పాలకొల్లు: ఫిబ్రవరి14(తెలుగు న్యూస్ పవర్)గత 15 రోజుల క్రితం నుంచి రొయ్యల దాణ రేట్లు పెంచవద్దని ఆక్వా రైతులు చేస్తున్న విజ్ఞప్తిని పెడచెవినపెట్టి, ఈనెల 4న, కిలోకు నాలుగు రూపాయల చొప్పున పెంచడంపై ఆక్వా రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. పన్నులు తగ్గించినప్పుడు, దానా రేటు తగ్గించకపోగా, ఆక్వా రైతు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, మూలిగే నక్కపై, తాటిపండు పడ్డట్టు, దాణా ధర పెంచడంపై రైతులు జీర్ణించుకోలేకపోతున్నారు.
స్థానిక జై భారత్ క్షీరారామ రైతు సంఘం, అత్యవసరంగా శనివారం సమావేశమయ్యింది. ప్రస్తుత పరిస్థితులపై సమావేశంలో విస్తృతంగా చర్చించారు. దీనిపై , సంఘ నాయకులు, సభ్యులు కార్యచరణ ప్రకటించారు. స్థానిక శాసనసభ్యులకు, ఆయా ప్రాంతాల్లో ఉన్న ఆక్వా రైతులు ఆదివారం వినతిపత్రం అందజేసి, తమ సమస్యను వారి దృష్టికి తీసుకువెళ్లే కార్యక్రమం ఆదివారం చేపడుతారు. భీమవరంలో, సోమవారం కలెక్టర్ కార్యాలయం వద్ద జిల్లా ఆక్వా రైతు సంఘాల ఆధ్వర్యంలో కలెక్టర్ కు వినతిపత్రం సమర్పిస్తారు. ఈ విధంగా, అటు ప్రజాప్రతినిధులు,ఇటు అధికారుల ద్వారా ఆక్వా రైతుల సమస్యను ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లాలని నిర్ణయించారు.ఈ కార్యక్రమంలో జిల్లా నలుమూలల నుండి ఆక్వా సంఘ నాయకులు, రైతులు వేల సంఖ్యలో పాల్గొని, కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని, ఆక్వా రైతు సంఘ అధ్యక్షులు గొట్టుముక్కల గాంధీ భగవాన్ రాజు పిలుపునిచ్చారు. హేచరీలు, ప్రాసెసింగ్ యూనిట్లు, ఫీడ్ ఫ్యాక్టరీలు స్పందన చూసి తదుపరి కార్యాచరణకు పూనుకుంటామన్నారు. ఏసు మూవీస్ లో పలువురు ఆక్వా సంఘ నాయకులు,రైతులు పాల్గొన్నారు.
ఆక్వా రైతుల సమరభేరి.
ఆక్వా రైతుల కార్యాచరణ వివరిస్తున్న గొట్టుముక్కల గాంధీ భగవాన్ రాజు