Skip to main content

Telugu News Power

శివనామస్మరణతో మారుమ్రోగిన శైవక్షేత్రాలు.

యలమంచిలి ఉమా సోమేశ్వర ఆలయం శివరాత్రి అలంకరణ.

పాలకొల్లు: ఫిబ్రవరి,15(తెలుగు న్యూస్ పవర్) శివరాత్రి సందర్భంగా పంచారామ క్షేత్రం, స్థానిక క్షీరా రామలింగేశ్వర స్వామి వారి ఆలయం తెల్లవారుఝామున 3గంటలకే తెరిచారు. దర్శనం కోసం భక్తులు 4 గంటల నుంచి విశేషంగా తరలివచ్చారు. ఉపవాస దీక్ష, జాగారం చేస్తూ చాలామంది భక్తులు ఆలయంలోనే ఉండిపోయారు. ఆలయానికి వచ్చిన భక్తులకు, వివిధ ధార్మిక సంస్థల వారు త్రాగునీరు, ప్రసాదాలు అందజేశారు. లింగోద్భవ సమయంలో సరిగ్గా 12 గంటలకు అఖండ జ్యోతి ధర్మకర్తల మండలి అధ్యక్షులు మీసాల రామచంద్ర రావు ప్రజ్వలన చేశారు. మల్లన్న తరపాగా లింగోద్వ సమయానికి కొంత ఆలస్యంగా ఏర్పాటు చేశారు. చైర్మన్ మీసాల రామచంద్ర రావు,ఆలయ కార్య నిర్వహణ అధికారి ముచ్చర్ల శ్రీనివాసరావు, , భక్తుల సౌకర్యార్థం నిరంతరం పర్యవేక్షించారు. వారి సిబ్బంది విధుల్లో నిమగ్నమయ్యారు. అభిషేక మండపంలో రాత్రి వరకు అభిషేకాలు నిర్వహించారు. లోపల వాలంటీర్లు, ధార్మిక సంస్థల కార్యకర్తలు భక్తులు సేవలందించారు. జాగారం చేసే భక్తులకు, కంటిమీద కునుకు పడకుండా, కనువిందు అయిన సాంప్రదాయ నృత్య ప్రదర్శనలు భక్తులను మంత్రం ముగ్దులను చేశాయి. అతిపిన్న వయస్కులయిన బాలలతో పాటు, వారి తల్లిదండ్రులు ఓపిగ్గా ప్రదర్శనకు సహకరించారు. భారతీయ విద్యా భవన్స్ నాట్యాచారులు, భక్తి గీతాలతో నృత్య ప్రదర్శన, హావభావాలతో భక్తులను ఆకట్టుకున్నారు. భక్తులకు వైద్య సేవల కోసం సిబ్బంది కూడా అర్ధరాత్రి దాటే వరకు కూడా ఉన్నారు. పోలీసు వారు బందోబస్తు ఏర్పాటు చేసి, దర్శనం సాఫీగా సాగేలా సేవలు అందించారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు మల్లన్న పాగా పూర్తయ్యే వరకు వేచి ఉన్నారు. మల్లన్న పాగా ఏర్పాటు చేసే దృశ్యాన్ని చూడటం వల్ల జన్మతరిస్తుందని భక్తుల విశ్వాసం. జన్మకోశివరాత్రి అన్నట్టు, శివాలయాలలో భక్తుల రద్దీ కనిపించింది. జిల్లా పరిషత్ మాజీ అధ్యక్షులు, శాసనమండలి మాజీ సభ్యులు తిరుపతి దేవస్థానం ధర్మకర్త మేకా శేషుబాబు, స్థానిక వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కోడి విజయభాస్కర్, ఏఎంసీ మాజీ చైర్మన్, గాంధీ మెగా ఫౌండేషన్ అధ్యక్షులు గొట్టుముక్కల గాంధీ భగవాన్ రాజు తదితర ప్రముఖులు సతి సమేతంగా ఉదయం క్షీరా రామలింగేశ్వర దర్శనం చేసుకున్నారు. ఆలయ ట్రస్టీలు పినిశెట్టి శ్రీనివాస్, చిన్న, ఉప్పులపు పెద్దిరాజు, తదితర ధర్మకర్తలు తమ సేవలు అందించారు. కనకదుర్గ ఆలయ ధర్మకర్తల మండలి అధ్యక్షులు తులా రామలింగేశ్వర రావు అభిషేక కార్యక్రమానికి హాజరయ్యారు.

పూలపల్లి అన్నపూర్ణ అమృత లింగేశ్వర స్వామి వారు

పూలపల్లి లో వేంచేసి ఉన్న అన్నపూర్ణ అమృత లింగేశ్వర స్వామి వారి ఆలయంలో ఘనంగా శివరాత్రి పూజలు జరిగాయి. ఆలయ వద్ద ఏర్పాట్లు స్థానిక గాంధీ మెగా ఫౌండేషన్ అధ్యక్షులు గొట్టుముక్కల గాంధీ భగవాన్ రాజు పర్యవేక్షించారు. ఎలమంచిలి శివాలయంలో చైర్మన్ అడబాల శిమన్నారాయణ, ట్రస్ట్ బోర్డు సభ్యులు, కేశవ స్వామి దేవస్థానం చైర్మన్ చిలుకూరి ఆంజనేయులు భక్తులకు సేవలు అందించారు. భక్తి గీతాల ఆలాపన కార్యక్రమం జరిగింది. శివరాత్రి సందర్భంగా ఆచంటలో రథోత్సవం జరిగింది. ఈ కార్యక్రమంలో భక్తులు విశేషంగా పాల్గొన్నారు.

మల్లన్న తలపాగా సంధిస్తున్న దృశ్యం