యలమంచిలి: ఫిబ్రవరి,19(తెలుగు న్యూస్ పవర్) యలమంచిలి లో వేంచేసి ఉన్న శ్రీ శ్రీ శ్రీ మూలస్థానేశ్వరి అమ్మవారి నూతన ఆలయ ప్రవేశం సందర్భంగా జరుగుతున్న ఉత్సవాల్లో భాగంగా, గురువారం కుంకుమ పూజ జరిగింది. భక్తులు అధిక సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. విగ్రహాలు, శిఖరాలతో గ్రామ ప్రదక్షణ జరిగింది. విగ్రహాలకు భక్తులు పాలు,పూలు, సుగంధ ద్రవ్యాలతో అభిషేకం చేశారు. ఈ జలాధివాసం కార్యక్రమంలో భక్తులు విశేషంగా పాల్గొన్నారు. గవ్యాంతమార్జన, వాస్తు పూజ, వాస్తు హోమం, వాస్తుబలి, పర్యగ్నికరణం, ప్రాతరోపాసన, దిగ్దేవత బలిహరణ కార్యక్రమం మధ్యాహ్నం వరకు జరిగాయి. సాయంత్రం 252 మంది దేవతలకు ఆహ్వానం పలుకుతూ శాలార్చన కార్యక్రమం జరిగింది. 16 స్తంభాలతో నిర్మించిన యాగశాలలో, నాలుగు యుగాలు, నాలుగు వేదాలు, నాలుగు దిక్కులు, నాలుగు మూలల ఆయా దిక్పాలక దేవతలకు, ఘనాపాటీలు వేద మంత్ర పఠనం చేస్తుండగా,ఋత్వికులు యలమంచిలి కుమార్ విశేష పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమం భక్తులను మంత్రముగ్ధులను చేసింది. ధాన్యాధివాసం పంచశయ్యాధివాసం, త్రికుండలముల అంగ, ప్రత్యంగ శాంతి దీక్ష కళాహోములు, దిగ్దేవతా బలిహరణ, మంగళహారతితో రెండో రోజు పూజ కార్యక్రమాలు సంపూర్ణం అయ్యాయి. ఆలయ కార్యకర్తలు పూజాధికాలు జరిగే స్థలం భక్తులకు సౌకర్యవంతంగా ఏర్పాట్లు చేశారు. భక్తులు విశేషంగా తరలిరావడంతో యాగశాల ప్రత్యక్షంగా వీక్షించలేని వారి కోసం ఎల్ఈడి టీవీ స్క్రీన్లు ఏర్పాటు చేశారు. మహిళల రెండో రోజు అమ్మవారి ఆలయానికి అలంకరణ నిమిత్తం పూలమాలలు తయారు చేశారు. ఈ పూజా కార్యక్రమాల్లో తాళ్లూరి శ్రీనివాస్ ( వైజాగ్ బుజ్జి), శిరీష, మరో 9 మంది పుణ్య దంపతులు పాల్గొన్నారు. ఇతర ప్రాంతాల నుంచి, గ్రామస్తులు, మాతృభూమికి, యలమంచిలి ఇలవేల్పు విశేష ఘట్టాలు తిలకించడానికి తరలి వచ్చారు. అమ్మవారికి విశేషంగా కానుకలు సమర్పించారు.


