రాజమహేంద్రవరం: జూలై, 28 (తెలుగు న్యూస్ పవర్. కామ్)
ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పుగోదావరి జిల్లా, రాజమహేంద్రవరం సమీపంలోని ధవళేశ్వరం కు చెందిన బాలిక కందుల జెస్సీకి ప్రశంసల పరంపర కొనసాగుతుంది. ఉప ముఖ్యమంత్రి కొణిదల పవన్ కళ్యాణ్, సాంస్కృతిక శాఖామాత్యులు కందుల దుర్గేష్ ను కలుసుకున్న జెసికి అవసరమైన సహాయ సహకారాలు అందించడానికి ముందుకు వచ్చారు. ఈమె ప్రస్తుతం ధవలేశ్వరంలోని జిల్లా పరిషత్ పాఠశాలలో 10వ తరగతి విద్యార్థి. అంతరిక్ష పరిశోధనకు సంబంధించి జెస్సి సాధించిన విజయం రాష్ట్రమంతటా,
మార్మోగిపోతున్నది. అరుదైన అవకాశాన్ని ఈమె అందిపుచ్చుకోవటం ఈ ఘనతకు కారణమైంది.
చంద్రయాన్ తరహా ‘మిషన్ శక్తిశాట్’ లో అరుదైన అవకాశం ఆమెను వెతుక్కుంటూ వచ్చింది. దాదాపు 108 దేశాల నుంచి
12 వేల మందిలో ఎంపికైన ఆంధ్రప్రదేశ్ బాలిక, జెస్సీ. ఈమె ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది. ప్రపంచంలోని తొలి ఆల్-గర్ల్స్ లూనార్ క్యూబ్‌సాట్ మిషన్ ‘మిషన్ శక్తిశాట్ ’ కోసం జరిగిన ఎంపికలో భారత్ నుంచి ఎంపికైన 20 మంది విద్యార్థినుల్లో జెస్సీ ఒకరు. ఈ జాబితాలో చోటు దక్కించుకున్న ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఏకైక విద్యార్థిని
జెస్సీ. తండ్రి వడ్రంగి (కార్పెంటర్) పనిచేస్తారు. సాధారణ కుటుంబ నేపథ్యం నుంచి వచ్చిన ఆమెకు విజ్ఞాన శాస్త్రంపై ఉన్న ఆసక్తిని గుర్తించిన ఫిజికల్ సైన్స్ ఉపాధ్యాయురాలు, అటల్ టింకరింగ్ ల్యాబ్ ఇన్‌చార్జి మణిమాల ఆమెను ఈ కార్యక్రమానికి దరఖాస్తు చేయాలని ప్రోత్సహించారు. ఒక దశలో ఆన్‌లైన్ కోర్సు గడువు ముగిసినా, నిర్వాహకులతో మాట్లాడి మరో అవకాశం కల్పించడం ద్వారా ఆమె కలను సాకారం చేసేలా సహకరించారు. ఈ కార్యక్రమంలో భాగంగా జెస్సీ 21 మాడ్యూళ్లలో సుమారు 550 శిక్షణా సెషన్లు పూర్తి చేసింది. శాటిలైట్ వ్యవస్థలు, ప్రొపల్షన్, థర్మోడైనమిక్స్, అంతరిక్ష సాంకేతికత వంటి 10వ తరగతి స్థాయికి మించిన అంశాలను నేర్చుకుని తన ప్రతిభను చాటింది. ఎంపిక అనంతరం న్యూఢిల్లీలో శిక్షణ పొందుతూ, శాస్త్రవేత్తలతో కలిసి ఉపగ్రహ రూపకల్పన, పేలోడ్ అభివృద్ధి, మిషన్ ఆపరేషన్స్‌లో పాల్గొనే అవకాశం ఆమెకు లభించనుంది. ప్రతిపాదిత క్యూబ్‌సాట్‌ను శ్రీహరికోట నుంచి ప్రయోగించాలనే ప్రణాళిక ఉంది.జెస్సీ విజయం ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు, ముఖ్యంగా బాలికలకు, విజ్ఞాన శాస్త్రం, అంతరిక్ష రంగాల్లో ఉన్న అపార అవకాశాలను చాటిచెప్పే ప్రేరణగా నిలుస్తోంది.
శక్తిశాట్ కు ఎంపికపై ప్రశంసల పరంపర. అంతరిక్షానికి నిచ్చెనలు వేస్తున్న జెస్సి మేథస్సు.
అంతరిక్ష పరిశోధన కార్యక్రమం లో అవకాశం పొందిన జెస్సి