పశ్చిమ గోదావరి జిల్లా గణపవరం మండలం, ఎస్. కొండేపాడు గ్రామంలో జరిగిన కలుషితఆహారం (ఫుడ్ పాయిజనింగ్) ఘటనపై జిల్లా యంత్రాంగం యుద్ధప్రాతిపదికన స్పందించింది. ఈ ఘటనలో అస్వస్థతకు గురై భీమవరంలోని ఇంపీరియల్,భీమవరం ఆసుపత్రులలో చికిత్స పొందుతున్న 12 మంది బాధితులను జిల్లా కలెక్టర్ సి. నాగరాణి, జిల్లా ఎస్పీ శ్రీ అద్నాన్ నయీం అస్మి,జాయింట్ కలెక్టర్ టి. రాహుల్ కుమార్ రెడ్డి బుధవారం పరామర్శించారు. వీరితో పాటు ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఉపసభాపతి, ఉండి నియోజకవర్గ ఎమ్మెల్యే కనుమూరు రఘురామకృష్ణంరాజు, ఉంగుటూరు ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజు కూడా ఆసుపత్రులను సందర్శించి బాధితుల ఆరోగ్య పరిస్థితిని సమీక్షించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్, అధికారులు బాధితులతో స్వయంగా మాట్లాడి, ఘటన జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు. బాధితులకు, వారి కుటుంబ సభ్యులకు భరోసా కల్పిస్తూ, ఎటువంటి ఆందోళన చెందవద్దని ధైర్యం చెప్పారు. అనంతరం వైద్య అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించిన కలెక్టర్, బాధితులకు అందిస్తున్న చికిత్స, అందుబాటులో ఉన్న వైద్య సౌకర్యాలను క్షుణ్ణంగా పరిశీలించారు. చికిత్సలో ఎటువంటి జాప్యం జరగకుండా, అత్యుత్తమ వైద్య సేవలు అందించాలని వైద్యులను ఆదేశించారు. బాధితకుటుంబాలకు ప్రభుత్వం తరపున పూర్తి స్థాయిలో సహాయ సహకారాలు అందిస్తామని, ఘటనకు గల కారణాలపై విచారణ చేపట్టి బాధ్యులపై తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని కలెక్టర్ స్పష్టం చేశారు. జిల్లా ఎస్పీ మరియు ఇతర అధికారులు క్షేత్రస్థాయిలో పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నట్టు కలెక్టర్ తెలిపారు.
ఎస్. కొండేపాడు బాధితులకు మెరుగైన వైద్యం – పరామర్శించిన జిల్లా కలెక్టర్, ఉన్నతాధికారులు.
బాధితులను పరామర్శిస్తున్న కలెక్టర్ నాగరాణి, ఎస్పీ హష్మి