Telugu News Power

అయ్యప్ప భక్తులు ఉద్యమిస్తారు

కేరళ ప్రభుత్వం స్వామి భక్తులకు సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేస్తున్న బీజేపీ నాయకులు కుమార్

పాలకొల్లు:నవంబర్,22 (తెలుగు న్యూస్ పవర్) దేశవ్యాప్తంగా ఉన్న అయ్యప్ప భక్తుల ఆగ్రహాన్ని కేరళ కమ్యూనిస్టు ప్రభుత్వం ఎదుర్కోలేదని బిజెపి నాయకులు, రైల్వే కమిటీ సభ్యులు జక్కంపూడి కుమార్ పత్రికలకు విడుదల చేసిన తన వీడియోస్ సందేశంలో హెచ్చరించారు. కోట్లాది రూపాయల అయ్యప్ప భక్తుల నిధులను అందుకుంటున్న కేరళ ప్రభుత్వం, వ్యాపారాలు చేసుకొనే వారికి ఎంతో సొమ్ము చెల్లిస్తున్నా,భక్తుల కోసం కనీస సౌకర్యాలు కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. స్వామిని దర్శించుకునే భక్తులు ఎండకు ఎండుతూ,వానకు తడుస్తూ, చలికి వణుకుతూ ఎన్నో ఇబ్బందులు పడుతున్నారన్నారు.భక్తులు స్వామి చెంతకు రాకుండా కేరళ కమ్యూనిస్టు ప్రభుత్వం నిరుత్సాహం పరుస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. భక్తులను పంబానదికి సుమారు 30 కిలోమీటర్ల దూరంలో ఆపేస్తున్నారని ఆరోపించారు.
భక్తులు నదిని చేరటానికి విద్యుత్ వాహనాలు ఏర్పాటు చేయవచ్చని సూచించారు. పంబ నది పరిసర ప్రాంతాలు, పంబానది ప్రక్షాళన చేయకపోవడం దుర్మార్గమైన చర్య అన్నారు.ప్రభుత్వం వివిధ సేవల రూపంలో భక్తులను దోచుకుంటుందని నిరసన తెలిపారు. భక్తులు ఎంతో విశ్వాసంతో అయ్యప్ప స్వామిని కొలుస్తారన్నారు. అంతే ప్రేమతో అయ్యప్ప స్వామి భక్తుల కోర్కెలు తీరుస్తాడనడానికి ఎన్నో నిదర్శనాలు ఉన్నాయన్నారు. ఆంధ్రప్రదేశ్లోని తిరుమల తిరుపతి దేవస్థానం, కాలిబాటన వెళ్లే భక్తులకు షెల్టర్ ఏర్పాటు చేసిందన్నారు. భక్తులకు కావలసిన ఆహార పానీయాలు ఉచితంగా అందజేస్తారన్నారు. కేరళ ప్రభుత్వం వెంటనే తన అయ్యప్ప భక్తుల వ్యతిరేక విధానాన్ని మార్చుకోకపోతే దేశవ్యాప్తంగా ఉన్న అయ్యప్ప స్వామి భక్తులు ఉద్యమించి కేరళ ప్రభుత్వాన్ని ఇబ్బందుల పాలు చేయటం ఖాయం అన్నారు. ఇప్పటికే ఈ విషయం ప్రధానమంత్రి దృష్టికి తీసుకెళ్లామన్నారు. కేరళ ప్రభుత్వం భక్తులకు తగిన వసతి సదుపాయాలు వెంటనే కల్పించాలని డిమాండ్ చేశారు.