Telugu News Power

మధ్యప్రదేశ్ కాంగ్రెస్ రాజ్యసభ అభ్యర్థి నామినేషన్‌తిరస్కరణ

నామినేషన్ తిరస్కరణకు గురైన మీనాక్షి.

భోపాల్: జూన్, 9(తెలుగు న్యూస్ పవర్.కామ్)
మధ్యప్రదేశ్‌లో జరగనున్న రాజ్యసభ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. కాంగ్రెస్ అభ్యర్థి మీనాక్షి నటరాజన్, నామినేషన్‌ను ఎన్నికల అధికారులు మంగళవారం తిరస్కరించారు.
నామినేషన్ పత్రాలతో పాటు సమర్పించిన అఫిడవిట్‌లో ఒక న్యాయ వ్యవహారానికి సంబంధించిన వివరాలను వెల్లడించలేదనే అభ్యంతరాన్ని పరిగణనలోకి తీసుకుని రిటర్నింగ్ అధికారి ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఈ అంశంపై భారతీయ జనతా పార్టీ అభ్యంతరం వ్యక్తం చేయడంతో విచారణ చేపట్టిన అధికారులు నామినేషన్‌ను చెల్లదని ప్రకటించారు.
అయితే కాంగ్రెస్ పార్టీ ఈ నిర్ణయాన్ని తీవ్రంగా ఖండించింది. మీనాక్షి నటరాజన్‌పై ఎలాంటి క్రిమినల్ కేసు నమోదు కాలేదని, తెలంగాణలోని ఒక వ్యవహారంలో కేవలం న్యాయ నోటీసు మాత్రమే జారీ అయిందని కాంగ్రెస్ నేతలు స్పష్టం చేశారు. అందువల్ల అఫిడవిట్‌లో ప్రత్యేకంగా పేర్కొనాల్సిన అవసరం లేదని వాదించారు.
ఈ పరిణామంతో మధ్యప్రదేశ్‌లో మూడు రాజ్యసభ స్థానాల ఎన్నికల్లో రాజకీయ సమీకరణాలు మారే అవకాశం కనిపిస్తోంది. కాంగ్రెస్ ఈ నిర్ణయాన్ని చట్టపరంగా సవాలు చేసే అవకాశముందని పార్టీ వర్గాలు వెల్లడించాయి.
రాజ్యసభ ఎన్నికల నేపథ్యంలో చోటుచేసుకున్న ఈ పరిణామం రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.