Skip to main content

Telugu News Power

కొత్త ఉపాధి హామీ పథకం పై అవగాహన సదస్సులు.

పాలకొల్లు: మార్చి,2(తెలుగు న్యూస్ పవర్.కాం) కేంద్ర ప్రభుత్వం, ఉపాధి హామీ పథకాన్ని కొత్తగా,విబి-జి రామ్ జి (వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్‌గార్ & ఆజీవికా మిషన్–గ్రామీణ్) పథకం ప్రవేశపెట్టింది. ప్రజలకు ఈ పథకం పట్ల స్పష్టమైన అవగాహన కల్పించేందుకు మండలం లో 6 వారాల పాటు “విబి-జి రామ్ జి జన్-సంవాద్” కార్యక్రమాన్ని నిర్వహిస్తామని, స్థానిక మండల యం. పి. డి. ఓ యన్. ఉమామహేశ్వరరావు సోమవారం తెలిపారు.
ఈ కార్యక్రమం ద్వారా గ్రామీణ కుటుంబాలకు 125 రోజుల ఉపాధి హామీ, పారదర్శక చెల్లింపు విధానం, శ్రామికుల హక్కుల పరిరక్షణ, తదితర అంశాలపై 2026 ఫిబ్రవరి,25 నుంచి మార్చి 30 వరకు 6 వారాలపాటు విస్తృత ప్రచారం చేపడతామని పేర్కొన్నారు. గ్రామస్థాయి వరకు అవగాహన పెంపు కోసం మీడియా ప్రచారం, ప్రతిజ్ఞ కార్యక్రమాలు, గ్రామ సభలు, పాఠశాల కార్యక్రమాలు, పంచాయతీ రాజ్ ప్రతినిధులతో సమావేశాలు, శ్రామికుల సన్మానాలు వంటి కార్యక్రమాలు వారం వారీగా నిర్వహిస్తామని యం. పి. డి. ఓ వెల్లడించారు.
యం. పి. డి. ఓ యన్.ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ, భారత ప్రభుత్వం గత ఉపాధి హామీ పథకం పేరు మార్చి, విబి-జి రాం జి పథకాన్ని ప్రవేశపెట్టారు. గ్రామీణ కుటుంబాలకు సంవత్సరానికి 100–125 రోజుల పాటు ఉపాధి కల్పిస్తారు. కేంద్రం వాట 60 శాతం, రాష్ట్రం వాట 40 శాతం నిధులు ఈ పథకానికి కేటాయిస్తారు. వ్యవసాయ పనులు ముమ్మరంగా ఉన్నప్పుడు, సీజన్‌లో 60 రోజుల విరామం ప్రకటిస్తారు. పారదర్శక పాలన, దీర్ఘకాలిక గ్రామీణ ఆస్తుల సృష్టి వంటి ప్రయోజనాలను ఈ పథకం అందిస్తున్నదన్నారు.
జల సంరక్షణ, గ్రామీణ మౌలిక వసతులు, నైపుణ్య శిక్షణ కేంద్రాలు, మార్కెట్లు, పశుసంపద మరియు మత్స్య మౌలిక సదుపాయాలు, తుఫాను-వరద నియంత్రణ నిర్మాణాలు ఈ పథకం లో చేపడతారన్నారు.