Telugu News Power

పాలకొల్లు కు ఫిలిం ఇన్స్టిట్యూట్ #news #cinema #telugu #Palakollu

కళలకు పుట్టిల్లు పాలకొల్లు. పాలకొల్లు. కళాకారుల చిరకాల వాంఛ త్వరలోనే సాకారం కాబోతుంది. కాస్మోపాలిటన్ క్లబ్ అధ్యక్షులు, పాలకొల్లు వ్యవసాయ మార్కెట్ కమిటీ పూర్వ అధ్యక్షులు గొట్టుముక్కల గాంధీ భగవాన్ రాజు అధ్యక్షతన పత్రికా విలేకరుల సమావేశం శుక్రవారం జరిగింది. ఈ సమావేశంలో ఏర్పాటు చేయబోయే ఫిలిం ఇన్స్టిట్యూట్ విశేషాలను వివరించారు. ఈ ఇన్స్టిట్యూట్ కు అల్లూరి సీతారామరాజు జాతీయ ఫిలిం ఇన్స్టిట్యూట్ గా నామకరణం చేశారు. తొలి కార్యవర్గాన్ని ప్రకటించారు. కార్యనిర్వాహక కమిటీలో గౌరవ సలహాదారుగా పూర్వ మంత్రి, ఎంపీ, సినీ నిర్మాత చేగొండి హరినామ జోగయ్య నియమితులయ్యారు. గౌరవ అధ్యక్షులుగా గాంధీ భగవాన్ రాజు, అధ్యక్షులుగా ముత్యాల శ్రీనివాస్, ఉపాధ్యక్షులుగా డీటీడీసీ బాబు, బోనం వెంకట నరసయ్య, కార్యదర్శిగా డాక్టర్ వర్మ, సహాయ కార్యదర్శిగా విటపు వెంకటరమణ, కోశాధికారిగా కలిదిండి గణపతిరాజు ఉన్నారు. ప్రస్తుతం పోలపల్లి బైపాస్ రోడ్ లో ఉన్న మూడంతస్తుల భవనాన్ని అద్దెకి తీసుకున్నారు. ఈ భవనంలో నవంబర్ 5వ తేదీన ఫిలిం ఇన్స్టిట్యూట్ ప్రారంభోత్సవం జరగనుంది. స్థానిక కళాకారులకు ఎక్కువ అవకాశాలు ఇవ్వడానికి ఈ ఇన్స్టిట్యూట్ ద్వారా వీలవుతుందని తెలిపారు. ప్రస్తుతానికి కాస్మోపాలిటన్ కల్చరల్ స్పోర్ట్స్ క్లబ్, క్షత్రియ పరిషత్, తదితర దాతలతో ఇన్స్టిట్యూట్ నిర్వహణ సాగిస్తామని అన్నారు. మంత్రి నిమ్మల రామానాయుడు సినీ ఫోటోగ్రఫీ మంత్రి వర్యులు కందుల దుర్గేశుల తో ఇందుకోసం సంప్రదిస్తామని చెప్పారు. చేగొండి హరిరామ జోగయ్య వివిధ సందర్భాల్లో వివిధ వేదికలపై ఫిలిం ఇన్స్టిట్యూట్ కోసం విశేష కృషి చేశారని, అందువల్ల ఈ ఇన్స్టిట్యూట్ కు అంకురార్పణ జరిగినట్లు భగవాన్ రాజు తెలిపారు. ఈ ఫిలిం ఇన్స్టిట్యూట్ కి రాజావనం రెడ్డి, కేసరాజు రాంప్రసాద్, చేకూరి సూరిబాబు, మేడికొండ శ్రీనివాస్ చౌదరి, కలిదిండి కృష్ణవర్మ, కే. సుధీర్, సారిక రామచంద్రరావు, రాపాక ప్రవీణ్ భాను, గొట్టుముక్కల వర్మ, గుడాల హరిబాబు, చవాకుల నరేష్, ముత్యాల శ్రీనివాస్ ప్రదీప్ సభ్యులుగా ఉంటారు.