Telugu News Power

పత్రికా రంగంలో మాడభూషి సేవలు చిరస్థాయిగా నిలిచిపోతాయి. -ఐజేయూ కార్యదర్శి దూసనపూడి.

కృష్ణ ప్రసాద్ కు మౌననివాళి
కృష్ణ ప్రసాదు సంతాప సభలో మాట్లాడుతున్న సోమసుందర్

పాలకొల్లు: ఏప్రిల్, 20(తెలుగు న్యూస్ పవర్. కామ్).పత్రికా రంగంలో మాడభూషి కృష్ణ ప్రసాద్ సేవలు చిరస్థాయిగా నిలిచిపోతాయని ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ (ఐజేయు) ప్రధాన కార్యదర్శి దూసనపూడి సోమ సుందర్ పేర్కొన్నారు. కదిలే విజ్ఞాన సర్వస్వం గా ఖ్యాతిగాంచిన మాడభూషి కృష్ణ ప్రసాద్ మరణానంతరం 13 రోజు సోమవారం, కృష్ణ ప్రసాద్ స్వగృహం వద్ద ఆయన అనుచరులు, అభిమానులు సంతాప సభ నిర్వహించారు. రసధుని అధ్యక్షులు, స్వచ్ఛంద సేవకులు యర్రంశెట్టి వెంకటరత్నం సభా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సోమసుందర్ మాట్లాడుతూ, వారి సోదరి, ప్రిన్సిపల్ జ్యోతి కుమారి ద్వారా తనకు పరిచయమైన కృష్ణ ప్రసాద్ కు స్వీయ ప్రతిభ ఉన్నట్టు గ్రహించానన్నారు. ఆయన రచనలపై అభిమానంతో వారు రాసిన పుస్తకాల చేతివ్రాత ప్రతులను స్వయంగా మూడేసి సార్లు తిరిగి రాసిన సందర్భాలు కూడా ఉన్నాయని గుర్తు చేసుకున్నారు. పత్రికా రంగులో లబ్ద ప్రతిష్టలైన వారు ఉన్నప్పటికీ, వారి ఆత్మ కథల వరకు మాత్రమే రాసుకున్నారని, కృష్ణ ప్రసాద్ అత్యంత ప్రామాణికమైన పరిశోధన గ్రంథాన్ని పత్రికా ప్రపంచానికి అందించారని కొనియాడారు. భారతీయ పత్రిక రంగ చరిత్ర పై ఆయన రాసిన గ్రంధాన్ని వెలువరించడానికి జరుగుతున్న ప్రయత్నాల్లో భాగంగా, కృష్ణ ప్రసాద్ శిష్యులు ఇన్కమ్ టాక్స్ అధికారి బ్రహ్మాజీ తానే ముద్రిస్తానని ముందుకు రావటం, వారి శిష్యులకు ఉన్న అభిమానం, నమ్మకం ఎంతో గొప్పవని గ్రహించానన్నారు. తెలుగులో ముద్రితమైన భారతీయ పత్రికా రంగ చరిత్ర ఆంగ్లంలోకి తర్జుమా చేయడం కాకుండా, కొత్తగా రాయమని చెప్పి మరో గొప్ప “హిస్టరీ ఆఫ్ ఇండియన్ జర్నలిజం” కావ్యాన్ని ఆవిష్కరించగలిగామన్నారు. ఈ పుస్తకాన్ని పట్నాలో జరిగిన, ఎమ్మెల్యేలు,మంత్రులు ఎంపీలు, ప్రముఖ జర్నలిస్టు లు పాల్గొన్న జాతీయ స్థాయి సమావేశంలో ఆవిష్కరించడం కృష్ణ ప్రసాద్ జ్ఞాన స్థాయికి సమచిత గౌరవం దక్కిందన్నారు. కృష్ణ ప్రసాద్ పత్రిక రంగంలో చేసిన కృషిని వారు కొనియాడారని తెలిపారు. ఒక ఉపాధ్యాయుడు జాతీయస్థాయి పత్రికారంగ చరిత్ర అంత అద్భుతంగా చిత్రించగలగటం ఆ రంగంలో నిష్ణాతులైన వారు కూడా ఆశ్చర్యపోయే వారన్నారు. చిన్నప్పటినుంచి కృష్ణ ప్రసాద్ ఉన్న కల ఈ పుస్తకం ద్వారా నెరవేరిందని సోమ సుందర్ తెలిపారు. పత్రికా రంగంలో శిఖర సమానులు పొత్తూరి వెంకటేశ్వరరావు, అల్లం నారాయణ,
