Skip to main content

Telugu News Power

ప్రమాదంలో అభిమాని ప్రాణం, పవన్ కళ్యాణ్ స్వాంతన పర్యటన.

తిరుమల శ్రీవారి శేష వస్త్రంతో నిరంజన్ ను ఆశీర్వదిస్తున్న పవన్ కళ్యాణ్
కుటుంబానికి పవన్ కళ్యాణ్ ఓదార్పు

వరంగల్: జూన్, 17( తెలుగు న్యూస్ పవర్ కామ్) రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే, వాలి పోయే పొద్దా నీకు వర్ణాలు ఎందుకే అన్నారు వేటూరు. కళ్ళు తెరిస్తే జననం, కళ్ళు మూస్తే మరణం రెప్పపాటే జీవితం అన్నారు తాత్వికులు. జనన మరణాలు దేవుడికైనా అనివార్యం. అయితే ఆ మరణం సంభవించే విధానాల్లోనే విషాదం ఉంటుంది. పూర్వజన్మ సుకృతమో, దురదృష్టము కోట్ల మందిలో ఒకరికి ఆ దేవుడు అరుదైన అనారోగ్యాల పాలు చేస్తాడు. అలాంటి ఓ అనారోగ్య యువకుడి యదార్థ జీవన గాధలో ఒక భాగం ఈ సంఘటన. మనిషి ఆశాజీవి, కళ్ళు మూసే లోపు తన కోరిక తీర్చుకోవాలని తపన పడటం మానవ సహజం. హనుమకొండ యువ అభిమాని నిరంజన్‌ను, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, ప్రముఖ నటులు పవన్ కళ్యాణ్ బుధవారం పరామర్శించారు
హనుమకొండకు చెందిన 17 ఏళ్ల చిరంజీవి నిరంజన్ ప్రస్తుతం అరుదైన జన్యుపరమైన వ్యాధి డుచెన్ మస్క్యులర్ డిస్ట్రోఫీ (డి ఎం డి )తో పోరాడుతున్నాడు. ఎనిమిదేళ్ల వయసు నుంచే ఈ వ్యాధితో బాధపడుతున్న నిరంజన్ ప్రస్తుతం మంచానికే పరిమితమయ్యాడు. పవన్ కళ్యాణ్‌కు వీరాభిమాని అయిన అతను తన జీవితంలో ఒక్కసారి అయినా తన అభిమాన హీరోను కలవాలని సోషల్ మీడియా ద్వారా కోరిక వ్యక్తం చేశాడు.
ఈ విషయం తెలుసుకున్న ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్కళ్యాణ్ హనుమాన్‌నగర్‌లో ఉన్న నిరంజన్ నివాసానికి వెళ్లి అతనిని పరామర్శించారు. నిరంజన్ ఆరోగ్య పరిస్థితిని కుటుంబ సభ్యులు రాము, మానసలను అడిగి తెలుసుకున్నారు.
నిరంజన్ చికిత్స కోసం పవన్ కళ్యాణ్ రూ.1 లక్ష ఆర్థిక సహాయం అందించారు. కుటుంబానికి ధైర్యం చెప్పి, అవసరమైన సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు. పవన్ కళ్యాణ్‌ను ప్రత్యక్షంగా కలవడంతో నిరంజన్ భావోద్వేగానికి గురయ్యాడు. చిన్నప్పటి నుంచి పవన్ సినిమాల పాటలకు తాను చేసిన డ్యాన్స్ వీడియోలను కూడా ఆయనకు చూపించినట్లు సమాచారం.
పవన్ కళ్యాణ్ తన అభిమానిని పరామర్శించి ఆర్థిక సాయం చేయడం సోషల్ మీడియాలో ప్రశంసలు అందుకుంటోంది. ఈ ఘటన మానవత్వానికి నిదర్శనంగా నిలిచిందని అభిమానులు పేర్కొంటున్నారు. నిరంజన్ తో పవన్ కళ్యాణ్ తన సొంత బిడ్డలా భావించి భావోద్వేగానికి లోనయ్యారు. తిరుపతి నుంచి తెచ్చిన శేష వస్త్రాన్ని బాలునికి కప్పి, మంత్రాన్ని పఠించారు. అతని చేతిని ముద్దాడి, శరీరాన్ని స్పృశించి హృదయపూర్వకంగా సంభాషించారు. ఈ సందర్భంగా తనకు రామచరణ్ కొత్త ఉన్న కుక్క పిల్ల లాంటిది కావాలని కోరాడు. పవన్ కళ్యాణ్ గారిని తన అభిమాని కోరికను తీర్చడంతో నిరంజన్ ఆనంద భరితుడయ్యాడు. ఓరుగల్లు కోటలోకి వేలాదిమంది అభిమానుల స్వాగత నినాదాలతో పవన్ కళ్యాణ్ అడుగు పెట్టారు. అరుదైన కండరాల వ్యాధితో బాధపడుతున్న నిరంజన్ జీవితకాలంలో ఎవరో నిర్ధారించలేరు కానీ, పవన్ కళ్యాణ్ మానవీయ స్పర్శ బిడ్డ జీవిత కాలాన్ని మరికొంత కాలం పొడిగిస్తుందనటం లో మాత్రం ఎలాంటి అతిశయోక్తి, అనుమానం మానవ మాత్రులకు ఉండవలసిన అవసరం లేదు.

పవన్ కళ్యాణ్ పంపిన పప్పి బహుమతితో నిరంజన్ ఆనందం