Telugu News Power

మహిళా రిజర్వేషన్ సార్థకం చేసుకోవాలి.

మహిళా రిజర్వేషన్ బిల్లు పై మాట్లాడుతున్న ప్రిన్సిపాల్ రాజరాజేశ్వరి

పాలకొల్లు: ఏప్రిల్, 13 (తెలుగు న్యూస్ పవర్. కామ్)
స్థానిక శ్రీ అద్దేపల్లి సత్యనారాయణ మూర్తి ప్రభుత్వ స్వయంప్రతిపత్తి కళాశాల లో మహిళా సాధికారిత విభాగం, ఎన్.ఎస్.ఎస్ యూనిట్ల సంయుక్త ఆధ్వర్యంలో స్త్రీ శక్తి కార్యక్రమంలో “నారీ శక్తి వందన్ అధినియం- 2023 మహిళా రిజర్వేషన్ బిల్లు”అనే అంశంపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం సోమవారం నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపాల్ డా. టి. రాజ రాజేశ్వరి అధ్యక్ష్యోపన్యాసం చేస్తూ, భారత ప్రభుత్వం ప్రవేశపెట్టిన నారీ శక్తి వందన్ అధినియం (మహిళా రిజర్వేషన్ బిల్లు) మహిళల రాజకీయ సాధికారతకు ఏ విధంగా బాటలు వేస్తుందో వివరించారు. చట్టసభల్లో మహిళలకు ప్రాతినిధ్యం పెరగడం ద్వారా దేశాభివృద్ధిలో మహిళల పాత్ర మరింత క్రియాశీలం అవుతుందని వారు ఆకాంక్షించారు.కళాశాల వైస్ ప్రిన్సిపల్ టి.కృష్ణ విద్యార్థినులు చట్టాల పట్ల అవగాహన కలిగి ఉండాలని, నాయకత్వ
లక్షణాలను పెంపొందించుకోవాలని, నారీ శక్తి వందన్ అధినియం ద్వారా లభించే 33 శాతం రిజర్వేషన్ల ప్రాముఖ్యతను గూర్చి వివరించారు.
డా. ఎం. రామకృష్ణ దశాబ్దాల కాలంగా పెండింగ్‌లో ఉన్న మహిళా రిజర్వేషన్ బిల్లు ‘నారీ శక్తి వందన్ అధినియం’ రూపంలో చట్టంగా మారడం భారత ప్రజాస్వామ్య చరిత్రలో ఒక మైలురాయి అని కొనియాడారు. లోక్‌సభ మరియు రాష్ట్ర శాసనసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించడం ద్వారా నిర్ణయాధికారంలో మహిళల భాగస్వామ్యం పెరుగుతుందని తెలిపారు.
మహిళా సాధికారిక విభాగం, కన్వీనర్ బి. కె. వి. రామలక్ష్మి మాట్లాడుతూ, కేవలం చట్టాలు వస్తే సరిపోదని, మహిళలు విద్యావంతులై తమ హక్కుల పట్ల అవగాహన పెంచుకున్నప్పుడే నిజమైన సాధికారత సాధ్యమవుతుందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థినులకు వ్యాసరచన మరియు వక్తృత్వ పోటీలను ్నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కళాశాల అకడెమిక్ కోఆర్డినేటర్ డా.వి. యామిని, అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది మరియు విద్యార్థిని విద్యార్థులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.