పాలకొల్లు: ఆగస్టు,1( తెలుగు న్యూస్ పవర్. కామ్) ప్రపంచ వెబ్ దినోత్సవం సందర్భంగా, స్థానిక శ్రీ అద్దేపల్లి సత్యనారాయణమూర్తి ప్రభుత్వ స్వయం ప్రతిపత్తి కళాశాలలో కంప్యూటర్ సైన్స్ అండ్ అప్లికేషన్స్ విభాగం ఆధ్వర్యంలో ప్రత్యేక అవగాహన కార్యక్రమం శనివారం నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కె. రత్నమాణిక్యం అధ్యక్షత వహించారు. ముఖ్య వక్తగా పాల్గొన్న వీరవల్లి ఎం.కె ప్రసాద్ ప్రపంచ వ్యాప్త వెబ్ ఆవిర్భావం, ఇంటర్నెట్ సాంకేతికత అభివృద్ధిలో వెబ్ పాత్ర, డిజిటల్ యుగంలో వెబ్ వినియోగం, సైబర్ భద్రత, సమాచార మార్పిడిలో వెబ్ ప్రాధాన్యత వంటి అంశాలపై విద్యార్థులకు సమగ్రంగా వివరించారు. నేటి విద్య, ఉపాధి, పరిశోధన మరియు ఆవిష్కరణలలో వెబ్ కీలక పాత్ర పోషిస్తోందని ఆయన పేర్కొన్నారు. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కె. రత్నమాణిక్యం మాట్లాడుతూ, సమాచార సాంకేతిక రంగంలో నైపుణ్యాలను పెంపొందించుకోవడానికి విద్యార్థులు వెబ్ సాంకేతికతలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అదే సమయంలో డిజిటల్ వనరులను బాధ్యతాయుతంగా, సురక్షితంగా ఉపయోగించడం ప్రతి విద్యార్థి బాధ్యత అని తెలిపారు.ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ టి కృష్ణ, ఐక్యూఏసి కోఆర్డినేటర్ డాక్టర్ బూసి వెంకటస్వామి, అకాడమిక్ కోఆర్డినేటర్ జి సుమలత, కంప్యూటర్ అప్లికేషన్స్ అధ్యాపకులు సిహెచ్ రవికుమార్, అధ్యాపకులు డాక్టర్ ఎం రామకృష్ణ,డాక్టర్ వి విజయలక్ష్మి, జి వేణు మాధురి మరియు విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.