పాలకొల్లు:నవంబర్,22 (తెలుగు న్యూస్ పవర్) కృష్ణా నది జలాల వివాదానికి సంబంధించి ట్రిబ్యునల్ -2 ముందు వాదనలు వినిపించడంలో కూటమి ప్రభుత్వం విఫలమైందని మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు రాసిన లేఖ పై మంత్రి నిమ్మల రామానాయుడు నిప్పులు చెరిగారు. పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు లో శనివారం సాయంత్రం రాష్ట్ర జలవి వనరులశాఖమాత్యులు నిమ్మల రామానాయుడు పత్రికా ప్రకటన విడుదల చేశారు. జగన్ ఆంధ్రరాష్ట్ర జలవనరులను తెలంగాణకు తాకట్టు పెట్టారని ఆరోపించారు. మాజీ ముఖ్యమంత్రి జగన్ తన ఐదేళ్ల పాలనలో ఈ సమస్యను ఎందుకు పరిష్కరించలేకపోయారని ప్రశ్నించారు. తన హయాంలో ఆంధ్ర జలప్రయోజనాలను దెబ్బ కొట్టారని ఆరోపించారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వాన్ని విమర్శించడం విడ్డూరంగా ఉందన్నారు. జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు కురిపిస్తున్న మొసలి కన్నీళ్లు, ఆరోజు ఏమయ్యాయని మంత్రి నిమ్మల నిలదీశారు. జగన్ తను అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్ర నీటిపారుదల వ్యవస్థను చిన్నాభిన్నం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉత్తరాంధ్ర, రాయలసీమ, పోలవరం ప్రాజెక్ట్ పనులపై నీళ్లుచల్లి,నిర్వీర్యం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో జలవనరుల ప్రాజెక్టులన్ని పాతికేళ్లు వెనక్కు పోవడానికి మీఅసమర్థ, అవినీతి పాలన కారణం కాదాని ప్రశ్నించారు. కెసిఆర్ రాష్ట్ర పునర్విభజన చట్ట నిబంధనలు వ్యతిరేకంగా మాట్లాడినప్పుడు మీరు నోరు ఎందుకు మెదపలేకపోయారని విమర్శించారు. ప్రస్తుతం పనులు జరుగుతున్న ప్రాజెక్టులు భవిష్యత్తులో నిర్మించబోయే ప్రాజెక్టుల ప్రాతిపదికన జరగాలని కోరినప్పుడు, మీ మౌనం దేనికి సంకేతం అని నిలదీశారు. కృష్ణా జలాల వివాదాల ట్రిబ్యునల్- 2 ఏర్పాటు కావడానికి కారణం జగన్మోహన్ రెడ్డి చలవేనన్నారు. పక్క రాష్ట్రంపై ఉన్న ప్రేమ వల్ల న్యాయంగా ఆంధ్ర కు రావలసిన జలాలపై ఏ విధమైన ప్రతిఘటన చేయలేదన్న అన్నారు. ఎన్నికల దృష్టిలో పెట్టుకొని మొక్కుబడిగా సుప్రీంకోర్టులో రిట్ వేయడాన్ని తప్పుపట్టారు. రాష్ట్ర విభజన సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన సమర్థతతో 512 టీఎంసీల నీటిని కేటాయించుకోగలిగారన్నారు.
వరద జలాలు 45 టీఎంసీలు తెలంగాణకే చెందాలని పట్టుబట్టినప్పుడు ఎందుకు అభ్యంతరం చెప్పలేకపోయారని నిందించారు.అత్యంత అనుభవజ్ఞులైన ఏకే గోయల్ ను వాదనకు దింపగా, అతని పనితీరును విమర్శించడం దురదృష్టంకరం అన్నారు. జగన్ హయాంలో మొత్తం 198 ప్రాజెక్టులు అర్థంతరంగా ముగించేశారన్నారు.అందులో 102 ఒక్క రాయలసీమలోనే ఉన్నాయన్నరు. రాయలసీమకు ఏ ముఖ్యమంత్రి చేయనంత దుర్మార్గం చేసిన మాజీ ముఖ్యమంత్రి జగన్ కు రాయలసీమ నీటి ప్రాజెక్టులపై మాట్లాడే నైతిక హక్కుకూడా లేదన్నారు.చంద్రబాబు రాయలసీమ నీటి ప్రాజెక్టుల కోసం 12 వేల కోట్ల నిధులు కేటాయించగా,జగన్ తన హయాంలో కేవలం 2000 కోట్ల నిధులు మాత్రమే కేటాయించారని వెల్లడించారు. సమస్యలపై చర్చించటానికి వేదికైనా అసెంబ్లీకి వచ్చి స్పష్టమైన సమాధానం పొందవచ్చునని సలహా ఇచ్చారు. పార్టీ భవిష్యత్తు మసకబారుతున్న వేళ,తన ఉనికిని కాపాడుకోవడానికి మాత్రమే ఇలాంటి చౌకబారు లేఖలు సంధిస్తున్నారని నిమ్మల మండిపడ్డారు. ఆంధ్ర రాష్ట్రానికి రావలసినజలవనరుల వాటాను తేలేకపోయినందుకు, ఆంధ్ర రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బ తీసినందుకు ప్రజలకు సమాధానం, క్షమాపణ చెప్పాలని రామానాయుడు మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిని డిమాండ్ చేశారు.
జగన్ నీటి లేఖపై నిప్పులు చెరిగిన- మంత్రి నిమ్మల
పత్రికా ప్రకటన విడుదల చేస్తున్న మంత్రి నిమ్మల.