Skip to main content

Telugu News Power

రవీంద్రభారతిలో ఘనంగా దసరా సంబరాలు. -పలువురు ప్రముఖులకు దసరా పురస్కారాలు.

సభలో మాట్లాడుతున్న బాలా చారి, సినీ నిర్మాత కొండేటి సురేష్, డాక్టర్ కేశిరాజు రాంప్రసాద్ తదితరులు.

హైదరాబాద్: అక్టోబర్,17
(తెలుగు న్యూస్ పవర్. కామ్)
రవీంద్రభారతి కాన్ఫరెన్స్ హాల్‌లో దసరా సంబరాలు, దసరా పురస్కారాల ప్రదానోత్సవం శనివారం ఘనంగా జరిగింది. తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ, తెలుగు భాషా చైతన్య సమితి, నక్క వెంకటమ్మ యాదవ్ – నక్క యాదగిరి స్వామి యాదవ్ ఎడ్యుకేషన్ స్పోర్ట్స్ ఫౌండేషన్, జాతీయ తెలుగు సారస్వత పరిషత్, పాలడుగు నాగయ్య కళాపీఠం, గోల్కొండ సాహితీ కళా సమితి, కుసుమ ధర్మాన కళాపీఠం, లక్ష్యసాధన ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. తెలుగు భాషా చైతన్య సమితి వ్యవస్థాపక అధ్యక్షులు బడే సాబ్ కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా పాల్గొన్న, సాహిత్య అకాడమీ కార్యదర్శి, నమోజు బాలాచారి మాట్లాడుతూ, భారతీయ సంస్కృతిలో పండుగలు, సాంస్కృతిక కార్యక్రమాలు ప్రజలందరినీ ఏకం చేయడంతో పాటు, మానవ సంబంధాలను మరింత బలోపేతం చేస్తాయని అన్నారు.
స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ కార్యదర్శి ఈ.ఆర్. పుల్లయ్య మాట్లాడుతూ, కవులు, కళాకారులు సమాజంలో జరిగే సంఘటనలను తమ రచనల్లో ప్రతిబింబిస్తూ, ప్రజలకు సరైన దిశానిర్దేశం చేసేలా కవిత్వం రాయాలని సూచించారు. సమాజానికి ఉపయోగపడే సాహిత్యం కాలపరీక్షకు నిలుస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనడం ఆనందంగా ఉందని తెలిపారు.
కేశిరాజు రాంప్రసాద్ మాట్లాడుతూ, తెలుగు రాష్ట్రాల్లోని కవులు తమ రచనల ద్వారా మానవ సంబంధాల బలోపేతానికి కృషి చేయాలని కోరారు. సినీ నిర్మాత కొండేటి సురేష్ మాట్లాడుతూ, బతుకమ్మ, దేవీ నవరాత్రి ఉత్సవాలు, శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల నేపథ్యంలో ఇటువంటి సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని అన్నారు.
ఈ సందర్భంగా ప్రముఖ రచయిత దుబ్బా భాస్కరరావు, ప్రముఖ రచయిత్రి గాయత్రి చిరుమామిళ్ల, ప్రముఖ కవి భోగిల ఉమామహేశ్వరరావు, ప్రముఖ సాహితీవేత్త గజవెల్లి సత్యనారాయణ స్వామి, ప్రముఖ సాహితీవేత్త, గైనకాలజిస్ట్ డాక్టర్ శాంతిశ్రీ, ప్రముఖ రచయిత డాక్టర్ దాసరి శ్రీనాథ్ గౌడ్‌లకు దసరా పురస్కారాలు అందజేసి ఘనంగా సత్కరించారు.
కార్యక్రమానికి రామకృష్ణ చంద్రమౌళి అధ్యక్షత వహించారు. తెలుగు భాషా చైతన్య సమితి ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఎడ్ల కల్లేశ్, కార్యదర్శి లకుమల్ల జగన్, గంట మనోహర్ రెడ్డి, రాధా కుసుమ, కేశిరాజు రాంప్రసాద్, గజవెల్లి సత్యనారాయణ స్వామి, పాలడుగు సరోజినీ దేవి, వనజ బలుసాని, పీవీపీ అంజనీ కుమారి, డాక్టర్ ముట్నూరు ఉపేంద్ర శర్మ, టీ. కరుణాకర్ గుప్తా, నక్క శ్రీనివాస్ యాదవ్, ప్రజ్ఞా రాజు తదితరులు పాల్గొన్నారు.
తెలుగు రాష్ట్రాల నుంచి పలువురు కవులు, రచయితలు, కళాకారులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. తెలుగు భాష, సాహిత్యం, సంస్కృతి పరిరక్షణకు ఇటువంటి కార్యక్రమాలు దోహదపడతాయని నిర్వాహకులు పేర్కొన్నారు.