
జనరల్ డెస్క్: మే, 27 (తెలుగు న్యూస్ పవర్. కామ్) ప్రపంచ రాజకీయ చరిత్రలో, పార్టీ ఆవిర్భవించిన, కేవలం 9 నెలల కాలంలో అధికార పీఠంపై నిలబెట్టిన, సంచలన నాయకుడు, ప్రజల జీవితాల్లో వెలుగు నింపే రెండు రూపాయల బియ్యం పథకం వంటి విప్లవాత్మక సంక్షేమ పథకాలు అమలు చేసిన విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు నందమూరి తారకరామారావు జననోత్సవం మే, 28 పురస్కరించుకొని ఏటా జరుపుకునే మహానాడు పండగ బుధవారం అంగరంగ వైభవంగా రాష్ట్రవ్యాప్తంగా, పాలకొల్లు నియోజకవర్గంలో ప్రారంభమైంది. నియోజకవర్గంలోని, పోడూరు, యలమంచిలి, పాలకొల్లులో ఉన్న ఆరు క్లస్టర్లలో ఏర్పాటుచేసిన నిర్దేశిత వేదికల వద్ద తెలుగు తమ్ముళ్లు, ఆడపడుచుల సందడి అంబరాన్నంటింది. పసుపు జెండాలతో మహానాడు వేదిక ప్రాంగణాలు రెపరెపలాడాయి. పీతాంబరధారులైన కార్యకర్తలు ఉత్సాహంతో కదం తొక్కారు. రాష్ట్రం ముఖ్యమంత్రి, టిడిపి జాతీయ అధ్యక్షులు, నారా చంద్రబాబు నాయుడు, విద్య శాఖామాత్యులు, వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ తిరుగునందుకున్న రాష్ట్ర మంత్రి, పాలకొల్లు శాసనసభ్యులు నిర్మల రామానాయుడు మహానాడు ఘనంగా జరిగేలా ఏర్పాట్లు చేశారు. టిడిపి ప్రధాన నాయకుల ప్రసంగాలు వర్చువల్ పద్ధతిలో ప్రత్యక్షంగా తిలకించడానికి, ఆలకించటానికి అనువుగా ఎల్ఈడి తెరలు ఏర్పాటు చేశారు. ఈ మహానాడులో పార్టీ బలోపేతానికి భవిష్యత్ కార్యాచరణ పై స్థానిక నాయకులు, కార్యకర్తలు వివిధ అంశాలను చర్చించారు. కేంద్రీకృత మహానాడు రూపాంతరం చెంది, స్థానికంగా దృష్టి కేంద్రీకరించటంతో టి20 క్రికెట్ మ్యాచ్ లా కొత్త ఫార్మేట్ తెలుగుదేశం శ్రేణులను ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో ఏర్పాట్లను చేయటంతో పార్టీ క్యాడర్లో ఉత్సాహం నింపింది.