Telugu News Power

మంచినీటి సమస్యకు మూలం వైసీపీ నిర్లక్ష్యం. -మంత్రి నిమ్మల మరోసారి ఆరోపణ.

సమీక్ష సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి నిమ్మల

పాలకొల్లు: జూన్,9(తెలుగు న్యూస్ పవర్. కామ్) స్థానిక పట్టణ ప్రజల మంచినీటి కొరతకు మూలం, వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని, స్థానిక శాసనసభ్యులు, రాష్ట్ర జలవనరుల శాఖ మాత్యులు నిమ్మల రామానాయుడు ఆరోపించారు. మంత్రి మంగళవారం అభివృద్ధి పనులను ప్రత్యక్షంగా పరిశీలించారు. అనంతరం మున్సిపల్ కార్యాలయంలో అధికారులతో అభివృద్ధి పనులపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, మంచినీటి సమస్య శాశ్వత పరిష్కారం కోసం తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో, తాము ప్రతిపాదించిన విజ్జేశ్వరం నుంచి నేరుగా పైప్ లైన్ ద్వారా మంచినీటిని తరలించే ప్రాజెక్టుకు ఆమోదముద్ర పడిందన్నారు. ఈ ప్రాజెక్టుకు రూ. 253.33 కోట్ల రూపాయల నిధులు మంజూరయ్యాయని వెల్లడించారు. పనులు ప్రారంభించే సమయానికి, జగన్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో, అవగాహన రాహిత్యంతో, అత్యంత ముఖ్యమైన ఈ మంచినీటి ప్రాజెక్టును అటుకెక్కించారని విమర్శించారు. వైసీపీ ప్రభుత్వం వచ్చాక, నాటి మున్సిపల్ శాఖ మాత్యులు బొత్స సత్యనారాయణ ఈ ప్రాజెక్టు వివరాలు అసెంబ్లీ సాక్షిగా వెల్లడించారని తెలిపారు. నాటి ప్రభుత్వం పట్టించుకోకపోవడం వల్ల నిధులు మురిగిపోయాయన్నారు. ప్రస్తుతం మున్సిపల్ శాఖామాత్యులు పి. నారాయణ ద్వారా ఏడాది కోల్డ్ కష్టపడి, నిధులకు పునర్జీవం కల్పించారన్నారు. ప్రస్తుతం ఈ పనులకు సంబంధించి కార్యాచరణ ప్రారంభమైందని వెల్లడించారు. ఈ పనులు పూర్తయితే, ప్రజలకు నిరంతర మంచినీటి సరఫరా అందుబాటులోకి వస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో, ఆర్డిఓ, ప్రత్యేక అధికారి దాసి రాజు, ఇంచార్జ్ కమిషనర్ రాజ్ కుమార్, ఎమ్మార్వోలు యడ్ల దుర్గా కిషోర్, గ్రంధి పవన్ కుమార్, అధికారులు,ఈ. విజయ్ కుమార్, తోట నారాయణ రావు, మణికంఠ, కూటమి నాయకులు, పెచ్చెట్టి బాబు, ఉన్నమట్ల కాపర్తి, జక్కంపూడి కుమార్, గండేటి వెంకటేశ్వరరావు, పొట్నూరి శ్రీనివాస్, బిట్టా లక్ష్మీనారాయణ, విన్నకిట గోపి, పినిశెట్టి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.