Telugu News Power

అగ్ని ప్రమాదంలో బూడిదైనా ఈవీఎం యంత్రాలు.

మంటల్లో చిక్కుకున్న ప్రభుత్వ భవనం

కోల్ కతా: జూన్, 14 (తెలుగు న్యూస్ పవర్. కామ్) పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన వెంటనే కోల్‌కతాలోని అలీపూర్ ప్రభుత్వ భవనంలో జరిగిన అగ్నిప్రమాదంలో సుమారు 4,000 ఈవీఎంలు బూడిదగా మారాయి. ఈ వార్త దవానంలా, దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. ఈ ఘటనపై విచారణ జరిపేందుకు కోల్‌కతా పోలీసులు ఇప్పటికే ఒక ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) ఏర్పాటు చేశారు.
పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలోని అలీపూర్ ప్రాంతంలో ఉన్న ఒక బహుళ అంతస్తుల ప్రభుత్వ భవనంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఇటీవల జరిగిన పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో 10 నియోజకవర్గాల్లో ఉపయోగించిన సుమారు 4,000 ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు (ఈవీఎంలు, వీవీప్యాట్లు) పూర్తిగా కాలి బూడిదయ్యాయి. ఫలితాలు వెల్లడైన కొద్దిరోజులకే, కోర్టులో ఎన్నికల పిటిషన్లు దాఖలు చేసే గడువు ముగియకముందే ఈ ప్రమాదం జరగడం దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. ధ
వింతగా వ్యాపించిన మంటల వల్ల అనుమానాల వెల్లువెత్తాయి.
ఈ అగ్నిప్రమాదం జరిగిన తీరుపై పశ్చిమ బెంగాల్ అగ్నిమాపక సేవల శాఖ సహాయ మంత్రి కౌశిక్ చౌదరి స్వయంగా పలు అనుమానాలు వ్యక్తం చేశారు. ఆయన ఘటనా స్థలాన్ని పరిశీలించిన అనంతరం మాట్లాడుతూ,”ఇది సాధారణ అగ్నిప్రమాదంలా కనిపించడం లేదు. మంటలు మొదట క్రింది అంతస్తులలో (2, 3 అంతస్తులు) కనిపించాయి. కానీ మధ్యలో ఉన్న 4, 5, 6 అంతస్తులకు ఏమీ కాకుండా, నేరుగా ఈవీఎంలు భద్రపరిచిన 8, 9, 10వ అంతస్తులకు మంటలు ఎలా వ్యాపించాయో అర్ధం కావడం లేదు” అని పేర్కొన్నారు. అంతేకాకుండా ఫైర్ సిబ్బందికి సమాచారం కూడా చాలా ఆలస్యంగా ఇచ్చారని ఆయన తెలిపారు.
రంగంలోకి ప్రత్యేక దర్యాప్తు బృందం,ఈ అగ్నిప్రమాదం వెనుక ఏదైనా విధ్వంసక చర్య లేదా కుట్ర ఉందా అనే కోణంలో దర్యాప్తు చేయడానికి కోల్‌కతా పోలీసులు నలుగురు సభ్యులతో కూడిన ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేశారు. అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ సుఖేందు ముఖోపాధ్యాయ నేతృత్వంలోని ఈ బృందం, ఫోరెన్సిక్ నిపుణులతో కలిసి నమూనాలను సేకరించింది. విద్యుత్ సరఫరా నిలిపివేసిన తర్వాత కూడా పై అంతస్తులలో మంటలు ఎలా అంటుకున్నాయనే కోణంలో దర్యాప్తు సాగుతోంది.

రేగుతున్న రాజకీయ దుమారం: ‘ఎవరు లబ్ధిదారుడు?’
ఈ ప్రమాదంపై తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ కమిషన్ పై తీవ్రంగా మండిపడింది. డయామండ్ హార్బర్ సబ్-డివిజన్ పరిధిలోని కాస్బా, జాదవ్‌పూర్, బెహలా ఈస్ట్, బెహలా వెస్ట్, మెటియాబురుజ్ వంటి కీలక నియోజకవర్గాల ఈవీఎంలు ఇందులో ఉన్నాయని పేర్కొంది. “ఇది కేవలం ప్రమాదమా లేక ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ ఓట్ల అవకతవకలకు సంబంధించిన కీలక సాక్ష్యాలను తుడిచిపెట్టడానికి జరిగిన వ్యవస్థీకృత కుట్రనా?” అని టీఎంసీ ప్రశ్నించింది.
మరోవైపు విపక్షాలు కూడా ఈ ఘటనపై సమగ్ర న్యాయ విచారణ జరపాలని డిమాండ్ చేస్తున్నాయి. ఎన్నికల చట్టాల ప్రకారం ఫలితాలు వచ్చిన 45 రోజుల వరకు ఈవీఎంలను భద్రపరచాల్సి ఉండగా, ఈ లోపే సాక్ష్యాలన్నీ కాలిపోవడం వల్ల భవిష్యత్తులో రీ-కౌంటింగ్ లేదా స్కృటినీ చేసే అవకాశం లేకుండా పోయిందని రాజకీయ విశ్లేషకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఫోరెన్సిక్ నివేదిక వస్తేనే గానీ ఇది ప్రమాదమా లేక ఉద్దేశపూర్వక కుట్ర అనేది తేలనుంది. ఈ అగ్ని ప్రమాదం దేశంలోనే అరుదైన దురదృష్టకర సంఘటన.