Telugu News Power

శ్రీశ్రీశ్రీ మూలస్థానేశ్వరి అమ్మవారి నూతన ఆలయ ప్రవేశం అపూర్వం.

అమ్మవారి నూతన ఆలయ అలంకారణ
మూలస్థానేశ్వరి అమ్మవారి తెప్పోత్సవం

యలమంచిలి: ఫిబ్రవరి,20(తెలుగు న్యూస్ పవర్) స్థానిక ఇలవేల్పు, శ్రీశ్రీశ్రీ మూలస్థానేశ్వరి అమ్మవారి నూతన ఆలయ ప్రవేశం నభూతో, నభవిష్యతి అన్న రీతిలో అపూర్వంగా, అద్భుతంగా జరిగింది. యలమంచిలి ఆధ్యాత్మిక చరిత్రలో, మరో 100 ఏళ్ళ వరకు ఇలాంటి ఘట్టం మళ్లీ ఆవిష్కృతం కావటం ఒక అరుదైన ఘట్టంగా గ్రామస్తులు అంచనా వేస్తున్నారు. అమ్మవారి నూతన ఆలయ బింబ- యంత్ర- శిఖర ప్రతిష్ఠామహోత్సవాలు శుక్రవారం అత్యంత వైభవంగా సంపూర్ణం అయ్యాయి. ఈనెల 18వ తేదీ నుంచి మొదలైన ఈ పూజా కార్యక్రమాలు వేద ఘోషతో గ్రామం మారుమోగిపోయింది. అమ్మవారు భక్తులను గ్రామోత్సవంలో అనుగ్రహించారు. యాగశాల వద్ద శుక్రవారం ఉదయం గణపతి పూజ, పుణ్యాహవాచనం పంచుగవ్యం ప్రోక్షణలు, గర్తన్యాసం, నవరత్నాన్యాసం, వీర్య ద్రవ్య నిక్షేపణ, ముహూర్త నిరీక్షణ జరిగాయి. ఉదయం 10 గంటల 35 నిమిషాల ముహూర్తానికి, మూలస్థానేశ్వరి అమ్మవారి యంత్ర బింబ శిఖర ప్రతిష్టలు, జీవన్యాసములు, మహా పూర్ణాహుతి, ఆచార్య పూజ, అగ్ని ప్రదక్షిణం కుంభం పోయుట, గోదృష్టి, కుష్మాండచ్ఛేదన, చేతన దీక్ష విరమణ, మహదాశీర్వచనం, అమ్మవారి ప్రథమ దర్శనం కార్యక్రమాలు జరిగాయి. బ్రహ్మశ్రీ కాళ్ళకూరి దుర్గాప్రసాద్ శర్మ, ఆచార్యత్వంలో జరిగిన ఈ ఆధ్యాత్మిక ఘట్టంలోని విశేషాలను సామాన్యులకు సైతం సవివరంగా అర్థమయ్యేలా వివరించడంతో, భక్తులు ఆసక్తిగా విన్నారు. వీరిని యాగశాల వద్ద నిర్వాహకులు తాళ్ళూరి శ్రీనివాస్ శిరీష దంపతులు ఘనంగా సత్కరించారు. వెంకటేశ్వర స్వామి ప్రతిమ చిత్రించిన 10 గ్రాముల బంగారు ఉంగరం బహుకరించారు. బ్రహ్మశ్రీ యలమంచిలి నరేంద్ర శర్మకు సత్కరిస్తూ, నాలుగు గ్రామల బంగారం బహుకరిస్తామన్నారు. యలమంచిలి కుమార్, సుబ్రమణ్యం, భాగవతుల ఆంజనేయులు, వాడపల్లి గోపి పలువురు ఋత్వికులకు తాంబూలం అందజేశారు. తెలంగాణ నుంచి వచ్చిన భక్తమాత భక్తులను ఆశీర్వదించారు. ఆవు దూడకు ముందుగా అమ్మవారి దర్శనం చేయించారు. భక్తులు తెచ్చిన బూరెలు అమ్మవారి ఆలయ శిఖరంపై వేశారు. భక్తులు శిఖర దర్శనం చేసుకున్నారు.ఈ పూజ కార్యక్రమాలను, శిఖర ప్రతిష్ట, అమ్మవారి ప్రథమ దర్శనం కోసం వేలమంది భక్తులు తరలివచ్చారు. యలమంచిలి గ్రామ మూలాలు ఉన్న పెద్దలు, ఆడపడుచులు, అల్లుళ్ళు ఎక్కడెక్కడ నుంచో ఈ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొన్నారు. దాదాపు మూడు వేల మందికి మహాప్రసాద కార్యక్రమంలో నవకాయ పిండి వంటలతో భోజనాలు ఏర్పాటు చేశారు. అధిక సంఖ్యలో వచ్చిన భక్తులకు ఇబ్బంది లేకుండా బఫే భోజనం ఏర్పాటు చేశారు. అమ్మవారి అనుగ్రహం కోసం వచ్చిన భక్తులకు, మహిళలకు గాజులు, రవికల గుడ్డ, పురుషులకు పట్టుకండువాతో సత్కరించారు. సాయంత్రం మూలస్థానేశ్వరి అమ్మవారు స్థానిక తాళ్లచెరువులో తెప్పోత్సవంలో భక్తులకు అనుగ్రహ దర్శనం చేశారు. ఇంతకుముందు అన్నాడు జరగని విధంగా ఈ తెప్పోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి, మాజీ ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్ రావు, మాజీ ఎమ్మెల్యే కొత్తపల్లి జానకిరామ్, పాలకొల్లు ఏఎంసీ చైర్మన్, కోడి విజయభాస్కర్, మాజీ జడ్పిటిసి బోనం నాని, ఎంపీపీ వినుకొండ ధనలక్ష్మి రవికుమార్, గొప్పల సుజాత హరికిషోర్, మాజీ ఎంపీపీ రావూరి వెంకటరమణా మురళీకృష్ణ, దేవాలయ
చైర్మన్ లు చిలుకూరి ఆంజనేయులు, అడబాల శ్రీమన్నారాయణ, కాసా సత్య, చివటపు నాగేశ్వరరావు ఎంపీటీసీ చిలుకూరి రాజ్యలక్ష్మి శ్రీనివాస్, పాల్గొన్నారు. నూతన ఆలయ నిర్మాణం నుంచి ప్రవేశం వరకు తాళ్లూరి శ్రీనివాస్ (వైజాగ్ బుజ్జి) ఆధ్వర్యంలో వారి బృందం కార్యక్రమం నిర్విఘ్నంగా పూర్తి కావటానికి తమ సేవలు విశేషంగా అందించారు. బొప్పన రాంబాబు (చిట్టి నాయుడు), శివ, శేషు, సాయి, అబ్బు, నాని ఇలా ఎందరో ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో తమ సేవలు అందించారు. ఇంత భారీ కార్యక్రమం, మూడు రోజులపాటు,అత్యంత విజయవంతంగా జరిగిన ఈ కార్యక్రమాల పట్ల నిర్వాహకులు భక్తుల నుంచి విశేషంగా అభినందనలు అందుకున్నారు. ఎంతో సమర్థవంతంగా, ఏ లోటు రాకుండా ఈ ఈ మహత్తరఘట్టం సంపూర్ణం అయింది.