజయం దక్కించుకోవడంతో మంత్రి తన సంతోషాన్ని పార్టీ నాయకులతో కలిసి శుక్రవారం ఏర్పాటు చేసిన పత్రికా సమావేశంలో పంచుకున్నారు. పార్టీ అధినాయకుడు చంద్రబాబు నాయుడు పిలుపుని అందుకుని రాష్ట్రవ్యాప్తంగా 1875 క్లస్టర్లలో మహానాడు రథసారథులు కార్యకర్తలేనని నిమ్మల ప్రశంసించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాల వల్ల కార్యకర్తలు ఉత్సాహంగా పార్టీ కోసం పనిచేస్తున్నారని వివరించారు. మహానాడు విజయం ఇందుకు సాక్ష్యం అని తెలిపారు. అధికారం కోల్పోయిన వైసీపీ పార్టీ అడ్డదారుల్లో అధికారం కోసం దుచ్చర్యలకు పాల్పడుతుందని ఆరోపించారు. ఈ కుతంత్రాలను పార్టీ శ్రేణులు ఎప్పటికప్పుడు గమనించి తిప్పి కొట్టాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర అభివృద్ధికి అందరూ ఐకమత్యంతో ముందుకు సాగాలని విజ్ఞప్తి చేశారు. సమావేశంలో, టిడిపి మండల అధ్యక్షులు పాముల రజిని కుమార్, మామిడి శెట్టి పెద్దిరాజు,ఆర్ రమేష్ రాజు, మాజీ ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్ రావు, రాష్ట్ర కార్యదర్శి పెచ్చెట్టి బాబు, పట్టణ అధ్యక్షులు గండేటి వెంకటేశ్వరరావు, ఏఎంసీ చైర్మన్ కోడి విజయభాస్కర్, దాసరి రత్నం రాజు, మీసాల రామచంద్ర రావు, గొట్టుముక్కల సూర్యనారాయణ రాజు, కర్నేని గౌరు నాయుడు, పొట్నూరి శ్రీనివాస్, కలిదిండి రామచంద్ర రాజు, బోనం నాని, యల్లమెల్లి వెంకటరావు, పీతల శ్రీనివాస్, నడపప జగపతి, రాయి రాంప్రసాద్, పెనుమత్స శ్రీనివాసరాజు, కుక్కల సత్యనారాయణ, అందె కోటి వీరభద్రం, ఊపిరి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.