Telugu News Power

ఏ ఎస్ ఎన్ ఎం కళాశాలలో విద్యార్థులకు డ్రోన్ శిక్షణ.

డ్రోన్ పైలెట్ శిక్షణ కార్యక్రమం

పాలకొల్లు: ఫిబ్రవరి,10(తెలుగు న్యూస్ పవర్)
శ్రీ అద్దేపల్లి సత్యనారాయణమూర్తి ప్రభుత్వ (స్వయం ప్రతిపత్తి) కళాశాల, పాలకొల్లు నందు విద్యార్థుల్లో ఉపాధి నైపుణ్యాలు, వ్యాపార దృక్పథం మరియు స్వయం ఉపాధి అవకాశాలను పెంపొందించడమే లక్ష్యంగా, ఎస్.కె.పి. ప్రభుత్వ డిగ్రీ కళాశాల (అటానమస్), గుంతకల్లు, అనంతపురం జిల్లా వారి ఆర్థిక సహకారంతో, పీఎం–ఉషా జి.ఐ.ఈ.ఐ స్కీం కింద ఏరీస్ ఆగ్రో లిమిటెడ్, ముంబై సంస్థ సహకారంతో పలు నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తూన్నారు.
ఈ కార్యక్రమాల్లో భాగంగా, కళాశాల ఎన్ఎస్ఎస్ యూనిట్–I, II మరియు మహిళా సాధికారతా విభాగం ఆధ్వర్యంలో బాలికల కోసం నిర్వహిస్తున్న 5 రోజుల ఏరియల్ డ్రోన్ పైలట్ ట్రైనింగ్లో రెండవ రోజు, డ్రోన్ పైలట్ పి. దుర్గా ప్రసాద్ విద్యార్థినులకు డ్రోన్ టెక్నాలజీకి సంబంధించిన ముఖ్య అంశాలైన డ్రోన్ భాగాలు మరియు నిర్మాణం, ఫ్లైట్ కంట్రోల్స్, రిమోట్ ఆపరేషన్ విధానం, జీపీఎస్ & నావిగేషన్ సిస్టమ్స్, ఫ్లైట్ ప్లానింగ్, టేక్ ఆఫ్–ల్యాండింగ్ పద్ధతులు, భద్రతా నియమాలు, బ్యాటరీ మేనేజ్‌మెంట్, డ్రోన్ మెయింటెనెన్స్, ఎమర్జెన్సీ హ్యాండ్లింగ్, ఏరియల్ మ్యాపింగ్, వ్యవసాయ స్ప్రేయింగ్, ఫోటోగ్రఫీ–వీడియోగ్రఫీ వంటి అంశాలపై విస్తృత అవగాహన కల్పించారు. డ్రోన్ టెక్నాలజీ ద్వారా వ్యవసాయం, భూసర్వే, పంటల పర్యవేక్షణ, విపత్తుల నిర్వహణ వంటి రంగాలలో విస్తృత ఉపాధి అవకాశాలు ఉన్నాయని నిపుణులు వివరించారు.
కళాశాల రసాయన శాస్త్ర విభాగం మరియు మహిళా సాధికారతా విభాగం సంయుక్త ఆధ్వర్యంలో భూసార పరీక్షలపై రెండవ రోజు ల్యాబ్ ఆధారిత శిక్షణా కార్యక్రమం విజయవంతంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో భూసార పరీక్షల నిపుణులు వినయ్ కుమార్ మరియు వినీత్, మట్టిలోని పీహెచ్, ఆర్గానిక్ కార్బన్, నత్రజని, ఫాస్పరస్, పొటాషియం వంటి మూలకాలను పరీక్షించే విధానాలు, నమూనాల సేకరణ, ప్రీ-ప్రాసెసింగ్, టెస్టింగ్ మరియు అనాలసిస్ ప్రక్రియలపై విద్యార్థులకు ప్రత్యక్షంగా శిక్షణ అందించారు. ఈ శిక్షణ వ్యవసాయ రంగం, ల్యాబ్ టెక్నీషియన్ ఉద్యోగాలు మరియు స్వయం ఉపాధికి దోహదపడుతుందని తెలిపారు.
ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ టి. రాజరాజేశ్వరి మాట్లాడుతూ, ఇటువంటి స్కిల్ ఆధారిత శిక్షణా కార్యక్రమాలు విద్యార్థులకు పుస్తక జ్ఞానాన్ని మించి ఆచరణాత్మక అవగాహనను అందిస్తాయని, బాలికలకు స్వయం ఉపాధి మరియు స్టార్ట్-అప్ అవకాశాలకు మార్గం చూపుతాయని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమాల్లో కళాశాల వైస్ ప్రిన్సిపల్ టి. కృష్ణ, తెలుగు విభాగాధిపతి డా. బి. వెంకట స్వామి, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్లు డా. ఎం. రామకృష్ణ, డా. వి.డి.వి. విజయలక్ష్మి, మహిళా సాధికారతా విభాగం కన్వీనర్ బి.కె.వి. రామలక్ష్మి, రసాయన శాస్త్ర అధ్యాపకులు ఏ. వంశీ సుబ్బరాయన్, దివ్య, జీడి శ్రీనివాస్, ఎన్ఎస్ఎస్ కమిటీ మెంబర్లు పి. జోష్న శ్రీ, డి. హెప్సి రాణి తదితర అధ్యాపకులు మరియు విద్యార్థినీ విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు.