Telugu News Power

రేట్లు పెంచే దాణా కంపెనీలను బహిష్కరిస్తాం. -రొయ్యల రైతులు హెచ్చరిక

పాలకొల్లు:మే, 8(తెలుగు న్యూస్ పవర్. కామ్) రొయ్యల దాణ ధరలు ఎవరు ముందు పెంచితే, వారి ఉత్పత్తులు బహిష్కరిస్తామని రొయ్యల రైతులు తీవ్రంగా హెచ్చరించారు. స్థానిక జై భారత్ క్షీరా రామ ఆక్వా సంఘం శుక్రవారం సమావేశమై, ఈ నిర్ణయం ప్రకటించారు. సంఘ అధ్యక్షులు గొట్టుముక్కల గాంధీ భగవాన్ రాజు, ఈ సందర్భంగా మాట్లాడుతూ, ముడి సరుకుల ధరలు పెరిగాయని వెంటనే ఫీడ్ ధరలు పెంచడం పట్ల రాజు అసంతృప్తి వ్యక్తం చేశారు. గతంలో మూడేళ్ల పాటు ముడి సరుకులు ధరలు తగ్గించినప్పటికీ, ఫీడ్ ధర తగ్గించలేదని గుర్తు చేశారు. యుద్ధం బూచి చూపించి, తక్షణమే ఫీడ్ ధరలు పెంచడం పట్ల రైతులు ఇబ్బందులు ఫాలవుతారని తెలిపారు. ఇప్పటికే కిలోకు రూ. 4లు పెంచారని, మళ్లీ అప్పుడే, కిలోకు రూ. 25 ల ధర పెంచడం రొయ్యల రైతుల పరిస్థితి మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్టు అవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. రొయ్యల రైతులు సమస్యలు పట్టించుకోకుండా, ఈ విధంగా ధరలు పెంచుతూ పోతే ఆక్వా రంగం క్రాప్ హాలిడే ప్రకటించే పరిస్థితి వస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇటీవల వీరవాసరంలో జరిగిన, రొయ్యల రైతుల ఉద్యమంలో, ప్రాసెసింగ్ ప్లాంట్ల యాజమాన్యాలు కుదుర్చుకున్న ఒప్పందం మేరకు హామీలు ఏవి అమలులోకి ఇంతవరకు రాలేదన్నారు. ఆచంట, నర్సాపురం, భీమవరం, ఉంగుటూరు, ఉండి రైతులతో కలిసి ఈనెల 13న స్థానిక ఆక్వా రైతు సంఘం ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయి సదస్సుకు సన్నాహాలు చేస్తున్నట్టు తెలిపారు. ఈ సమావేశం లో చేసిన తీర్మానాలతో అమలాపురంలో భారీ రాష్ట్రస్థాయి ఆక్వా రైతు సదస్సు లో ప్రభుత్వ దృష్టికి, ఫీడ్ ఫ్యాక్టరీల దృష్టికి తమ సమస్యలను తీసుకువెళతామన్నారు. ఫీడ్ ఫ్యాక్టరీలు, రైతులు ఒకరికొకరు లాభం పొందేలా కలిసి పనిచేయాలని భగవాన్ రాజు హితువు పలికారు. ఈ సమావేశంలో, ఉపాధ్యక్షులు పెనుమత్స వెంకట సత్యనారాయణ రాజు, గొట్టుముక్కల మురళీకృష్ణంరాజు, డి నాగబాబు శ్రీనివాసరాజు, శ్రీహరి రాజు, బుద్ధ రాజు బాపిరాజు తదితరులు పాల్గొన్నారు.