Telugu News Power

మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర్ రావు మృతి.

హైదరాబాద్: ఏప్రిల్, 22 (తెలుగు న్యూస్ పవర్. కామ్) ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర్ రావు (90) బుధవారం కన్నుమూశారు. వయో భారం వల్ల వచ్చే అనారోగ్య సమస్యలకు నాదెండ్ల చికిత్స తీసుకుంటున్నారు. కాంటినెంటల్ ఆసుపత్రి వీరికి వైద్య సేవలు అందించారు. వీరి కుమారుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. భాస్కర్ రావు భౌతిక కాయాన్ని జూబ్లీహిల్స్ నివాసం వద్ద బంధువులు, అభిమానల సందర్శనార్థం ఉంచారు. పంజాగుట్ట స్మశాన వాటికలో గురు వారం అంత్యక్రియలు జరుగుతాయని కుటుంబ వర్గాలు తెలిపాయి. వీరు 1935లో జూన్ 23న గుంటూరులో జన్మించారు. ఉస్మానియా యూనివర్సిటీలో న్యాయ శాస్త్రం పట్టా పొందారు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచి 1978లో అసెంబ్లీలో అడుగు పెట్టారు. మర్రి చెన్నారెడ్డి, టి.అంజయ్య మంత్రివర్గాల్లో పనిచేశారు. అప్పటి నుంచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్ర తిరగ రాసిన రాజకీయ మేధావి నాదెండ్ల భాస్కరరావు పేరుగాంచారు. కాంగ్రెస్ పార్టీకి 1982లో రాజీనామా చేశారు. అప్పటివరకు సినిమాల్లో నటిస్తున్న అన్న ఎన్టీఆర్ చేత తెలుగుదేశం పార్టీ స్థాపింపజేశారు. టిడిపి పార్టీ 1983 అఖండ విజయం సాధించి, కాంగ్రెస్ పార్టీ ని మట్టి కరిపించడానికి వెనుకఉన్న మాస్టర్ మైండ్ నాదెండ్ల భాస్కర్ రావుది అంటే అతిశయోక్తి లేదు. క్యాబినెట్లో ఎన్టీఆర్ భాస్కరరావుకు ఆర్థిక శాఖ అప్పగించారు. పార్టీలో నంబర్ 2 స్థానంలో నాదెండ్ల స్థిరపడ్డారు. ఈ నేపథ్యంలో, ఎన్టీఆర్ ముఖ్యమంత్రి పదవి నాదెండ్లకు అప్పగించి, గుండె చికిత్స నిమిత్తం అమెరికా వెళ్లారు. ఇదే అదునుగా నాదెండ్ల తన రాజకీయ శక్తియుక్తులను ప్రయోగించి కాంగ్రెస్ పార్టీ అండతో ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించారు. అప్పటి గవర్నర్ రామ్ లాల్ సహాయంతో గట్టెక్కారు. రాజకీయాల్లో ఈ ఘట్టం పెను సంచలనం సృష్టించింది. ఆ తరం యువతరానికి, బడి పిల్లలకు నాదెండ్ల భాస్కర్ రావు పేరు సుపరిచితం. నాడు ప్రజాస్వామ్య పునరుద్ధరణకు ముఖ్యమంత్రి పదవి తిరిగి పొందటానికి జరిగిన ధర్మ యుద్ధంలో లక్షలాది మంది పాల్గొన్నారు. ఈ వెనక ఆ రోజుల్లో చంద్రబాబు నాయుడు కర్త కర్మ క్రియగా ఉన్నారు. ఈ అపూర్వ ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమం పట్ల ఇందిరా గాంధీ సహితం హతాసురాలై తిరిగి ఎన్టీఆర్ కు ముఖ్యమంత్రి పదవి కట్టబెట్టవలసిన పరిస్థితి వచ్చింది. నాదెండ్ల భాస్కర్ రావు కేవలం ఆగస్టు,16-సెప్టెంబర్,16, (1984)మధ్య ఒక్క నెల రోజులు మాత్రమే ముఖ్యమంత్రిగా పదవిలో ఉన్నారు. ఈ సందర్భంగా, 400 కోట్ల రూపాయల విలువైన చిరాన్ ప్యాలెస్ ఫైల్ నాదెండ్ల భాస్కరరావు పేరుతో ముడిపడి చాలా కాలం వార్తలకి ఎక్కింది. అనంతర పరిణామాలతో నాదెండ్ల మళ్లీ సొంత గూటికి చేరుకుని ఎమ్మెల్యేగా, ఎంపీగా పదవులు చేపట్టారు. నాదెండ్ల చివరిఘట్టంలో అమిత్ షా సమక్షంలో 2019లో బిజెపిలో చేరారు. నాదెండ్ల తిరుగుబాటు వెనక ఎన్టీఆర్ నియంతృత్వ ధోరణి కారణం అని విశ్లేషకులు చెబుతారు. ఏది ఏమైనా ఆంధ్ర రాష్ట్రానికి కొత్త దిశా నిర్దేశం చేసే పార్టీని తెలుగువారికి అందించిన ఘనత నాదెండ్ల భాస్కర్ రావు దక్కుతుంది. ఎన్టీఆర్ రాజకీయ పార్టీ ఆవిర్భావానికి నాదెండ్ల కృషి అనితర సాధ్యం అయినది. ఎన్నికల్లో నాదెండ్ల పార్టీ అభ్యర్థులను ప్రకటించడంతో తమ పేరు చూసుకొని ఆయన శిష్యులు ఆనందపడ్డారు. చాలామంది పోటీ జోలికి పోలేదు. చాలా ఇంటర్వ్యూలో నాదెండ్ల నిర్భయంగా అందరి జాతకాలు బయట పెట్టేవారు. భాస్కరరావు మృతి పట్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్, దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తదితర పలువురు ప్రముఖులు వారి కుమారుడు నాదెండ్ల మనోహర్ కు సంతాపం తెలియజేశారు.