జీ. వరదాచార్యులు వంటి వారి సమక్షంలో తెలుగులో భారతీయ పత్రిక రంగ చరిత్ర ఆవిష్కరించారన్నారు. ప్రసిద్ధ పబ్లిషర్స్ ఈ పుస్తకాలను ముద్రించడం వారి ప్రతిభకు గుర్తింపు తెచ్చిందన్నారు. పత్రికా రంగంలో ఇంతవరకు తూలనాత్మక అధ్యయనం జరగలేదని, కృష్ణ ప్రసాద్ ఈ విషయాన్ని చాలా సాధికారతతో రచించారన్నారు. అందువల్లనే రాసిన జర్నలిజం పుస్తకాలు విశ్వవిద్యాలయాల్లో పాఠ్య గ్రంధాలుగా గణ కీర్తిని సొంతం చేసుకున్నాయన్నారు. బీహార్ లోని నలంద విశ్వవిద్యాలయం దర్శించి ఎంతో గొప్ప అనుభూతిని, ఆనందాన్ని పొందారని తెలిపారు. పత్రిక రంగ 20 మంది ప్రముఖుల మోనోగ్రాఫ్ ఎంపిక కమిటీలో ఆయన సూచించిన పేర్లే 16 ఉన్నాయంటే ఆనందం పట్ల వారికున్న ట్టు ఎలాంటిదో తెలుసుకోవచ్చునన్నారు. కృష్ణ ప్రసాద్ సేవలు మరింత కాలం పొందటానికి చూస్తున్న సమయంలో, ఆయన అస్తమించడం తీరని లోటుని సంతాపం వ్యక్తం చేశారు. పాలకొల్లు చరిత్రకారులు వంగా నరసింహా రావు మాట్లాడుతూ, తనను ఎవరైనా పాలకొల్లు ప్రాముఖ్యత గురించి అడిగితే, పాలకొల్లు పెద్ద గోపురం,చిన్న గోపురంలా ప్రసిద్ధి పొందిన వ్యక్తులు ఇద్దరు ఉన్నారని, వారిలో ఒకరు కృష్ణ ప్రసాద్ కాగా. రెండోవారు ప్రసిద్ధి చిత్రకారుడు ఉదయ్ కుమార్ అని చెబుతానన్నారు. కృష్ణ ప్రసాద్ కు చిన్నతనం నుంచే రచనల పట్ల అభినివేశం ఉందన్నారు. డాక్టర్ బాబ్జి కి అత్యంత ఆత్మీయులైన వారు కృష్ణ ప్రసాద్ అని తెలిపారు. సామాజికవేత్త, కదలిక అధ్యక్షులు, విశ్రాంతి సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయులు పోలిశెట్టి గోఖలే, మాట్లాడుతూ, మార్కెట్ శక్తుల మాయాజాలంలో పడిపోకుండా, రాజకీయ రంగం విషవలయంలో చిక్కుకోకుండా నిర్దిష్టంగా నిలబడి, తన వ్యక్తిత్వాన్ని నిలుపుకున్న సామాజిక దృక్పథం గల వ్యక్తి, శక్తి, కృష్ణ ప్రసాదం కొనియాడారు. తన కొడుకులు దగ్గరనుంచి మనవల వరకు ఆయనకు శిష్యులుగా ఉన్నారని తెలిపారు. పెన్షనర్ల సంఘ అధ్యక్షులు డాక్టర్ ప్రతాప్ రాజు మాట్లాడుతూ, కృష్ణ ప్రసాద్ కు దేశీయ వైద్యంపై ఉన్న అపారనమ్మకంతో అలోపతి వైద్యాన్ని తిరస్కరించారని, లేదంటే వారు బ్రతికే వారిని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇతర దేశాల్లో అయితే కృష్ణ ప్రసాద్ లాంటి ప్రజ్ఞగల వారిపై పరిశోధనలు జరిగేవన్నారు. యుటిఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి, పోలిశెట్టి క్రాంతి కుమార్ మాట్లాడుతూ, కృష్ణ ప్రసాద్ ఆశయాలను, ఆగిపోయిన ప్రాజెక్టులను కొనసాగించడానికి బలమైన ప్రయత్నం చేయవలసి ఉందని సూచించారు. కవి డాక్టర్ కోలాటి పెద్దిరాజు మాట్లాడుతూ, తనను కవిగా తీర్చిదిద్దడానికి తనకు ఎంతో స్ఫూర్తివంతమైన ప్రోత్సాహం అందించారని నివాళులు అర్పించారు. మధురకవి మంకు శ్రీను తో పాటు తాను వ్రాసిన పద్యాన్ని అన్నపూర్ణేశ్వరరావు చదివి వినిపించారు. ఈ కార్యక్రమంలో, కృష్ణ ప్రసాద్, కుమారులు మనోహర్, రాజన్, బంధువులు, రాఘవాచార్యులు, మురళి,విశ్రాంత తహసిల్దార్ సీత, అజయ్ కుమార్, కానుకోలను శ్రీనివాసరావు, పవన్, జడ్డు సాయి బాబా, రామేశ్వరపుసత్యనారాయణ, జామాను రామలక్ష్మణరావు, నాటక రంగ ప్రముఖులు తాళాబత్తుల వెంకటేశ్వరరావు, శ్రీశ్రీ, గరగ కనగరాజు, శీలం ఆంజనేయస్వామి, గంధం కుమారస్వామి రాజా, అడ్డాల దేవేంద్రుడు తదితరులు పాల్గొన్నారు.