Telugu News Power

పశ్చిమ బెంగాల్‌లో 91 లక్షల ఓట్ల తొలగింపు.

కొల్ కతా: ఏప్రిల్, 7(తెలుగు న్యూస్ పవర్.కాం)
ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాల్లో ఒకటైన పశ్చిమ బెంగాల్‌లో ఎన్నికల సంఘం ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ ఐ ఆర్) చేపట్టింది. ఈ సందర్భంగా, ఓటర్ల జాబితా నుంచి సుమారు 91 లక్షల మంది ఓటర్ల పేర్లు తొలగించినట్టు ఆ రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది.
ఎన్నికల సంఘం ఇప్పటికీ తుది జాబితా ప్రకటించలేదు. గత
ఫిబ్రవరి 28న విడుదలైన అధికారిక లెక్కల ప్రకారం, గత నవంబర్‌లో ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ ప్రారంభమైనప్పటి నుంచి 63.66 లక్షల పేర్లు (సుమారు 8.3 శాతం) తొలగించారు. ఓటర్లతొలగింపు తర్వాత, ఓటర్ల సంఖ్య 7.66 కోట్ల నుంచి 7.04 కోట్లకు తగ్గింది. బెంగాల్ మొత్తం
7.04 కోట్ల ఓటర్లలో 60.06 లక్షల ఓటర్లకు సంబంధించి విచారణ ఇంకా కొనసాగుతుంది.
ఈ 60.06 లక్షలలో 27.16 లక్షల మంది ఓటర్ల పేర్లు న్యాయాధికారుల సమీక్షలో తొలగించి నట్టు ఎన్నికల సంఘం లెక్కలు తేల్చాయి. విచారణలో
ఉన్న 32.68 లక్షల మంది ఓటర్లను కొనసాగించి, చివరి జాబితాలో చేర్చారు.
ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ ప్రారంభమైనప్పటి నుంచి మొత్తం తొలగింపుల సంఖ్య సుమారు 90.83 లక్షలు అని ఎన్నికల సంఘం లెక్కల్లో పేర్కొంది.
“ఈ సమీక్ష ప్రక్రియ దశలవారీగా, పారదర్శకంగా జరిగింది. పూర్తి జవాబుదారీతనం కోసం జిల్లాల వారీగా ఓటర్ల జాబితా సమాచారాన్ని ప్రస్తుతం ప్రజలకు అందుబాటులో ఉంచినట్టు” ఎన్నికల సంఘం సీనియర్ అధికారి వెల్లడించారు. విచారణలో ఉన్న
60.06 లక్షల ఓటర్లలో 59.84 లక్షల డేటాను ప్రచురించారు. మిగిలిన 22,163 కేసుల విచారణ జరిగింది.కానీ, ఇంకా ఆమోద ముద్ర పడలేదు.
“పెండింగ్ ప్రొసీజర్‌లు, ఈ-సైన్‌లు పూర్తయ్యాక తొలగింపులు, చేర్పులలో స్వల్ప మార్పులు రావచ్చు” అని అధికారి తెలిపారు.
ఈ ప్రక్రియ అధికారిక మార్గదర్శకాల ప్రకారం జరిగిందని, ఇక్కడి నుంచి మరిన్ని చేర్పులు చట్టపరమైన నిబంధనలు, అధికారుల ఆదేశాలపై ఆధారపడి ఉంటాయని అధికారులు వివరించారు.