Telugu News Power

శ్రీ మావుళ్ళమ్మ ఆలయంలో జరిగే చండీ హోమానికి భక్తులు తరలి రావాలి.

భీమవరం: జులై, 9 (తెలుగు న్యూస్ పవర్. కామ్) పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం ప్రముఖ ఇలవేలుపు, తెలుగు ప్రజలు ఆరాధ్యదైవం, శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి దేవస్థానంలో జ్యేష్ఠ అమావాస్య సందర్భంగా ఈ నెల 14న మంగళవారం ఉదయం 7 గంటలకు, అత్యంత వైభవంగా మహా చండీ హోమం జరుగుతుంది..
అమావాస్య తిథి దైవారాధన, దుష్టశక్తుల నివారణ, శాంతి, ఐశ్వర్య ప్రాప్తికి అత్యంత పవిత్రమైనదని ఋషులు నిర్ధారించారు,ఈ పుణ్యదినాన నిర్వహించే చండీ హోమం ద్వారా దుర్గాదేవి అనుగ్రహం లభించి, కుటుంబ శాంతి, ఆరోగ్యం, ఐశ్వర్యం, శత్రుబాధల నివారణ, దృష్టిదోషాల తొలగింపు, కార్యసిద్ధి, సకల శుభఫలాలు కలుగుతాయని, పురాణ గ్రంథాల్లో ప్రస్తావించారు.
ఈ సందర్భంగా దేవస్థానం అర్చకులు, వేదపండితుల మంత్రోచ్చారణలతో గణపతి పూజ, పుణ్యాహవాచనం, కలశస్థాపన, నవావరణారాధన, మహా చండీ హోమం, పూర్ణాహుతి, అమ్మవారికి విశేష అలంకరణ, మహామంగళహారతి నిర్వహింస్తారు.భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి మహా చండీ హోమంలో పాల్గొని, అమ్మవారి కృపాకటాక్షాలను పొందాలని దేవస్థానం అసిస్టెంట్ కమీషనర్ బుద్ద మహాలక్ష్మి నగేష్, చైర్మన్ బొండాడ నాగభూషణం, ధర్మకర్తలు గురువారం తెలిపారు.